- Home
- Sports
- Cricket
- మేమే కాదు.. వాళ్లూ బాల్ టాంపరింగ్ చేశారు.. కానీ ఆ పుటేజీని తీసేశారు.. సౌతాఫ్రికాపై టిమ్ పైన్ షాకింగ్ కామెంట్స్
మేమే కాదు.. వాళ్లూ బాల్ టాంపరింగ్ చేశారు.. కానీ ఆ పుటేజీని తీసేశారు.. సౌతాఫ్రికాపై టిమ్ పైన్ షాకింగ్ కామెంట్స్
2018 Sandpaper Gate Scandal: 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా జట్టులో బాల్ టాంపరింగ్ వివాదం ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. తాజాగా ఈ వివాదంపై ఆ జట్టు మాజీ సారథి స్పందించాడు.

‘సాండ్ పేపర్ గేట్ స్కాండల్’గా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన ‘బాల్ టాంపరింగ్’ వివాదం 2018లో ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. బాల్ రూపును మార్చడానికి నాటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనింగ్ బ్యాటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ లు బంతిని టాంపరింగ్ మార్చారు.
ఈ వివాదంతో స్మిత్, వార్నర్ పై ఏడాది, బాన్‌క్రాఫ్ట్ పై 9 నెలల నిషేధం పడింది. మూడో టెస్టు తర్వాత ఆసీస్ వీరిపై నిషేధం విధించడంతో కేప్‌టౌన్ లో జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్ జట్టు పగ్గాలు వికెట్ కీపర్ టిమ్ పైన్ కు అందాయి.
అయితే తాజాగా పైన్ తాను రాసిన ‘ది పేడ్ ప్రైస్’ అనే పుస్తకంలో మాత్రం సంచలన విషయాలు వెల్లడించాడు. బాల్ టాంపరింగ్ చేసింది ఆసీస్ ఆటగాళ్ల మాత్రమే కాదని.. దక్షిణాఫ్రికా కూడా కేప్ టౌన్ టెస్టులో ఇదే విధంగా చేసిందని ఆరోపించాడు. ఇప్పుడీ పుస్తకం ఆస్ట్రేలియా క్రికెట్ లో సంచలనం రేపుతున్నది.
ఈ పుస్తకంలో పైన్ ఆ ఉదంతం నాటి ఘటనను ఇలా రాసుకొచ్చాడు... ‘2018లో దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా కేప్‌టౌన్ లోని న్యూవాండరర్స్ లో జరిగిన చివరి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డారు. అప్పుడు నేను బౌలర్ ఎండ్ లో నిల్చున్నాను. సౌతాఫ్రికా ప్లేయర్ (పేరు చెప్పలేదు) ఒకరు మిడాఫ్ లో బంతిని టాంపరింగ్ చేయడం నేను చూశాను.
అది టీవీ స్క్రీన్ లో కూడా కొద్దిసేపు కనబడింది. కానీ ఏమైందో తెలియదు గానీ వెంటనే కెమెరా ఆ ఆటగాడి నుంచి పక్కకు జరిగింది. ఆ పుటేజీని కూడా తర్వాత తొలగించారు. ఆ విషయాన్ని మేం అంపైర్లకు సూచించాం. కానీ వాళ్లు అడిగితే బ్రాడ్కాస్టర్లు ఆ పుటేజీ లేదని, మిస్ అయిపోయిందని చెప్పారు..’అని పేర్కొన్నాడు.
పైన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ తో పాటు దక్షిణాఫ్రికా క్రికెట్ లో కూడా చర్చకు తెరతీశాయి. కానీ సఫారీ ఫ్యాన్స్ మాత్రం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్రికెట్ ప్రపంచకప్ సాగుతున్న నేపథ్యంలో తన పుస్తకాన్ని అమ్ముకోవడానికే పైన్ ఇలా పిచ్చిరాతలు రాసుకున్నాడని వాపోతున్నారు.
అమ్మాయిలకు అసభ్యకర సందేశాలు పంపేవాడి నుంచి ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. మరి పైన్ చేసిన ఈ కామెంట్స్ ఎటువంటి చర్చకు దారితీస్తాయో చూడాలి. కాగా 2017లో ఓ అమ్మాయితో అసభ్యకరంగా చాట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కున్న పైన్.. గతేడాది యాషెస్ సిరీస్ కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం విదితమే.