- Home
- Sports
- Cricket
- సారీ.. ఆ ప్రశ్న ఇండియాలో అడిగినా నేను సమాధానం చెప్పను : భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
సారీ.. ఆ ప్రశ్న ఇండియాలో అడిగినా నేను సమాధానం చెప్పను : భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ENG vs IND T20I: గతేడాది జట్టులోకి వస్తూ పోతూ ఇక కెరీర్ ముగిసిందనుకుంటున్న తరుణంలో కమ్ బ్యాక్ లో అదరగొడుతున్నాడు టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కొత్త బంతితో స్వింగ్ ను రాబడుతూ ఇంగ్లాండ్ ను ఆదిలోనే దెబ్బకొడుతున్నాడు ఈ వెటరన్ పేసర్.
ఇంగ్లాండ్ తో తొలి టీ20లో జోస్ బట్లర్ ను ఔట్ చేసిన బంతితో పాటు శనివారం నాడు జరిగిన రెండో టీ20లో జేసన్ రాయ్, బట్లర్ లను అద్భుత డెలివరీలతో ఔట్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ఏడాది మేలో ముగిసిన ఐపీఎల్-15 సీజన్ నుంచి భువీ అదరగొడుతున్నాడు. స్వదేశంలో సఫారీలతో జరిగిన ఐదుమ్యాచుల టీ20 సిరీస్ లో కూడా అతడి హవా కొనసాగింది.
అయితే గతేడాది భువీ గాయాల కారణంగా కొద్దికాలం పాటు జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్ తో కమ్ బ్యాక్ ఇచ్చి అదరగొడుతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో రెండో టీ20 అనంతరం భువీకి ఇదే ప్రశ్న ఎదురైంది.
మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కు చెందిన మైకేల్ అథర్టన్ అడిగిన ప్రశ్నకు భువీ సమాధానం చెబుతూ.. ‘నిజంగా చెప్పాలంటే సారీ.. నేను ఈ ప్రశ్నకు ఇక్కడే కాదు. ఇండియాలో కూడా సమాధానం చెప్పదలుచుకోలేదు. నేనెప్పుడూ ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయను. అందుకు మీకు సారీ. కానీ నేనిప్పుడు అప్పటికంటే మంచి క్రికెట్ ఆడుతున్నాననే అనుకుంటున్నాను..’ అని చెప్పుకొచ్చాడు.
తాను గతంలో ఇంగ్లాండ్ పర్యటనలకు వచ్చినప్పుడు బంతి ఇలా స్వింగ్ అవలేదని.. కానీ ఇప్పుడు మాత్రం బాల్ బాగా స్వింగ్ అవుతుందని భువీ చెప్పాడు. దీనివల్ల పేసర్లకు వికెట్లు తీయడంతో పాటు ఇంకా బాగా బౌలింగ్ చేయాలనే స్ఫూర్తి కలుగుతుందని తెలిపాడు.
ఇదిలాఉండగా.. శనివారం నాటి మ్యాచ్ లో తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ వికెట్ తీయడం ద్వారా భువీ అరుదైన ఘనతను సాధించాడు. టీ20లలో తొలి ఓవర్లోనే అత్యధిక వికెట్లు (టెస్టులు ఆడే దేశాలపై) తీసిన బౌలర్ గా రికార్డులకెక్కాడు.
రాయ్ వికెట్ తీయడం ద్వారా భువీ.. తొలి ఓవర్లో 14 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో తర్వాత డేవిడ్ విల్లీ (13), ఏంజెలో మాథ్యూస్ (11), టిమ్ సౌథీ (9) లు ఉన్నారు.