- Home
- Sports
- Cricket
- అన్నీ సాధించానని అనుకుంటున్నావా..? ఇదేనా నీ అటిట్యూడ్..? కోహ్లిపై పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
అన్నీ సాధించానని అనుకుంటున్నావా..? ఇదేనా నీ అటిట్యూడ్..? కోహ్లిపై పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Virat Kohli: గెలిచినప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్లు ఎంత మంది ఉన్నారో తెలియదు గానీ ఓడుతున్నప్పుడు వెంటపడి రాళ్లేసే వాళ్లు ఎక్కువయ్యారు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి. తాజాగా అతడి ఫామ్ పై..

ఒకప్పుడు ప్రపంచంలో అగ్రశ్రేణి బౌలర్లందరికీ సింహస్వప్నంలా నిలిచి క్రికెట్ చరిత్ర పుస్తకాలలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ప్రస్తుతం దారుణంగా విఫలమవుతూ విమర్శలకు గురవుతున్నాడు.
రెండున్నరేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ లేక.. ఆడిన మ్యాచ్ లో కూడా 30, 40 పరుగులు చేస్తే గొప్ప అన్న రీతిలో ఆడుతూ తన అభిమానులకు కూడా విసుగు తెప్పిస్తున్న కోహ్లిపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అసలు కోహ్లికి అటిట్యూడ్ ఉందా..? అతడు ప్రపంచ నెంబర్ వన్ బ్యాటరా..? అని ఘాటుగా ప్రశ్నించాడు అఫ్రిది. పాకిస్తాన్ కు చెందిన ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘క్రికెట్ లో అటిట్యూడ్ చాలా ముఖ్యం. నేనెప్పుడూ దాని గురించే మాట్లాడతా. విరాట్ కోహ్లి కెరీర్ ఆరంభంలో ప్రపంచంలో నెంబర్ వన్ బ్యాటర్ కావాలని కోరుకునేవాడు. ఆ మేరకు ఆడేవాడు.
కానీ కొద్దిరోజులుగా కోహ్లిని చూస్తుంటే అతడింకా అదే మోటివేషన్ (వరల్డ్ నెంబర్ బ్యాటర్) తో ఆడుతున్నాడా..? ఇప్పుడు అది చాలా పెద్ద ప్రశ్న. విరాట్ కోహ్లి క్లాస్ ప్లేయర్ అనడంలో సందేహమే లేదు.
కానీ అతడు మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ కావాలని కోరుకుంటున్నాడా..? లేకుంటే ఇప్పటికే క్రికెట్ కెరీర్ లో చాలా సాధించాను. ఇంక సాధించేది ఏదీ లేదు. ఇక హాయిగా ఇంట్లో కూర్చుని రిలాక్స్ అవుతూ టైమ్ పాస్ చేద్దామనుకుంటున్నాడా..? ఇదంతా అటిట్యూడ్ కు సంబంధించిన విషయం..’ అని ప్రశ్నించాడు.
2020 నుంచి కోహ్లి అంతర్జాతీయ సెంచరీ చేయలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో కూడా విరాట్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. తన ఐపీఎల్ కెరీర్ లో తొలిసారి కోహ్లి.. ఒకే సీజన్ లో మూడు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
అయితే తీరిక లేని క్రికెట్ ఆడటం వల్లే కోహ్లి ఇలా ఫామ్ కోల్పోయాడని.. కొన్ని రోజులు అతడు క్రికెట్ కు విరామమిచ్చి విశ్రాంతి తీసుకుని తర్వాత ఆడాలని చాలా మంది సూచించారు. వారి సూచన మేరకు చాలా కాలం విశ్రాంతి తీసుకోకపోయినా విరాట్.. ఐపీఎల్ ముగిసిన తర్వాత తన కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్లి ఇటీవలే ఇండియాకు చేరాడు. జూన్ 16న అతడు ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరాల్సి ఉంది.