- Home
- Sports
- Cricket
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్, విరాట్ కాదు.. అతడంటేనే మాకు భయంగా ఉంది : ఆసీస్ బ్యాటర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్, విరాట్ కాదు.. అతడంటేనే మాకు భయంగా ఉంది : ఆసీస్ బ్యాటర్
Border-Gavaskar Trophy: ఇండియా-ఆసీస్ లు ప్రతిష్టాత్మకంగా భావించే బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం ఇప్పటికే స్వదేశంలో సన్నాహకాలు మొదలుపెట్టిన ఆస్ట్రేలియా.. భారత్ లో భారత్ ను నిలువరించడంపై ప్రణాళికలు రచిస్తున్నది.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో నాలుగు టెస్టులు ఆడేందుకు గాను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫిబ్రవరిలో ఇండియాకు రానున్నది. 2004 తర్వాత భారత్ లో టెస్టు సిరీస్ నెగ్గని ఆసీస్.. ఈసారి ఎలాగైనా దానిని ఒడిసిపట్టాలని, తద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కు దర్జాగా అడుగిడాలని భావిస్తున్నది.
ఇరు దేశాలు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సిరీస్ కోసం ఇప్పటికే స్వదేశంలో సన్నాహకాలు మొదలుపెట్టిన ఆస్ట్రేలియా.. భారత్ లో భారత్ ను నిలువరించడంపై ప్రణాళికలు రచిస్తున్నది. ఇదే క్రమంలో సిరీస్ కు ఎంపికైన ఆసీస్ బ్యాటర్ మాథ్యూ రెన్షా.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తాము అశ్విన్ బౌలింగ్ పై ఆందోళనగా ఉన్నామని అన్నాడు.
ఇదే విషయమై రెన్షా మాట్లాడుతూ... ‘ఈ సిరీస్ లో అశ్విన్ గురించే మా ఆందోళనంతా. అతడు చాలా తెలివైన బౌలర్. అశ్విన్ బౌలింగ్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. వాటిని అతడు చాలా తెలివిగా వాడతాడు. వాటిని అర్థం చేసుకుని ఆడగలిగితేనే ఇక్కడ నెగ్గుకురాగలం. లేదంటే తిప్పలు తప్పవు..’ అని అన్నాడు.
ఆస్ట్రేలియా జట్టులో పలువురు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లు ఉన్నారు. వారికి అశ్విన్ తో ముప్పు ఉందని రెన్షా చెప్పాడు. ‘మా టీమ్ లో అతి పెద్ద సవాల్ ఏంటంటే.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అశ్విన్ ను ఎలా ఎదుర్కోవడమన్నదే మా ప్రధాన సమస్య. ఎడమ చేతి వాటం బ్యాటర్లకు ఆఫ్ స్పిన్నర్లతో ఎల్బీడబ్ల్యూ సమస్య ఉంటుంది. పోని డిఫెన్స్ ఆడదామనుకుంటే బంతి స్లిప్స్ లోకి క్యాచ్ అవొచ్చు. వాటిని ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉండాలి...’అని అన్నాడు.
భారత్ కు రాబోయే ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీలు ఎడమ చేతి వాటం బ్యాటర్లే కావడం గమనార్హం. మరి వీరు అశ్విన్ ను ఎలా ఎదుర్కుంటారనేది ఇప్పుడు ఆసక్తికరం.
ఆస్ట్రేలియా చివరిసారి 2017లో భారత పర్యటనకు వచ్చినప్పుడు తొలి టెస్టులో రెన్షాను అశ్విన్ ఔట్ చేశాడు. పూణె వేదికగా ముగిసిన ఆ టెస్టులో భారత్ 333 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. కానీ తర్వాత మూడు టెస్టులలో రెండు గెలిచి ఒకటి డ్రా చేసుకుని సిరీస్ ను సొంతం చేసుకుంది.
రాబోయే సిరీస్ లో తనకు అవకాశం వస్తే గనక మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు వస్తానంటున్నాడు రెన్షా. ‘నేను గత కొన్నాళ్లుగా ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నా. దానివల్ల స్పిన్ ను ఎదుర్కోవడం చాలా అలవాటైంది. పరిస్థితులను బట్టి ఆడటం నాకు బాగా కలిసొచ్చింది. ఈసారి మా టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. తప్పక విజయం సాధిస్తామన్న నమ్మకముంది..’అని రెన్షా తెలిపాడు.