WI vs IND: ఇంకా కోలుకోని జడేజా.. టీ20 సిరీస్‌కూ అనుమానమేనా..?
Ravindra Jadeja: ఇంగ్లాండ్ తో సిరీస్ ముగించుకుని కరేబియన్ దీవులకు చేరుకున్న టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. గాయం కారణంగా వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్నాడు.

వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడలేదు. బుధవారం మూడో వన్డేలో భాగంగా అతడు ఆడతాడని అంతా భావించారు. కానీ ఈ మ్యాచ్ లో కూడా జడ్డూ ఆడలేదు.
తాజాగా బీసీసీఐ జడేజా గాయంపై క్లారిటీ ఇచ్చింది. అతడింకా కోలుకోలేదని, గాయం కారణంగా ప్రాక్టీస్ సెషన్స్ కు కూడా రాని జడేజా వైద్యుల పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాడని తెలిపింది.
మూడో మ్యాచ్ ప్రారంభానికి ముందు బీసీసీఐ జడేజా గాయం, వన్డే సిరీస్ కు అతడు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అనేదానిపై బీసీసీఐ స్పందిస్తూ.. ‘జడేజా ఇంకా వంద శాతం ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అతడు ఈ వన్డే కూడా ఆడటం లేదు. గత రెండు మ్యాచుల మాదిరిగానే జడేజా స్థానాన్ని అక్షర్ భర్తీ చేస్తాడు..’ అని తెలిపింది.
తాజాగా పరిస్థితి చూస్తుంటే జడేజా వన్డే సిరీస్ తో పాటు రాబోయే టీ20 సిరీస్ ఆడేది కూడా అనుమానంగానే ఉంది. అతడింకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో మూడో వన్డేకు దూరంగా పెట్టామని బీసీసీఐ చెప్పిన నేపథ్యంలో.. మరి శుక్రవారం ప్రారంభమయ్యే తొలి టీ20 వరకు జడ్డూ ఏం ఫిట్ అవుతాడని ప్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే ఆసియా కప్ తో పాటు టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని విండీస్ తో టీ20 సిరీస్ కు భారత సీనియర్లలో ఒక్క విరాట్ కోహ్లీ తప్ప మిగిలిన వారంతా ఆడుతున్నారు.
ఆటగాళ్ల ఫామ్, జట్టు కూర్పు తదితర విషయాలలో బీసీసీఐ ఈ సిరీస్ ను ప్రాతిపదికగా తీసుకోనున్నది. ఈ క్రమంలో జడేజా టీ20 సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతడితో పాటు జట్టుకు కూడా భారీ ఎదురుదెబ్బే కానుంది.