PAK vs BAN: సొంతగడ్డపై వైట్ వాష్, పాకిస్తాన్ కు ఘోర అవమానం
PAK vs BAN: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌పై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ తన సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లో ఇంతటి ఘోర పరాజయాన్ని చవిచూడటం ఇదే తొలిసారి.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో చావుదెబ్బ తగిలింది. ఊహించని షాక్ తో ఆ దేశ క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది పాకిస్తాన్.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌పై 2-0 తేడాతో గెలిచి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్ తన సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లో ఇంతటి భారీ పరాజయాన్ని చవిచూడటం ఇదే మొదటిసారి. బంగ్లాదేశ్ తొలిసారిగా ఒక ఆసియా జట్టును వారి సొంతగడ్డపై వైట్ వాష్ చేసింది.
ఈ ఓటమిని పాకిస్తాన్, ప్రపంచ క్రికెట్ అభిమానులు చాలా సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటాయని చెప్పడంలో సందేహం లేదు. బలమైన పాకిస్తాన్ జట్టును తమ సొంత గడ్డపై బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు వైట్ వాష్ చేయడం క్రికెట్ సంచలనంగా మారింది..
పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొంది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. రెండు జట్ల మధ్య జరిగిన 14 టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
దీంతో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో పాకిస్తాన్ తన సొంతగడ్డపై తొలిసారిగా ఓటమి పాలైంది. దీని తర్వాత రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ రావల్పిండిలోనే జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా కూడా బంగ్లాదేశ్ అద్భుత ప్రదర్శన చేసింది.
రెండో టెస్టు మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో అన్ని వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకే పరిమితమైంది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ లిట్టన్ దాస్ 138 పరుగులు సాధించాడు. మెహిదీ హసన్ మిరాజ్ 78 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ 12 పరుగులు వెనుకపడింది.
అయితే, 12 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాకిస్తాన్ ఘోరమైన ఆటతో చాలా త్వరగానే ఆలౌట్ అయింది. కేవలం 172 పరుగులకే పాక్ జట్టు కుప్పకూలింది. ఇందులో మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులు చేయగా, ఆగా సల్మాన్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగతా ప్లేయర్లు చేతులెత్తేశారు.
అనంతరం 185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్లుగా జాకీర్ హసన్ 40 పరుగులు, షాద్మాన్ ఇస్లాం 24 పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో 38 పరుగులు, మోమినుల్ హక్ 34 పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అయితే, అప్పటికే బంగ్లాదేశ్ గెలుపునకు చాలా దగ్గరగా చేరింది.
ముష్ఫికర్ రహీం 22 పరుగులు, షకీబుల్ హసన్ 21 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. బంగ్లాదేశ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో పాకిస్తాన్ ను తన దేశంలోనే వైట్ వాష్ చేసి చరిత్ర లిఖించింది.
తొలిసారిగా రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో బంగ్లాదేశ్ ఓడించి కొత్త రికార్డును నెలకొల్పింది. పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత భారత్‌లో పర్యటించనున్న బంగ్లాదేశ్ జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది.
భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 19న చెన్నైలో ప్రారంభం కానుంది. ఇంతకుముందు భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన 13 టెస్టుల్లో భారత్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్‌లు డ్రాగా ముగియగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్ విజయం సాధించలేకపోయింది. చెన్నైలో జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధిస్తే అది చారిత్రాత్మక విజయంగా నిలుస్తుంది.