The Ashes: ప్చ్.. మళ్లీ సెంచరీ మిస్ చేసుకున్న వార్నర్ భాయ్.. వందేళ్ల తర్వాత అతడే..
Australia Vs England: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుసగా రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా గబ్బాలో జరిగిన తొలి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా వార్నర్ తృటిలో సెంచరీని కోల్పోయాడు.

గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 94 పరుగులు చేసిన వార్నర్.. ఆరు పరుగుల వ్యవధిలో శతకాన్ని కోల్పోయాడు. ఆ టెస్టులో గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్ లో అతడు బ్యాటింగ్ కు రాలేదు.
ఇక అడిలైడ్ లో జరుగుతున్న రెండో టెస్టులో కూడా వార్నర్ మళ్లీ సెంచరీకి దగ్గరగా వచ్చినా శతక కలను తీర్చుకోలేకపోయాడు. ఈసారి వార్నర్.. 95 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్ లో బ్రాడ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టెస్టు కెరీర్ లో 87 మ్యాచులు ఆడిన వార్నర్ ఇప్పటివరకు 24 సెంచరీ చేశాడు. ఇక వరుసగా రెండు ఇన్నింగ్సులలోనూ శతకాలకు అత్యంత సమీపానికి వచ్చి మరీ ఔటవ్వడం అతడికే గాక వార్నర్ ఫ్యాన్స్ కు కూడా తీవ్ర నిరాశపరిచింది.
అడిలైడ్ టెస్టులో 167 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 95 పరుగులు చేశాడు. బెన్ స్టోక్స్ వేసిన షార్ట్ పిచ్ డెలివరీని కట్ చేయబోయిన అతడు.. దానిని ఓవర్ పాయింట్ దిశగా ఆడాడు. కానీ బంతి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న స్టువర్ట్ బ్రాడ్ చేతిలో పడింది. అంతే వార్నర్ కు మరో సెంచరీ మిస్.
వరుసగా రెండు సెంచరీల ముందు ఔట్ కావడంతో వార్నర్ నిరాశతో పెవిలియన్ కు చేరాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లే ముందు అక్కడ ఓ అభిమాని వార్నర్ తే షేక్ హ్యాండ్ కు ప్రయత్నించగా.. అతడు తన చేతిలో ఉన్న గ్లవ్స్ ను ఆమెకు ఇచ్చేసి వెళ్లాడు.
ఇదిలాఉండగా.. యాషెస్ చరిత్రలో గత వందేళ్లలో ఇలా వరుసగా రెండు ఇన్నింగ్సులలో సెంచరీకి దగ్గరగా వచ్చి 90లలో ఔట్ అయిన ఆస్ట్రేలియన్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ ప్రథముడు. అంతకుముందు.. 1921 లో.. టామీ ఆండ్రూస్.. వరుసగా రెండు ఇన్నింగ్సులలో 90 ల దాకా వచ్చి ఔట్ అయ్యాడు.
అంతేగాక.. తన కెరీర్ లో గడిచిన 159 ఇన్నింగ్సులలో 90 పరుగుల వద్ద ఉండగా ఒక్కసారి మాత్రమే డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. కానీ గత రెండు ఇన్నింగ్స్ లలో వరుసగా రెండు సార్లు 90 ల వద్దే నిష్క్రమించడం గమనార్హం.
కాగా.. అడిలైడ్ టెస్టులో వార్నర్ నిష్క్రమణతో రెండు వికెట్టు కోల్పోయిన ఆసీస్.. 80 ఓవర్లలో 212 పరుగులు చేసింది. క్రీజులో లబూషేన్ (249 బంతుల్లో 94 నాటౌట్), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (10 నాటౌట్) ఉన్నారు.