- Home
- Sports
- Cricket
- వాళ్లిద్దరి బాటలోనే వెళ్తున్న సచిన్ కొడుకు.. ముంబైతో తెగదెంపులు.. గోవాతో ఆడేందుకు ఉత్సాహం
వాళ్లిద్దరి బాటలోనే వెళ్తున్న సచిన్ కొడుకు.. ముంబైతో తెగదెంపులు.. గోవాతో ఆడేందుకు ఉత్సాహం
Arjun Tendulkar: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకు అనే ట్యాగ్ లైన్ అర్జున్ కు అచ్చొచ్చినట్టు లేదు. సచిన్ కొడుకైనా అతడికి జాతీయ జట్టులో పక్కనబెడితే కనీసం రంజీ జట్టులో కూడా అవకాశం దక్కడం లేదు.

దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నాళ్లు వేచి చూసినా తనకు ఆడే అవకాశమివ్వని జట్టును పట్టుకుని వేలాడటం కంటే వదిలేయడమే బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా ఫాలో అయిపోయాడు.
ముంబై నుంచి తాను తప్పుకుంటున్నానని, ఆ మేరకు తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వాలని ముంబై రంజీ జట్టుకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ముంబైని వీడనున్న అర్జున్.. త్వరలోనే గోవా రంజీ జట్టు తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు గోవా క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
ఎన్నో ఆశలతో ముంబై రంజీ జట్టులో చేరిన అర్జున్ కు టీమ్ మేనేజ్మెంట్ సరైన అవకాశాలివ్వలేదు. 2020-21 సీజన్ లో అర్జున్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ముంబై తరఫున రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత రంజీలలో కూడా ముంబైకి అవకాశం దక్కలేదు.
ముంబై రంజీ జట్టు కథ ఇలా ఉంటే వేలంలో అర్జున్ ను దక్కించుకున్న ముంబై ఇండియన్స్ కూడా అతడికి ఆడే అవకాశమివ్వలేదు. గత సీజన్ తో పాటు ఈ సీజన్ లో కూడా సచిన్, ముంబై అభిమానులు అర్జున్ ను ఆడిస్తారని ఆశపడ్డా యాజమాన్యం మాత్రం వాళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ఇక ముంబైని పట్టుకుని వేలాడితే తన కెరీర్ మొదటికే మోసం వస్తుందని అర్జున్ భావించాడు.
వచ్చే సీజన్ నుంచి అతడు గోవా తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు గోవా క్రికెట్ అసోసియేషన్ స్పందిస్తూ.. ‘మాకు లెఫ్టార్మ్ పేసర్, మిడిలార్డర్ లో రాణించే బ్యాటర్ కావాలి. దానికి అర్జున్ కరెక్ట్ గా సూటవుతాడు. రాబోయే సీజన్ కు ముందు మేం కొన్ని ట్రయల్ మ్యాచులు ఆడాల్సి ఉంది. వాటిలో అర్జున్ ను ఆడిస్తాం..’ అని తెలిపింది.
దిగ్గజాల కొడుకులు వాళ్ల సొంత జట్లను వీడి ఇతర జట్లకు ఆడటం ఇదేం కొత్త కాదు. గతంలో సునీల్ గవాస్కర్ (ముంబై) కొడుకు రోహన్ గవాస్కర్ కూడా ముంబై జట్టులో ఆడే అవకాశం రాకుంటే బెంగాల్ తరఫున ఆడాడు.
మరో భారత దిగ్గజ బ్యాటర్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ కూడా తన సొంత జట్టు హైదారబాద్ ను కాదని గోవా తరఫున ఆడాడు. మరి వీళ్లిద్దరైతే క్రికెటర్లుగా వాళ్ల తండ్రుల పేర్లను నిలబెట్టలేకపోయారు. వీళ్లబాటలోనే అర్జున్ నడుస్తాడా..? లేక తాను ప్రత్యేకమని నిరూపించుకుంటాడా..? అనేది కాలం తేల్చనుంది.