- Home
- Sports
- Cricket
- National Games: ఏడేండ్ల తర్వాత జాతీయ క్రీడలకు మోక్షం.. ఈసారి ప్రధాని సొంత రాష్ట్రంలో..
National Games: ఏడేండ్ల తర్వాత జాతీయ క్రీడలకు మోక్షం.. ఈసారి ప్రధాని సొంత రాష్ట్రంలో..
36th National Games: దేశంలో క్రీడాకారులు ఎప్పుడెప్పుడా అన ఎదురుచూస్తున్న తరుణం ఎట్టకేలకు వచ్చింది. ఏడేండ్లుగా జాతీయ క్రీడలు లేక నిరాశకు గురవుతున్న అథ్లెట్లకు ఇది శుభవార్తే..

భారత్ లో క్రీడాకారులంతా కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్న జాతీయ క్రీడల నిర్వహణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి జాతీయ క్రీడలను నిర్వహించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఆమోదం తెలిపింది.
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు గుజరాత్ వేదికగా జాతీయ క్రీడలను ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో నిర్వహించనున్నారు. ఈ మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ విషయాన్ని శుక్రవారం తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
భూపేంద్ర పటేల్ ట్వీట్ చేస్తూ.. ‘36వ జాతీయ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యమివ్వనుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు ఈ క్రీడలు గుజరాత్ లో జరుగుతాయి. మా రాష్ట్రానికి ఈ అవకాశం కల్పించిన ఐవోఏకు కృతజ్ఞతలు..’ అని తెలిపారు.
గుజరాత్ లో అత్యంత ఆధునికమైన క్రీడా వసతులు, నిర్మాణాలు ఉన్నాయని తాము ప్రపంచ స్థాయి మౌళిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అయినా ఇన్నాళ్లు మాత్రం తమ రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహించకపోవడానికి గల కారణాలేంటో తనకు అర్థం కావడం లేదని చెప్పారు.
34 క్రీడా అంశాలుండే 36వ జాతీయ క్రీడలకు సుమారు 7వేల మంది క్రీడాకారులు హాజరయ్యే అవకాశముందని.. ఈ క్రీడలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
Image credit: Getty
నేషనల్ గేమ్స్ చివరిసారిగా కేరళ వేదికగా 2015లో జరిగాయి. ఆ తర్వాత పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. 2020 మే లో గోవా వేదికగా వీటిని నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా వీటిని గత రెండేండ్లుగా వాయిదా వేస్తున్నారు.