- Home
- Sports
- Cricket
- టెండూల్కర్ తొలి సెంచరీకి 32 ఏళ్లు... డాన్ బ్రాడ్‌మన్‌కి కూడా ఈ రోజు చాలా స్పెషల్...
టెండూల్కర్ తొలి సెంచరీకి 32 ఏళ్లు... డాన్ బ్రాడ్‌మన్‌కి కూడా ఈ రోజు చాలా స్పెషల్...
సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రపంచంలో దేవుడిలా కీర్తించబడిన క్రికెటర్. సచిన్ కంటే ముందు అలాంటి గుర్తింపు దక్కించుకున్న లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్. ఈ ఇద్దరికీ ఆగస్టు 14తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.. డాన్ బ్రాడ్‌మన్ ఆఖరి ఇన్నింగ్స్ ఆడిన రోజే, సచిన్ టెండూల్కర్ తొలి అంతర్జాతీయ సెంచరీ చేశాడు...

1989 నవంబర్ 15న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 ఏళ్ల కుర్రాడిగా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు సచిన్ టెండూల్కర్. అంతకుముందు ఓ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా చేసిన సచిన్, క్రికెట్ ప్రపంచాన్ని శాసించే ‘మాస్టర్’గా ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు...
1990 ఆగస్టు 14న ఇంగ్లాండ్‌తో జరిగిన మాంచెస్టర్ టెస్టు మ్యాచ్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు సచిన్ టెండూల్కర్. అప్పటికి సచిన్ టెండూల్కర్ వయసు 17 ఏళ్ల 107 రోజులు మాత్రమే...
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ గ్రాహమ్ గూచ్, మైక్ అథర్టన్, రాబిన్ స్మిత్ సెంచరీలతో 519 పరుగుల భారీ స్కోరు చేసింది. అప్పటి భారత కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 179 పరుగులు, సంజయ్ మంజ్రేకర్ 93 పరుగులు చేయగా తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ టెండూల్కర్ 68 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా...
రెండో ఇన్నింగ్స్‌లో 320/4 పరుగులు చేసి టీమిండియాకి 407 పరుగుల లక్ష్యాన్ని అప్పగించింది ఇంగ్లాండ్. నవ్‌జోత్ సింగ్ డకౌట్ కాగా రవిశాస్త్రి 12 పరుగులకే అవుట్ కావడం, సంజయ్ మంజ్రేకర్ 50, దిలీప్ వెంగ్‌సర్కార్ 32, అజారుద్దీన్ 11, కపిల్ దేవ్ 26 పరుగులు చేసి అవుట్ కావడంతో 183 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు...
ఈ దశలో 189 బంతుల్లో 17 ఫోర్లతో 119 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సచిన్ టెండూల్కర్, మనోజ్ ప్రభాకర్ (67 నాటౌట్)తో కలిసి ఏడో వికెట్‌కి 160 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు...
ఈ సెంచరీ తర్వాత సచిన్ టెండూల్కర్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. 24 ఏళ్ల పాటు సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించిన సచిన్ టెండూల్కర్, క్రికెట్ ప్రపంచంలో 100 సెంచరీలు సాధించి, అనితర సాధ్యమైన రికార్డులెన్నో తన పేరిట లిఖించుకున్నాడు...
టీనేజ్ వయసులో విదేశీ గడ్డ మీద టెస్టు సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డు 32 ఏళ్లుగా చెక్కుచెదరకుండా అలాగే ఉంది. వెస్టిండీస్‌పై ఆరంగ్రేటం చేసిన పృథ్వీ షా, 18 ఏళ్ల 329 రోజుల వయసులో టెస్టు సెంచరీ చేసినా, అది స్వదేశంలో చేసిందే...
ఆగస్టు 14న సచిన్ టెండూల్కర్ తొలి సెంచరీ నమోదు చేస్తే, సరిగ్గా ఇదే రోజున 74 ఏళ్ల క్రితం ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు ‘డాన్’ బ్రాడ్‌మన్. టెస్టుల్లో 99.94 సగటుతో 7 వేల పరుగులు (6996) పరుగులు చేసిన బ్రాడ్‌మన్, 52 టెస్టుల్లో 29 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు బాదాడు...
1948, ఆగస్టు 14న ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ ఐదో టెస్టు మ్యాచ్, తన కెరీర్‌లో ఆఖరిదిగా ప్రకటించాడు ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్. లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కి క్రికెట్ ఫ్యాన్స్ వేల సంఖ్యలో తరలివచ్చారు....
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలోనే 52 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 389 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఆఖరి ఇన్నింగ్స్ ఆడుతున్న డాన్ బ్రాడ్‌మన్, రెండో బంతికే ఇంగ్లాండ్ బౌలర్ ఎరిక్ హోల్లీస్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 188 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియాకి ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం దక్కింది. ఇంగ్లాండ్ చెత్త బ్యాటింగ్ కారణంగా డాన్ బ్రాడ్‌మన్‌కి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. ఈ మ్యాచ్‌లో 4 పరుగులు చేసి ఉంటే, బ్రాడ్‌మన్ కెరీర్ సగటు 100గా ఉండేది..