ఇకపై మీరు PF అమౌంట్ ATM నుంచే విత్ డ్రా చేయొచ్చు: ఎప్పటి నుంచో తెలుసా?
ఏడు కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు ఇది నిజంగా శుభవార్త. ఇకపై PF అమౌంట్ ATM నుంచే విత్ డ్రా చేయొచ్చు. ఈ సౌకర్యం ఎప్పటి నుంచి అమలులోకి రాబోతోందో ఇక్కడ తెలుసుకుందాం రండి.
EPFO వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎఫ్ డబ్బును ఏటీఎంల నుంచి నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చని ఇటీవల కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దౌరా భారీ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, కార్మికులకు మేలు చేయాలని, వారికి కేంద్రం అందిస్తున్న సౌకర్యాలు మరింత సింపుల్ గా, త్వరగా అందించాలని టెక్నాలజీలను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
కార్మిక కార్యదర్శి ఇంకే చెప్పారంటే.. పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ దాఖలు చేసిన క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించేలా ఐటీ శాఖను మెరుగు పరుస్తున్నామన్నారు. అదేవిధంగా ఉద్యోగులు, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరిన్ని సదుపాయాలను సింపుల్ ప్రాసెస్ లో అందిచేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు.
పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా విషయానికొస్తే.. ఇప్పుడు క్లెయిమ్ చేసే లబ్ధిదారుడు తన క్లెయిమ్ మొత్తాన్ని నేరుగా ATM నుండి తీసుకొనేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తప్పులు జరగకుండా ఉంటాయి. ఎవరికీ కమీషన్లు, లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పీఎఫ్ ప్రాసెస్ అంతా పారదర్శకంగా జరుగుతుంది. బ్యాంకుల్లో డబ్బులు విత్ డ్రా చేయడం కోసం పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు.
పీఎఫ్ అమౌంట్ కోసం ఉద్యోగులు EPFO వెబ్‌సైట్ (https://www.epfindia.gov.in) లేదా ఉమాంగ్ యాప్ ద్వారా అప్లై చేయాలి. అదే సమయంలో కొంత మొత్తాన్ని ఏటీఎం ద్వారా తీసుకొనేందుకు క్లెయిమ్‌లను సమర్పించాలి. ఈ సౌకర్యం 2025 ప్రారంభం నుంచి అమలు కాబోతోందని కేంద్ర కార్మిక శాఖ అధికారులు వెల్లడించారు. వారు మాట్లాడుతూ 'వ్యవస్థలను నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి అభివృద్ధికి సంబంధించి భారీగా మార్పులు వస్తాయి. ఈ మార్పులు జనవరి 2025 నుండి ప్రారంభమవుతాయని అన్నారు. EPFOలో IT 2.1 వెర్షన్ అప్ గ్రేడ్ అవుతోందని, అందువల్ల ఉద్యోగులు, కార్మికులకు అందాల్సిన సేవలు మరింత సులభం కానున్నాయని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దౌరా వెల్లడించారు.