Army Salary: ఆర్మీలో చేరిన వారికి జీతాలు ఎంత? ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి?
Army Salary: ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే యువత జీతం వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. లెఫ్టినెంట్ నుండి జనరల్ వరకు ర్యాంకుల వారీగా ఆర్మీ ఉద్యోగలు జీతాలు, వారికి లభించే బెనిఫిట్స్, పెన్షన్ గురించి వివరాలు ఇక్కడ ఇచ్చాము.

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం
ఇండియన్ ఆర్మీలో చేరడం అనేది ఒక ఉద్యోగం కాదు… అది ఒక బాధ్యత. ఆర్మీలో చేరాలంటే క్రమశిక్షణ, ధైర్యం, దేశభక్తి నిండుగా ఉండాలి. తమ ప్రాణాలను దేశానికి అర్పించేందుకు సిద్ధమవ్వాలి. సైనికుల త్యాగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఎక్కువే అందుతాయి. ఇతర అలవెన్సులు, పెన్షన్, అదనపు సౌకర్యాలు కూడా అందిస్తారు. ఆర్మీలో ర్యాంకును బట్టి వారికి జీతాలు, బెనిఫిట్స్ అందుతాయి. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం ప్రకారం ఆర్మీలో చేరిన వారికి జీతాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
అత్యధిక జీతం వీరికే
7వ వేతన సంఘం ప్రకారం ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్న వారికి 56,100 రూపాయల నుంచి మొదలై 1,77,500 రూపాయల దాకా ఉంటుంది. ఇక జనరల్ ర్యాంకుకు చేరుకున్న వారికి 2,50,000 రూపాయలు అందుతాయి. ఇది ప్రాథమిక జీతమే. సీనియారిటీని బట్టి జీతం పెరుగుతూ ఉంటుంది.
ఇతర అలవెన్సులు, సౌకర్యాలు
ఆర్మీ అధికారులకు ప్రాథమిక జీతంతో పాటు అంటే బేసిక్ పే తో పాటూ DA, MSP (₹15,500 దాకా), HRA, ఫీల్డ్ ఏరియా, ట్రాన్స్‌పోర్ట్, హై ఆల్టిట్యూడ్, యూనిఫాం అలవెన్స్ వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు వారికి అందుతాయి.
పెన్షన్ వివరాలు
ఆర్మీలో చేరిన వారికి జీతం, అలాగే అలవెన్సులతో పాటూ వారికి జీవితకాల పెన్షన్ కూడ అందుతుంది. ఆర్మీ క్యాంటీన్ లలో తక్కువ ధరకు వస్తువులు, ఉచిత వైద్యం, పిల్లలకు విద్యా , ₹75 లక్షల వరకు జీవిత బీమా వంటి ఎన్నో సౌకర్యాలు లభిస్తాయి.
సిపాయికి ప్రాథమిక జీతం
ఆర్మీలో చేరి సిపాయిలకు అతి తక్కువ జీతం లభిస్తుంది. వీరికి ప్రాథమిక జీతం 21,700 రూపాయలుగా ఉంటుంది. వీటితో పాటూ డీఏ, హెచ్ఆర్ఏ వంటివి లభిస్తాయి. ఇక సుబేదార్ మేజర్ స్థాయిలో ఉన్న వారికి 1,51,100 రూపాయల వరకు బేసిక్ పే ఉంటుంది. అన్న కలుపుకుంటే జీతం మరింతగా పెరుగుతుంది.
ఆర్మీలో చేరాలనుకుంటే
ఆర్మీలో చేరాలన్నది ఎంతో మంది యువత ఆశ. అలాంటి వారు NDA, CDS పరీక్షలు రాయాలి. ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ తరచూ చూస్తూ ఉంటే… నోటిఫికేషన్ వస్తుంది.