వోడాఫోన్-ఐడియా 5G సేవలు ప్రారంభం: కాని తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క సిటీ లోనే..
జియో, ఎయిర్‌టెల్‌ల పోటీ మధ్య వోడాఫోన్-ఐడియా కూడా తన ఉనికిని చాటుకుంటోంది. ఇప్పుడు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు VI 5G సేవలు ప్రారంభిస్తోంది. అయితే ఇది దేశవ్యాప్తంగా కాదు.. ప్రస్తుతం కొన్ని సిటీస్ లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క సిటీలోనే VI 5G సేవలు ప్రారంభించింది. అదేంటో ఇక్కడ తెలుసుకోండి.
భారతదేశంలో టెలికాం సర్వీస్ రంగంలో కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. నాణ్యమైన సిగ్నల్ వ్యవస్థను అందించడానికి జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే చర్యలు తీసుకున్నాయి. మరోవైపు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL కూడా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి టాటా కంపెనీతో చేతులు కలిపింది. ఈ క్రమంలో వినియోగదారులు తమ ప్రాంతంలో సిగ్నల్స్ ఎక్కువగా వచ్చే టెలికాం సర్వీసుల్లోకి మారిపోవడం ప్రారంభించారు. దీనికి తోడు కంపెనీలు టారిఫ్ ప్లాన్లు కూడా తగ్గించడం మరో కారణం అయ్యింది.
ఈ క్రమంలో తమ కస్టమర్లను నిలుపుకోవడానికి కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ కస్టమర్లు ఒక నెట్‌వర్క్ నుండి మరొక నెట్‌వర్క్‌కి మారుతునే ఉన్నారు. ఈ పోటీ, ధరల పెరుగుదల, ఆఫర్ల మధ్య ఇప్పుడు వోడాఫోన్-ఐడియా తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దీంతో VI కస్టమర్ల ఎదురుచూపులకు తెరపడినట్లయింది.
వోడాఫోన్-ఐడియా కస్టమర్లకు ఇప్పుడు 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. VI ఇప్పుడు దేశంలోని చాలా ప్రాంతాల్లో 5G సేవలను ప్రారంభించింది. దీంతో జియో, ఎయిర్‌టెల్ తర్వాత ఇప్పుడు వోడాఫోన్ ఐడియా కూడా 5G సేవలను అందిస్తున్న టెలికాం కంపెనీగా అవతరించింది.
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో 5G సేవలను అందిస్తున్నామని VI ఇటీవల ఓ ప్రకటన చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా VI 5G సేవలు అందుబాటులోకి వస్తాయని వోడాఫోన్-ఐడియా తెలిపింది. ప్రస్తుతానికి బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో వోడాఫోన్ ఐడియా 5G సేవలు ప్రారంభమయ్యాయి.
ఈ నగరాలే కాకుండా జైపూర్, పాట్నా, హర్యానా కర్నాల్, లక్నో, ఆగ్రా, ఇండోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, సిలిగురి, జలంధర్, పూణే వంటి నగరాల్లో కూడా వోడాఫోన్ ఐడియా 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్లు తమ 4G సేవల నుండి 5G సేవలకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
వోడాఫోన్ ఐడియా 3.3GHz, 26GHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌ల కింద 5G సేవలను ప్రారంభించింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఈ కొత్త సేవలు అందుబాటులో ఉన్నాయి. వోడాఫోన్-ఐడియా 5G సేవలు నాన్ స్టాండ్‌అలోన్ (NSA) మోడల్‌లో ఉన్నాయి. ఇదే మోడల్‌లో ఎయిర్‌టెల్ కూడా సేవలందిస్తోంది.
వోడాఫోన్ 2024లో 5G సేవలను ప్రారంభిస్తే, జియో, ఎయిర్‌టెల్ 2022లోనే 5G సేవలను ప్రారంభించాయి. జియో, ఎయిర్‌టెల్ దేశంలోని చాలా ప్రాంతాల్లో 5G సేవలను అందిస్తున్నాయి. చాలా గ్రామాల్లో కూడా 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2025 ప్రారంభంలో BSNL కూడా 5G సేవలను ప్రారంభించనుంది.