ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేయొద్దు.. వేరే వాళ్లకు ఇచ్చేయండి: ఎలా ఇవ్వాలంటే..
ఊరెళ్లడానికి ముందుగానే ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారా? అయితే మీరు వెళ్లడానికి కుదరడం లేదా? మీ టికెట్ ను వేరే వారికి ఇచ్చే సౌకర్యాన్ని ఇండియన్ రైల్వే అందిస్తోంది. దీని వల్ల మీరు టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు మిగులుతాయి. రిజ్వర్ చేసిన టికెట్ ను ఇతరులకు ఎలా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి.
రైలు ప్రయాణానికి వారాలు, నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆఖరి నిమిషంలో ప్రయాణం వాయిదా పడుతుంది. లేదా రిజర్వేషన్ చేయించుకున్న వ్యక్తి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో సాధారణంగా అయితే టికెట్ రద్దు చేయాల్సి వస్తుంది. ఇలా క్యాన్సిల్ చేయడం వల్ల రద్దు ఛార్జీలు పోను మిగిలిన డబ్బులు మాత్రమే తిరిగి వస్తాయి. ఇలా కాకుండా మీరు తీసుకున్న టికెట్ ను ఇతరులకు ఇచ్చే సౌకర్యం వచ్చేసింది. దీని వల్ల మీకు డబ్బులు కలిసి రావడంతో పాటు వేరే వారు హాయిగా ప్రయాణం చేస్తారు.
ప్రయాణం చేయలేని వారికి టికెట్ మార్పిడి సౌకర్యాన్ని రైల్వే అందిస్తోంది. అయితే ఈ టికెట్ ను ఆ వ్యక్తి కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, కొడుకు, కూతురు, భార్యాభర్తల పేరు మీద మాత్రమే టికెట్‌ను మార్చుకోవచ్చు. వేరే వారికి టికెట్ ఇవ్వడానికి వీలు లేదు. అంటే మీ బదులు మీ కుటుంబంలో ఎవరైనా ఆ రిజర్వేషన్ టికెట్ పై ప్రయాణం చేయొచ్చు అన్నమాట. దీనికి ఇక్కడ తెలిపిన విధంగా టికెట్ మార్చుకోవాల్సి ఉంటుంది.
టికెట్‌ని ఎలా మార్చుకోవాలి?
మీరు టికెట్ ను ఆన్‌లైన్‌లో బుక్ చేసినా, కౌంటర్‌లో బుక్ చేసుకున్నా దాన్ని మార్చుకోవాలంటే రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వెళ్ళాలి. రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు మాత్రమే టికెట్ మార్పిడికి దరఖాస్తు చేసుకోవాలి. టికెట్ ప్రింట్ అవుట్ తో పాటు ప్రయాణించే వ్యక్తి ఐడీ ప్రూఫ్ జిరాక్స్ కాపీని తీసుకొని కౌంటర్‌కి వెళ్ళాలి. అక్కడ దరఖాస్తు ఫారమ్ నింపి ప్రయాణీకుల వివరాలు ఇవ్వాలి. రైల్వే సిబ్బంది అన్ని వివరాలు పరిశీలించి అనుకూలంగా ఉంటే టికెట్‌పై పాత ప్రయాణికుడి పేరును కొట్టివేసి కొత్తగా ప్రయాణించే వారి పేరును నమోదు చేస్తారు.
బోర్డింగ్ స్టేషన్ మార్పు
ఒక వేళ మీరు రిజర్వేషన్ చేసుకున్న రోజు ట్రైన్ ఎక్కాల్సిన స్టేషన్ లోఎక్కలేని పరిస్థితి వస్తే మీరు టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోనవసరం లేదు. జస్ట్ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు టికెట్ వేరే వాళ్లకు ట్రాన్స్ ఫర్ చేసినా కూడా వారు ఆ స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కలేని పరిస్థితి ఉన్నా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు.
దీనికోసం IRCTC వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. ట్రాన్సాక్షన్ టైప్ మెనూలో ‘బోర్డింగ్ పాయింట్ ఛేంజ్' ఆప్షన్ ను ఎంచుకోండి. మీ PNR నంబర్, రైలు నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా రాయండి. కండిషన్స్ బటన్ టిక్ చేసి 'సబ్మిట్' పై క్లిక్ చేయండి. బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి కొత్త బోర్డింగ్ స్టేషన్ ఎంచుకుని 'సబ్మిట్' క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లకు బోర్డింగ్ స్టేషన్ మార్పుకు రైల్వే అనుమతి ఇవ్వదు.