గేర్లు మార్చడం బోర్ కొట్టిందా? ఈ ఆటోమెటిక్ కార్లు ట్రై చేయండి
గేర్లు మార్చి మార్చి బోర్ కొట్టిందా? క్లచ్ తొక్కి తొక్కి విసుగ్గా ఉందా? అయితే మీరు AMT కార్లు ట్రై చేయండి. ఇండియాలో ఇప్పుడు ఈ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో ఎక్కువ మంది వీటినే వాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. AMT కార్లు తయారు చేసి అమ్ముతున్న కంపెనీల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్నేళ్లుగా దేశంలో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ పెరగడానికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది గేర్లు మార్చడం బోర్ కొట్టడమే. కానీ ఇదొక్కటే కారణం కాదు. జాటో డైనమిక్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020లో మొత్తం కార్ల అమ్మకాల్లో ఆటోమేటిక్ కార్ల వాటా 16 శాతం ఉంది. ప్రస్తుతం దేశంలో ఆటోమేటిక్ కార్ల వాటా 26 శాతానికి పెరిగింది. ముఖ్యంగా నగరాల్లో వీటి వినియోగం పెరిగింది. మహిళలు ఎక్కువగా AMT కార్లు వాడటానికే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
సిటీస్ లో ట్రాఫిక్ సమస్య వల్ల ప్రతి సారి క్లచ్ తొక్కి బ్రేక్ వేయడం, గేర్లు మార్చడం జనానికి విసుగ్గా మారింది. ఇది అనారోగ్య సమస్యలకు కూడా కారణంగా మారుతోంది. ముఖ్యంగా శరీరం త్వరగా అలసిపోతోందని, కాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నామని కార్లు నడిపే వారు చెప్పినట్లు నివేదిక ద్వారా తెలిసింది. నగరాల్లో ప్రజలు బ్రేక్, ఆక్సిలరేటర్ నొక్కితే ముందుకు వెళ్లే వాహనాలనే ఇష్టపడుతున్నారు. ఈ ఆటోమేటిక్ కారుల్లో గేర్లు మార్చాల్సిన అవసరం లేకపోవడం ఇవి బాగా అమ్ముడుపోవడానికి ప్రధాన కారణం.
ఆటోమేటిక్ వాహనాలు ట్రాఫిక్ ను కూడా తగ్గిస్తాయి. జాటో డైనమిక్స్ నివేదిక ప్రకారం దేశంలోని 20 ప్రధాన నగరాల్లో అమ్ముడవుతున్న ప్రతి మూడు కార్లలో ఒకటి ఆటోమేటిక్ కారు. ఆటోమేటిక్ కార్లు ప్రీమియం విభాగంలో ఉంటాయి. వీటి ధర సాధారణ కార్ల కంటే రూ. 60 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఎక్కువగా ఉంటుంది.
ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో మారుతి, టయోటా, మహీంద్రా, టాటా, హ్యుండై, నిస్సాన్ వంటి వాహన తయారీ సంస్థలన్నీ 83 మోడళ్ల ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
మరోవైపు హోండా వంటి కొన్ని కంపెనీలు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కంటే ఒక అడుగు ముందుకేసి CVT ట్రాన్స్మిషన్ ను తీసుకొచ్చాయి. AMT ట్రాన్స్మిషన్లలో క్లచ్ ఉంటుంది. CVT ట్రాన్స్మిషన్లలో క్లచ్ పనితీరును సెన్సార్ సాయంతో చేస్తారు. CVT ట్రాన్స్మిషన్ వాహనాలు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వాహనాల కంటే చాలా స్మూత్ గా ఉంటాయి. మీకు నచ్చిన కంపెనీ AMT కార్లు కొనుగోలు చేసి ఇప్పుడే గేర్ల వేయాల్సిన కష్టాల నుంచి బయటపడండి.