సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
కొత్త బైక్ కొనుగోలు చేయలని స్థోమత లేనివాళ్లు, విద్యార్థులు ఎక్కువగా సెకండ్‌హ్యాండ్ బైక్‌లు కొనుగోలు చేస్తుంటారు. అయితే తక్కువ ధరకు లభిస్తున్నాయని కదా అని ఏది పడితే అది కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు.

సెకండ్ హ్యాండ్ బైక్‌తో లాభాలేంటీ.?
కొత్త బైక్ కన్నా 30–50% తక్కువ ధరలో లభించడం వలన చాలా మంది వాడిన బైక్ కొనడాన్ని ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా విద్యార్థులు, కొత్తగా బైక్ నడిపేవారు లేదా చిన్న ప్రయాణాల కోసం అవసరమయ్యే వారికి ఇది సరైన ఎంపికగా చెప్పొచ్చు. హై ఎండ్ బైక్స్ కూడా తక్కువ ధరకు దొరుకుతాయి. అయితే సరైన నిర్ణయం తీసుకోకపోతే, తర్వాత ఖరీదైన రిపేర్లు చేయాల్సి రావచ్చు. అందుకే, వాడిన బైక్ కొనేటప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. అవేంటంటే
మీరు బైక్ ఎందుకు కొనాలని అనుకుంటున్నారు..?
మీరు బైక్ ఎందుకు కొనాలి అనుకుంటున్నారు అనేది ముందే నిర్ణయించుకోండి. ఆఫీస్/కాలేజీకి వెళ్లడం కోసం అయితే స్కూటీలు లాంటివి సరిపోతాయి. లాంగ్ రైడ్స్, ట్రిప్స్ కోసం అయితే కాస్త సీసీ ఎక్కువ ఉన్న బైక్స్ అయితే బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
మోడల్స్, ధరలు రీసెర్చ్ చేయండి
మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్స్, బ్రాండ్స్ గురించి రీసెర్చ్ చేయండి. స్థానిక మార్కెట్‌లో ధరలు తెలుసుకోండి. అయితే ఆన్‌లైన్‌తో పోల్చితే విశ్వసనీయమైన బైక్ డీలర్‌షిప్ ద్వారా కొనుగోలు చేయడం మంచిది, ఎందుకంటే వారు సాధారణంగా సర్వీస్ హిస్టరీతో పాటు వెరిఫైడ్ డాక్యుమెంట్స్ ఇస్తారు.
బైక్‌ను ప్రత్యక్షంగా తనిఖీ చేయండి
బైక్ కండిషన్ ఎలా ఉందో జాగ్రత్తగా చూడండి. వీలైతే మీ వెంట ఒక మంచి బైక్ మెకానిక్‌ను తీసుకెళ్లండి. బాడీపై గీతలు లేదా డెంట్లు ఉన్నాయా చూడండి. టైర్ల పొజిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఇంజిన్ దగ్గర ఆయిల్ లీకేజీలు ఉన్నాయా చూడండి. ఫ్రేమ్‌పై తుప్పు పట్టిందా, నట్-బోల్ట్స్, చెయిన్, సీట్ కండీషన్ బాగుందా లాంటి విషయాలను గమనించండి.
టెస్ట్ రైడ్ తప్పనిసరి
బైక్ పనితీరు తెలుసుకోవడానికి టెస్ట్ రైడ్ తప్పనిసరి చేయాలి. ఈ సమయంలో గేర్ మార్పులు స్మూత్‌గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. బ్రేకులు, క్లచ్ రెస్పాన్స్ బాగుందా గమనించాలి. ఇంజిన్ శబ్దం లేదా అసాధారణ వైబ్రేషన్లు ఉన్నాయా చూడాలి. వేగం, హ్యాండ్లింగ్ సౌకర్యవంతంగా ఉందా చూసుకోవాలి. మీకు అనుభవం లేకపోతే స్నేహితుడు లేదా మెకానిక్‌ని వెంట తీసుకెళ్లండి.
చాసిస్ నంబర్, ఇంజిన్ చెక్ చేయండి
బైక్‌లో ఉన్న చాసిస్ నంబర్ (VIN) ను RC బుక్‌లో ఉన్నదానితో సరిపోల్చండి. ఇంజిన్‌లో వింత శబ్దం లేదా ఎగ్జాస్ట్ నుంచి పొగ ఎక్కువగా వస్తే అది ప్రమాద సూచకంగా భావించాలి.
సర్వీస్ హిస్టరీ చూడండి
బైక్ ఎన్ని సార్లు సర్వీస్ అయింది. ఏ భాగాలు రిపేర్ అయ్యాయి లేదా మార్చారు. ఎప్పుడైనా ప్రమాదానికి గురైందా.? ఈ వివరాలు సర్వీస్ రికార్డ్స్‌లో ఉంటాయి. రికార్డ్ ఇవ్వలేకపోతే జాగ్రత్తగా ఆలోచించండి.
అవసరమైన డాక్యుమెంట్స్ పరిశీలించండి
బైక్ కొనుగోలు చేసేముందు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా చెక్ చేయండి:
* రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)
* బైక్ ఇన్సూరెన్స్ పాలసీ
* PUCC (పాల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్)
* ఒరిజినల్ ఇన్వాయిస్/సేల్స్ రసీదు
* RTO ఫార్మ్స్ 28, 29, 30
ధర విషయంలో కూడా
సెకండ్ హ్యాండ్ వాహనాల్లో ధరను తగ్గించమనే హక్కు మీకు ఉంటుందని గుర్తుంచుకోండి. బైక్‌లో డెంట్లు, పాత టైర్లు లేదా సర్వీస్ రికార్డులు లేని పరిస్థితుల్లో ధర తగ్గించమని అడగండి. నమ్మదగిన వెబ్‌సైట్స్‌లో రీసేల్ విలువ చూసి ఫెయిర్ ప్రైస్ నిర్ణయించుకోండి. డీల్ సరిగా అనిపించకపోతే వెనక్కి తగ్గడానికి సంకోచించవద్దు.