SBIలో 444 FD గురించి విన్నారా? పెట్టుబడి తక్కువ.. వడ్డీ ఎక్కువ
ఎస్‌బిఐ అందించే అమృత్ వృష్టి అనే కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం గురించి ఉన్నారా? 444 రోజులకు కనీస పెట్టుబడి రూ.1,000 పెడితే మీరు అధిక వడ్డీ పొందవచ్చు. అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవల అమృత్ వృష్టి అనే కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) పథకాన్ని ప్రారంభించింది. ఇది ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో పెట్టుబడి సురక్షితంగా ఉంటుందని బ్యాంకు చెబుతోంది. 444 రోజుల కాల వ్యవధి కలిగిన ఈ స్కీమ్ లో భారతీయులే కాకుండా ప్రవాస భారతీయ కస్టమర్లు కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ స్కీమ్ లో చేరిన సాధారణ పౌరులు 7.25% వడ్డీ రేటును పొందుతారు. అదే సీనియర్ సిటిజన్లు అయితే 7.75% అధిక వడ్డీని పొందవచ్చు. ఈ పథకం మార్చి 31, 2025 వరకు కొనసాగుతుంది. ఇది సేవింగ్స్ పై కచ్చితమైన రాబడిని కోరుకునే వారికి అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు.
ఎస్‌బిఐ అమృత్ వృష్టి ఎఫ్‌డి పథకం టైమ్ పీరియడ్ 444 రోజులు. ఇది మధ్యంతర పెట్టుబడిగా ఉంటుంది. ఈ పథకం జూలై 15, 2024న ప్రారంభించారు. మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. తక్కువ కాలంలో సురక్షితమైన పెట్టుబడుల ద్వారా మంచి ఆదాయాన్ని పొందాలనుకున్న వారికి ఈ స్కీమ్ మంచి ఎంపిక అవుతుంది. సాంప్రదాయ ఎఫ్‌డిలతో పోలిస్తే ఈ స్కీమ్ అధిక వడ్డీ రేటును అందిస్తుంది.
అమృత్ వృష్టి ఎఫ్‌డి పథకం ఎక్కువ మందికి అందుబాటులో ఉండే స్కీమ్. ఎందుకంటే కనీస డిపాజిట్ మొత్తం కేవలం రూ.1,000 మాత్రమే. అంతకు మించి మీరు ఎంత డిపాజిట్ చేయగలిగితే అంత చేయొచ్చు.
ఉదాహరణకు సీనియర్ సిటిజన్లు రూ.2,00,000 పెట్టుబడి పెడితే 7.75% వడ్డీతో రూ.19,859 వడ్డీని పొందొచ్చు. అంటే మెచ్యూరిటీ మొత్తం రూ. 2,19,859 అవుతుంది. అదే సాధారణ పౌరులకు 7.25 % వడ్డీ రేటుతో రూ.2 లక్షలకు వడ్డీ రూ.18,532 లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ మొత్తం రూ.2,18,532 మీరు పొందవచ్చు.
ఎస్‌బిఐ అమృత్ వృష్టి పథకంలో మీరు ఎఫ్ డీ చేసి అమౌంట్ ముందుగా తీసేసుకుంటే నిబంధనలు ఇలా ఉంటాయి.
రూ. 5 లక్షల వరకు డిపాజిట్లపై 0.50% జరిమానా విధిస్తారు.
రూ.5 లక్షలకు పైన రూ. 3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 1% జరిమానా విధిస్తారు.
ఎస్‌బిఐ ఉద్యోగులు, పెన్షనర్లకు జరిమానా వర్తించదు.
అమృత్ వృష్టి ఎఫ్‌డి పథకాన్ని మీరు పెట్టుబడి ఎంపికగా చేసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తక్కువ పెట్టుబడి అంటే కనీసం రూ. 1,000 నుంచి మీ శక్తి మేరకు ఎంతైనా ఎఫ్ డీ చేయొచ్చు. అంతేకాకుండా 444 రోజుల వ్యవధిలో పెట్టుబడి, వడ్డీ కలిపి మీరు పొందొచ్చు. ఎస్‌బిఐ అమృత్ వృష్టి ఎఫ్‌డి పథకం తక్కువ రిస్క్, స్థిరమైన పెట్టుబడి కోరుకునే వ్యక్తులకు నమ్మకమైన అవకాశం. ప్రభుత్వ ఆధారిత బ్యాంక్ కాబట్టి పెట్టుబడికి ఎలాంటి భయం ఉండదు.