Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ అంటూ ఏమీ లేదు, మోసగాళ్లతో జాగ్రత్త: RBI హెచ్చరిక
Digital Arrest Scam: ఎవరైనా వీడియో కాల్ చేసి మీ వ్యక్తిగత సమాచారం చెప్పకపోతే డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అస్సలు భయపడకండి. ఎందుకంటే చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ లేదని RBI తేల్చి చెప్పింది. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా జరుగుతున్న ఈ స్కామ్ తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలందరికీ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలకు ఒక సందేశం పంపి అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. ముఖ్యంగా వాట్సాప్ వినియోగదారులకు ఈ హెచ్చరికను RBI జారీ చేసింది. అదేంటంటే.. వాట్సాప్ ద్వారా మోసగాళ్లు వీడియో, ఆడియో కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిసిందని ఆర్బీఐ చెప్పింది.
వాట్సాప్ కాల్స్ తో జాగ్రత్త
నేరస్థులు వాట్సాప్‌లో ప్రజలకు వీడియో కాల్స్ చేసి, డిజిటల్‌గా అరెస్ట్ చేస్తామని బెదిరించి, భారీ మొత్తంలో డబ్బును దోచుకుంటున్నారని ఆర్బీఐ తెలిపింది. డిజిటల్ అరెస్ట్ వంటి నేరాల వల్ల ప్రజలు కోట్ల రూపాయలు కోల్పోవడమే కాకుండా కొందరు భయంతో ప్రాణాలు కూడా కోల్పోయారని అందుకే ఈ ప్రకటన జారీ చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది.
డిజిటల్ అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలి
భారతీయ చట్టంలో డిజిటల్ అరెస్ట్ అంటూ ఏమీ లేదని RBI స్పష్టం చేసింది. ఎవరైనా మిమ్మల్ని వాట్సాప్ లేదా ఏదైనా వీడియో కాల్ యాప్‌లో కాల్ చేసి, డిజిటల్‌గా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే ముందుగా వారి ఫోన్ కనెక్షన్ కట్ చేయండి. వెంటనే సైబర్ క్రైమ్ సెంట్రల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి జరిగిన విషయం గురించి పూర్తి సమాచారం ఇవ్వండి.
RBI ఏం చెప్పిందంటే...
సైబర్ నేరస్థులు ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాలను కనిపెడుతూనే ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని RBI హెచ్చరిస్తోంది. "డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? చట్టంలో డిజిటల్ అరెస్ట్ అంటూ ఏమీ లేదు. ఎవరికీ మీ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఇవ్వకండి. డబ్బు కూడా చెల్లించవద్దు. సహాయం కావాలంటే 1930కి కాల్ చేయండి" అని RBI తెలిపింది.
దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలు
దేశంలో సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ మోసాలను అరికట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే జనం అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాలు తగ్గుతాయి. ఈ స్కామ్ లు ఎలా జరుగుతాయి? వీటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంటుంది.