దిమ్మతిరిగే ఫీచర్లతో చాట్‌జీపీటీ కొత్త సేవలు.. రూ. 399 కే అద్భుతమైన ప్లాన్..!
ChatGPT Go India Launch 2025: ఓపెన్ ఏఐ తాజాగా “చాట్‌జీపీటీ గో” పేరుతో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.399కే లభించే చాట్‌జీపీటీ గో ప్లాన్ ద్వారా ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్‌లు, చెల్లింపులు వంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

అద్భుత ఫీచర్లతో చాట్‌జీపీటీ కొత్త సేవలు
ChatGPT Go Subscription:ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) హవా నడుస్తోంది. ఈ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే అనేక మోడళ్లు వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. చాట్‌జీపీటీ (ChatGPT), గ్రోక్ (Grok), జెమినీ (Gemini) వంటి టూల్స్ ఇప్పటికే ప్రజాదరణ పొందుతుండగా.. అద్భుత ఫీచర్లతో అప్‌డేట్ వెర్షన్లను కూడా వరుసగా విడుదల చేస్తున్నారు.
తాజాగా ఓపెన్ ఏఐ (OpenAI) అత్యాధునిక జీపీటీ-5 మోడల్‌ను పరిచయం చేసింది. దీని ఆధారంగా భారత్‌లో ప్రత్యేకంగా “చాట్‌జీపీటీ గో” (ChatGPT Go) పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందిస్తున్న ఈ ప్లాన్ ఇప్పటికే టెక్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఇంతకీ ఈ ప్లాన్ ధర ఎంత? ఫీచర్స్ ఏంటీ? అనేవి వివరంగా చూద్దాం.
రూ.399కే చాట్‌జీపీటీ గో
భారత్‌లో వినియోగదారుల కోసం ఓపెన్ ఏఐ (OpenAI) తాజాగా "చాట్‌జీపీటీ గో" (ChatGPT Go) పేరుతో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. నెలకు కేవలం రూ.399కే అందుబాటులోకి వస్తుంది. ఉచిత వర్షన్‌తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ మెసేజ్‌లు పంపే సౌకర్యం ఉంది.
అంతేకాకుండా, మెమరీ సామర్థ్యం రెట్టింపు అవ్వడంతో యూజర్ చాట్స్, అవసరమైన హిస్టరీని ఎక్కువ కాలం గుర్తుంచుకోగలదు. టెక్స్ట్ ఆధారంగా మాత్రమే కాకుండా ఇమేజ్ జనరేషన్ సౌకర్యం, డాక్యుమెంట్లు లేదా ఫైళ్లను నేరుగా అప్‌లోడ్ చేసి వాటిపై సమాధానాలు పొందే ఫీచర్ కూడా ఈ ప్లాన్‌లో లభించనుంది.
యూపీఐ సపోర్ట్‌తో ఓపెన్‌ఏఐ కొత్త సేవలు
భారతీయ వినియోగదారుల సౌకర్యార్థం యూపీఐ (UPI) ద్వారా చెల్లింపులు చేసే సదుపాయం కల్పించడంతో ఈ ప్లాన్ ప్రత్యేకతగా నిలిచింది. అలాగే.. మల్టీ పుల్ లాంగ్వేజ్ సపోర్టు ఉండటం, ప్రధానంగా ఇండిక్ లాంగ్వేజ్ సపోర్ట్‌ను మరింత మెరుగుపరిచినట్లు కంపెనీ తెలిపింది.
ఈ సందర్భంగా ఓపెన్‌ఏఐ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ నిక్ టర్లీ మాట్లాడుతూ.. “భారతదేశంలో లక్షలాది మంది ప్రతిరోజూ లెర్నింగ్, వర్క్, క్రియేటివిటీ, సమస్య పరిష్కారాల్లో చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారు. ఈ ఆదరణ మాకు ప్రేరణనిచ్చింది. అందుకే యూపీఐ చెల్లింపు సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టాం” అని తెలిపారు.
తాజాగా కంపెనీ పరిచయం చేసిన GPT-5 మోడల్ మద్దతుతో "చాట్‌జీపీటీ గో" మరింత అధునాతన అనుభవాన్ని అందిస్తుందని ఓపెన్‌ఏఐ వెల్లడించింది.
చాట్‌జీపీటీ గో: తక్కువ ధరతో అధునాతన ఫీచర్లతో కొత్త ప్లాన్
ఓపెన్‌ఏఐ (OpenAI) తాజాగా ప్రకటించిన “చాట్‌జీపీటీ గో” సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ భారత వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇప్పటికే ఉన్న రూ.1,999 చాట్‌జీపీటీ ప్లస్ (ChatGPT Plus), రూ.19,900 చాట్‌జీపీటీ ప్రో (ChatGPT Pro) ప్లాన్లతో పోలిస్తే, నెలకు కేవలం రూ.399కే అందుబాటులోకి వచ్చే చాట్‌జీపీటీ గో సదుపాయం అని కంపెనీ స్పష్టం చేసింది.
తాజాగా పరిచయమైన GPT-5 మోడల్ ఆధారంగా పనిచేసే ఈ ప్లాన్ విద్యార్థులు, ప్రొఫెషనల్స్, క్రియేటర్లు, డెవలపర్లు, సంస్థలకు మరింత ఉపయోగకరంగా మారనుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ ఫీచర్లను అందించాలనే ఉద్దేశంతోనే చాట్‌జీపీటీ గోను అందిస్తున్నామని ఓపెన్‌ఏఐ తెలిపింది.
భారత్‌పై ఓపెన్‌ఏఐ దృష్టి – శామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు
భారత మార్కెట్ ప్రాముఖ్యతపై ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం అమెరికా తరువాత చాట్‌జీపీటీకి భారత్ రెండవ అతిపెద్ద మార్కెట్. త్వరలోనే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా మారే అవకాశం ఉంది. విద్యార్థులు, నిపుణులు, డెవలపర్లు, క్రియేటర్లు, సంస్థలు చాట్‌జీపీటీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారతదేశానికి ప్రత్యేకంగా ఉత్పత్తులు అందించడమే మా ప్రాధాన్యత” అని పేర్కొన్నారు.
చాట్ జీపీటికి భారీ ఆదరణ
ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ పర్యటన సందర్భంగా ఆల్ట్‌మన్ 2024లో దేశంలో చాట్‌జీపీటీ వినియోగదారుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని వెల్లడించిన విషయం తెలిసిందే. మే నెలలో OpenAI, ChatGPT Enterprise, ChatGPT Edu, OpenAI API ప్లాట్‌ఫారమ్ వినియోగదారుల డేటాను స్థానికంగా నిల్వచేయడం ప్రారంభించినట్లు ప్రకటించింది.
భారతీయ కంపెనీలు డేటా సార్వభౌమాధికార నిబంధనలకు అనుగుణంగా పనిచేసే అవకాశం కల్పించబడుతోంది. మొత్తానికి తక్కువ ధరలో అధునాతన ఫీచర్లను అందించే "చాట్‌జీపీటీ గో" భారత్‌లో AI వినియోగాన్ని మరింత వేగంగా విస్తరింపజేసే అవకాశముంది.
మొత్తంగా చెప్పాలంటే, రూ.399కే లభించే చాట్‌జీపీటీ గో ప్లాన్ ద్వారా ఎక్కువ మెసేజ్‌లు, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్‌లు, మెరుగైన మెమరీ, సులభ చెల్లింపులు వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.