ఇండియాలో 295 బోగీలతో నడిచే అతి పొడవైన రైలు గురించి మీకు తెలుసా?
ప్రపంచంలోనే నాలుగో పెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న ఇండియాలో అతి పొడవైన రైలు ఏంటో మీకు తెలుసా? ఆ ట్రైన్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

ఇండియా రైల్వే వ్యవస్థ ఎంత పెద్దదంటే.. ప్రతిరోజూ 2.5 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇతర ప్రయాణ ఖర్చులతో పోలిస్తే ధర తక్కువ, ఆహ్లాదకరమైన ప్రయాణం ట్రైన్స్ లోనే ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ప్రజలు రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడతారు.
ఇండియాలో అనేక రకాల రైళ్లు ఉన్నాయి. పాసింజర్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్, మెట్రో, ఎంఎంటీఎస్, గూడ్స్ ఇలా చాలా రకాల ట్రైన్స్ ఆ ప్రాంతాలకు అనుగుణంగా నడుస్తుంటాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా, ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చడానికి వందే భారత్ ట్రైన్స్ ను ప్రారంభించింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో వందే భారత్ ట్రైన్స్ సేవలందిస్తున్నాయి.
ఇవే కాకుండా ఇండియాలో బాగా స్లోగా నడిచే ట్రైన్స్, లగ్జరీ సౌకర్యాలతో ప్రయాణించే రైళ్లు ఉన్నాయి. అలాగే అత్యంత వేగంతో దూసుకుపోయే రైళ్లు కూడా ఉన్నాయి. ఇప్పడు మనం ఇండియాలోనే అతి పొడవైన, ఎక్కువ బోగీలతో నడిచే ట్రైన్ గురించి తెలుసుకుందాం.
ఆ ట్రైన్ ఒక గూడ్స్. సాధారణంగా గూడ్స్ రైళ్లకు ఎక్కువ బోగీలు ఉంటాయి. ఒక గూడ్స్ రైలుకు సుమారు 25 నుంచి 50 బోగీల వరకు ఉంటాయి. కాని ఇప్పుడు మీరు తెలుసుకోబోయే రైలుకు ఏకంగా 295 బోగీలు ఉంటాయి. అందుకే ఈ ట్రైన్ కు ఇంజన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. 295 బోగీలతో నడిచే ఈ ట్రైన్ ను నడిపించడానికి 6 ఇంజిన్లు ఉపయోగిస్తారు.
super vasuki
ఈ రైలు పొడవు తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇది ఏకంగా 3.5 కి.మీ. పొడవు ఉంటుంది. ఈ ట్రైన్ ఏదైన ఒక స్టేషన్ దాటాలంటే సుమారుగా గంట సమయం తీసుకుంటుందట. ఈ అతి పొడవైన, పెద్ద రైలు పేరు సూపర్ వాసుకి. ఈ ట్రైన్ ఎక్కువగా చత్తీస్ ఘడ్ లోని ఖొర్బా నుంచి నాగ్ పూర్ లోని రాజ్‌నంద్‌గావ్ వరకు ప్రయాణిస్తుంది.
శివుడి మెడలోని పాము పేరు వాసుకి. ఇది పాములకు రాజుగా పేరుపొందింది. పురాణాల ప్రకారం క్షీరసాగర మధనం సమయంలోనూ వాసుకి పామునే ఉపయోగించారట. అందుకే అతి పొడవైన, ఎక్కువ బోగీలు కలిగిన ఈ ట్రైన్ కి కూడా వాసుకి అని పేరు పెట్టారు.
ఈ సూపర్ వాసుకి ట్రైన్ ఒక ట్రిప్ లో 27 వేల టన్నుల బొగ్గును తరలిస్తుంది. ఈ ట్రైన్ ఖొర్బా, రాజ్ నంద్ మధ్య ప్రయాణించడానికి 11 గంటల 20 నిమిషాలు తీసుకుంటుంది. ఈ ట్రైన్ దాని పరిమాణం, బరువు వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కూడా సాధించింది. ఇది 22 జనవరి 2021న ప్రారంభమైంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(SECR) జోన్‌లోని రాయ్‌పూర్ డివిజన్ ద్వారా నడుస్తోంది.