5G కాదు.. అంతకు మించి 5.5G నెట్వర్క్ వచ్చేసింది: జియో కస్టమర్లకు పండగే
రిలయన్స్ జియో జెట్ స్పీడ్ తో అప్ గ్రేడ్ అవుతోంది. ప్రజలకు ఇంకా పూర్తిగా 5G సేవలు అందకముందే రిలయన్స్ జియో 5.5G నెట్‌వర్క్ సర్వీస్ స్టార్ట్ చేసేసింది. మరి 5G కి, 5.5G సర్వీస్ కి మధ్య తేడా ఏమిటి? 5.5G సేవలు ఏ ఫోన్లో దొరుకుతాయి. ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియాలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNLతో పాటు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా టెలికాం సేవలను అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి కంపెనీలు టారిఫ్ ధరలు పెంచినప్పటికీ వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందిస్తున్నాయి.
జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా లు 3G, 4G లను దాటి ఇప్పటికే 5G సేవలను అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ 4G సేవలు దేశవ్యాప్తం చేస్తూనే కొన్ని ముఖ్య నగరాల్లో 5G సేవలు కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో పోటీ కంపెనీల కంటే మరో ముందడుగు వేసింది. 5.5G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది.
5.5G నెట్‌వర్క్ అంటే ఏమిటి?
జియో 5G సర్వీస్ అప్‌గ్రేడ్ వెర్షన్ 5.5G నెట్‌వర్క్. సాధారణ 5Gతో పోలిస్తే ఇది వేగవంతమైన ఇంటర్నెట్ సిగ్నల్స్ ని ఇస్తుంది. మెరుగైన, రిలయబుల్ నెట్‌వర్క్ ను అందిస్తుంది. ఈ వ్యవస్థ మూడు ప్రత్యేక నెట్‌వర్క్ సెల్‌లను ఉపయోగిస్తుంది. అవి ఒకేసారి ఎక్కువ టవర్‌లకు కనెక్ట్ అవుతాయి. కాబట్టి వినియోగదారులు 1Gbps నుంచి 10Gbps వరకు ఇంటర్నెట్ వేగంతో వీడియోలు, సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
OnePlus 13 సిరీస్ ఫోన్‌లలో 5.5G నెట్‌వర్క్
జియోతో కలిసి ప్రారంభమైన OnePlus 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో 5.5G నెట్‌వర్క్ సేవలను మీరు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు జియో అత్యాధునిక నెట్‌వర్క్ టెక్నాలజీతో పనిచేసేలా తయారయ్యాయి. కాబట్టి 5.5G సేవకు ఈ ఫోన్లు సపోర్ట్ చేస్తాయి.
5.5G నెట్‌వర్క్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?
జియో అందిస్తున్న5.5G నెట్‌వర్క్ సేవల ద్వారా వినియోగదారులు అనేక ముఖ్యమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటంటే..
ఆన్‌లైన్ గేమింగ్ నుండి HD వీడియో స్ట్రీమింగ్ వరకు ఎలాంటి సేవలైన వేగంగా అందుతాయి. పెద్ద వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం, గేమ్స్ ఆడుతున్నప్పుడు సిగ్నలింగ్ ప్రాబ్లమ్ రాకుండా 5.5G పని చేస్తుంది.
5.5G సేవ ద్వారా పెద్ద యాప్‌లు కూడా వేగంగా అప్‌డేట్ అవుతాయి. వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్‌లైన్ గేమ్‌లను ఆడవచ్చు. 4K మీడియా వీడియోను కూడా అంతరాయం లేకుండా స్ట్రీమింగ్ చేయవచ్చు.
ఎక్కువ టవర్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా రిలయన్స్ జియో సేవలు అందుతాయి. బస్సు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు కూడా అంతరాయం లేని ఇంటర్నెట్ సేవను మీరు పొందొచ్చు. ముఖ్యంగా వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి అంతరాయం ఉండదు. అలాగే మెరుగైన వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని కూడా మీరు పొందవచ్చు.