$600 బిలియన్ల దిగువకు భారతదేశ విదేశీ మారక నిల్వలు, అత్యధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న టాప్-5 దేశాలు ఇవే..
భారతదేశ విదేశీ మారక నిల్వలు $600 బిలియన్లకు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 18 ఆగస్టు 2023తో ముగిసిన వారానికి సంబంధించిన డేటాను విడుదల చేసింది, దీని ప్రకారం భారతదేశ విదేశీ మారక నిల్వలు $7.27 బిలియన్లు తగ్గి $594.88 బిలియన్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలో దేశం మొత్తం విదేశీ మారక నిల్వలు $ 602.16 బిలియన్లుగా ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం, 18 ఆగస్టు 2023తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు $6.61 బిలియన్లు తగ్గాయి. దీంతో 527.78 బిలియన్ డాలర్లుగా మారింది. అంతేకాకుండా, బంగారం నిల్వ $ 515 మిలియన్లు తగ్గి $ 43.82 బిలియన్లకు చేరుకుంది. IMF నిల్వలు కూడా $25 మిలియన్లు క్షీణించి ఇప్పుడు $5.072 బిలియన్లకు చేరుకున్నాయి.
విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎందుకు తగ్గాయి?
గత కొన్ని వారాలుగా ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) స్టాక్ మార్కెట్‌లో భారీగా అమ్మకాలు చేసారని ఎకనామిస్ట్స్, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడి రూ.83 స్థాయికి దిగువకు వెళ్లింది. ఇలాంటి పరిస్థితిలో రూపాయి పతనాన్ని ఆపడానికి RBI డాలర్లను విక్రయించవలసి వచ్చింది, దీని కారణంగా విదేశీ మారక నిల్వలు క్షీణించాయి.
అక్టోబర్ 2021లో అత్యధికంగా విదేశీ మారక నిల్వలు
భారతదేశపు విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో $645 బిలియన్ల వద్ద అత్యధికంగా ఉన్నాయి. తరువాత క్షీణించి చివరకు స్థిరంగా దాదాపు $600 బిలియన్ల వద్ద కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, విదేశీ మారక నిల్వలు తగ్గుముఖం పట్టాయని, ఒక సమయంలో 525 బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది.
ప్రపంచంలో అత్యధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్న టాప్-5 దేశాలు
1- చైనా - $ 3384 బిలియన్ డాలర్లు
2- జపాన్ - $ 1,253 బిలియన్ డాలర్లు
3- స్విట్జర్లాండ్ - $ 898 బిలియన్ డాలర్లు
4- భారతదేశం - $ 594.88 బిలియన్ డాలర్లు
5- రష్యా - $ 585 బిలియన్ డాలర్లు