Best Pension Plan: నెలకు రూ.లక్ష పెన్షన్ కావాలా? ఇలా చేయండి
Best Pension Plan: ప్రతి నెలా పెన్షన్ పొందడం భవిష్యత్తులో చాలా అవసరం. ఎందుకంటే రానున్న రోజుల్లో ఖర్చులు మరీ విపరీతంగా పెరిగిపోతాయి. మరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నెలకు రూ.లక్ష పెన్షన్ గా పొందాలంటే ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం రండి.

జాతీయ పెన్షన్ పథకం (NPS) ద్వారా నెలకు లక్ష రూపాయల పెన్షన్ పొందడానికి ఒక ప్లాన్ ఉంది. 20 ఏళ్ల వయసులోనే పెట్టుబడి ప్రారంభిస్తే చక్రవడ్డీ పొందడం ద్వారా నెలకు రూ.లక్ష పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదెలాగో చూద్దాం రండి.
ఉద్యోగం ప్రారంభించిన వెంటనే పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసుకోవాలి. ముందుగానే ప్రణాళిక వేసుకుంటే పదవీ విరమణ సమయంలో పెన్షన్ పొందే అవకాశాలు ఎక్కువ. జాతీయ పెన్షన్ పథకం ద్వారా ఇది సాధ్యమవుతుంది.
జాతీయ పెన్షన్ పథకం (NPS) లో పెట్టుబడి పెట్టడం అంటే పదవీ విరమణ కోసం ఆర్థిక స్వాతంత్య్రం సాధించినట్టే. ఈ పథకం దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. చక్రవడ్డీ ద్వారా పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందిస్తుంది. 20 ఏళ్ల వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే 60 ఏళ్ల వయసులో మీరు నెలకు లక్ష రూపాయల పెన్షన్ గా పొందవచ్చు.
NPS ఎలా పనిచేస్తుంది?
NPS పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల పదవీ విరమణ తర్వాత పెన్షన్‌తో పాటు ఒక మొత్తం కూడా లభిస్తుంది. పెట్టుబడిదారుడు 60 % మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 % వార్షిక పథకం ద్వారా రెగ్యులర్ పెన్షన్‌ను అందిస్తుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తి 20 ఏళ్ల వయసులో నెలకు రూ.7,850 NPSలో పెట్టుబడి ప్రారంభిస్తే 40 సంవత్సరాలు 10 % వార్షిక రాబడితో పెట్టుబడి పెట్టారనుకుందాం. ఈ కాలంలో అతని మొత్తం పెట్టుబడి రూ.37.68 లక్షలు అవుతుంది. వడ్డీ రూ.4.63 కోట్లు. మొత్తం నిధి రూ.5 కోట్లకు పైగా ఉంటుంది.
రూ.లక్ష పెన్షన్ ఎలా పొందాలి
60 ఏళ్ల వయసులో మీరు పొదుపు చేసిన మొత్తం రెండు భాగాలు అవుతుంది. మొత్తం పొదుపు లో 60 % అంటే రూ.3 కోట్లు విత్ డ్రా చేసుకోవచ్చు. వార్షిక పథకంలో 40% పెట్టుబడి పెట్టాలి. అంటే రూ.2 కోట్లు పెట్టుబడిగా పెట్టాలి. ఈ వార్షిక పథకంలో 6 % వార్షిక రాబడితో ఈ పథకం నెలకు రూ.1,00,116 పెన్షన్ అందిస్తుంది.
ఇది కూడా చదవండి: 35% సబ్సిడీతో బిజినెస్ లోన్ కావాలా? PMEGP స్కీమ్ కు అప్లై చేయండి
NPS పెట్టుబడి ప్రయోజనాలు
20 ఏళ్ల వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే చక్రవడ్డీ ప్రయోజనం పూర్తిగా పొందుతారు. నెలవారీ పెట్టుబడి మొత్తాన్ని కాలక్రమేణా పెంచుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C, 80CCD (1B) కింద NPS పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం పదవీ విరమణ తర్వాత మంచి ఆదాయాన్ని అందిస్తుంది.