155 నుండి నెంబర్ వన్ స్థానానికి ఇండియా : ఇది జియో చేసిన అద్భుతమే
2016 సెప్టెంబర్ లో ప్రారంభమైన రిలయన్స్ జియో ప్రస్తుతం ఎనిమిదో వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్బంగా జియోకు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Reliance Jio 8th Anniversary
Reliance Jio 8th Anniversary : రిలయన్స్ జియో ఎంట్రీతో దేశంలో పెను మార్పులు సంభవించాయి. మొదట్లో ఉచితంగానే వాయిస్ కాల్స్, డాటా అందించడంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. దీంతో దేశంలోని ప్రతి ఒక్కరికీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సరదా కోసం ఉపయోగించే సోషల్ మీడియా నుండి ఆర్థిక వ్యవహారాల కోసం ఉపయోగించే డిజిటల్ పేమెంట్స్ వరకు ప్రతిదీ మనచేతిలోని సెల్ ఫోన్ లో అందుబాటులో వుంటుంది. ఈ టెక్నాలజీ విప్లవం జియో రాకతోనే ప్రారంభం అయ్యిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
టెలికాం రంగంలో రిలయన్స్ జియో అడుగుపెట్టి ఎనిమిదేళ్ళు పూర్తయ్యింది. 2016, సెప్టెంబర్ లో జియో సేవలు ప్రారంభమయ్యాయి... ఈ ఏడాది ఎనిమిదో వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ జర్నీలో జియో ఎన్నో అద్భుత విజయాలను అందుకుంది... మరెన్నొ మైలురాళ్లను దాటేసింది. తాను ఎదుగుతూనే దేశ ప్రగతిలో తనవంతు పాత్ర పోషించింది జియో.
Reliance Jio 8th Anniversary
జియో ఎనిమిదేళ్ళ జర్నీ :
డాటా వినియోగంలో భారత్ టాప్ :
ఒకప్పుడు ఇంటర్నెట్ డాటా బాగా కాస్లీ. చాలా తక్కువమంది ఫోన్లలో ఇంటర్నెట్ ఉపయోగించేవారు. ఇదంతా జియో రాకకు ముందు పరిస్థితి. ఎప్పుడయితే జియో టెలికాం రంగంలో అడుగుపెట్టిందో పరిస్థితి తలకిందులయ్యింది... ఇప్పుడు ఇంటర్నెట్ డాటా లేని ఫోన్ అంటూ వుండటంలేదు. 2016లో జియో ఫ్రీ డేటా అందించి భారతీయులందరికీ ఇంటర్నెట్ ను పరిచయం చేసింది. ఇప్పుడు సెల్ ఫోన్ వాడే ప్రతిఒక్కరు ఇంటర్నెట్ డాటా వినియోగిస్తున్నారు.
రిలయన్స్ జియో సేవలు ప్రారంభించిన 2016 లో డాటా వినియోగంలో భారత్ 155వ స్థానంలో వుంది. కానీ ఎనిమిదేళ్లు పూర్తయ్యేనాటికి అంటే ప్రస్తుతం డాటా వినియోగంలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ గా నిలిచింది. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో డాటా వినియోగం 73 శాతం పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ లో భారత్ ది 8 శాతం. భారత్ మొత్తం డేటా ట్రాఫిక్ లో జియో 60 శాతం వాటా కలిగిఉంది.
Reliance Jio 8th Anniversary
దేశంలోని సగంమంది జియో వినియోగదారులే :
వందకోట్లకు పైగా జనాభా కలిగిన దేశంలో సగానికి సగం జియో వినియోగదారులే. సున్నా నుండి ప్రారంభమైన జియో ప్రస్థానం ప్రస్తుతం (2024 ఆగస్ట్ నాటికి) 49 కోట్లమంది సబ్ స్క్రైబర్లకు చేరుకుంది. వీరిలో 13 కోట్ల మంది 5జి యూజర్లుగా ఉన్నారు. ఇలా ఎనిమిదేళ్లలో భారతీయులకు చాలా చేరువయ్యింది జియో.
2016 నుండి ఇప్పటివరకు జియో చాలా వినూత్న ప్రయోగాలు చేస్తోంది. అన్నీ ఉచితమే అంటూ జియో వేసిన తొలిఅడుగే వినూత్నం. ఇలా కస్టమర్లను ఆకట్టుకున్న జియో మెల్లిగా చార్జీలను అలవాటు చేసింది. ఇటీవల భారీగా రీచార్జ్ ధరలు పెంచినా జియో బ్రాండ్ చెక్కుచెదరలేదు. కొంతమంది జియోను వీడినా అది పెద్దగా ప్రభావం చూపించలేదనే చెప్పాలి.
Reliance Jio 8th Anniversary
5G సేవలు :
భారతదేశంలో 5G సేవలను అందుబాటులోకి తెచ్చిన ఘనత రిలయన్స్ జియోది. 4G టెక్నాలజీపై ఆధారపడకుండా ప్రత్యేకంగా 5G నెట్ వర్క్ ను ఏర్పాటుచేసింది జియో. ఇలా సాంకేతికపరంగా చాలా ముందుది జియో.
జియో దేశీయంగా అభివృద్ధి చెందింది. ఫుల్లీ క్లౌడ్ – నేటివ్, సాఫ్ట్ వేర్ – డిఫైన్డ్, డిజిటల్ గా నిర్వహించగలదిగా ఎండ్ టు ఎండ్ 5జి స్టాక్ ను జియో ప్రవేశపెట్టింది. క్వాంటమ్ సెక్యూరిటీ వంటి అధునాతన ఫీచర్లను ఈ 5జి స్టాక్ సపోర్ట్ చేస్తుంది.
దేశానికి వాయిస్ ఓవర్ ఎల్టీఈ (విఒఎల్ టిఇ)ని అందించింది జియో. అలాగే వినియోగదారులకు సెల్ఫ్ – కేర్ ప్లాట్ ఫామ్, మై జియో యాప్ ను కూడా అందించింది. వై-ఫై కాలింగ్ ను ప్రవేశపెట్టడం ద్వారా కనెక్టివిటీ ఆప్షన్లను జియో మరింతగా మెరుగుపర్చింది.
Reliance Jio 8th Anniversary
డేటా వినియోగంలో రికార్డులు :
డేటా, వాయిస్ వినియోగం విషయంలో రిలయన్స్ జియో అద్భుతాలు చేసింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే జియో ఎంత వేగంగా వృద్ధి చెందిందో తెలుస్తుంది. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఈ నెట్ వర్క్ 148.5 బిలియన్ జీబీల డేటాను, 5.5 ట్రిలియన్ నిమిషాల వాయిస్ ను నిర్వహించింది. 2016 లో సగటు జియో వినియోగదారు 800 ఎంబీ ఉపయోగించగా, ఇప్పుడు ఇది నెలకు 30 జీబీగా ఉంది.
జియో సేవలు :
2023లో జియో సంస్థ జియో భారత్, జియో బుక్, జియో ఎయిర్ ఫైబర్ లను ప్రవేశపెట్టింది. 2022 జియో ట్రూ5జి, 2021 లో జియోఫోన్ నెక్ట్స్ ప్రవేశపెట్టారు. జియో ఫైబర్ దేశంలో నంబర్ వన్ ఫైబర్ టు ది హోమ్ (ఎఫ్ టిటిహెచ్) ప్రొవైడర్ నిలిచింది.
జియో పేటెంట్స్ :
ఇప్పటి వరకూ ఈ సంస్థ 1,687 పేటెంట్లకు దరఖాస్తు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన 1,255 దరఖాస్తులు కూడా వీటిలో ఉన్నాయి. 6జి, ఏఐ, బిగ్ డేటా, ఐఓటీ వంటి కీలక రంగాలకు కూడా ఈ పేటెంట్లు విస్తరించాయి.
రాబోయే రోజుల్లోనూ టెలికాం రంగంలో టాప్ లో వుండేలా జియో వ్యూహాలు రచిస్తోంది. భారత్ లో 5G నెట్ వర్క్ విభాగంలో జియో నాయకత్వ స్థానాన్ని కొనసాగించనుంది. ఏఐ విషయంలోనూ జియో చాలా ముందుంది... ఇప్పటికే ఏఐ రెడీ డేటా సెంటర్స్ ను జామ్ నగర్ లో ఏర్పాటు చేసింది.