ఇంటి వద్దే ఉంటూ ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ.లక్ష గ్యారెంటీ
బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలని చాలా మంది అనుకుంటారు. అయితే పెట్టుబడి, ప్రోత్సాహం లేకపోవడంతో నిరాశగా ఉన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడిపేస్తుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండి చేసే కొన్ని వ్యాపారాలున్నాయి. వాటిలో ఉత్తమమైన ఒక బిజినెస్ గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
పుట్టగొడుగులు(మష్రూమ్స్) తినడం ఆరోగ్యానికి చాలా ఉపయోగం అంటూ డాక్టర్లు చెబుతున్నారు. ఇవి మనకు మార్కెట్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. పుట్టగొడుగులలో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే అవి దొరకడమే కష్టంగా ఉంటోంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, బెంగలూరు వంటి మహా నగరాల్లో మాత్రమే ఇవి లభిస్తున్నాయి. అవి కూడా కేవలం సూపర్ మార్కెట్లు, మాల్స్‌లోనే కనిపిస్తుంటాయి. ఇంత అరుదుగా ఉండే పుట్టగొడుగులు మార్కెట్‌లో అందరికీ దొరకకపోవడంతో వీటికి మహా డిమాండ్ ఉంది.
పుట్టగొడుగులపై ఆపోహలు..
ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగులు సుమారు 200 రకాలున్నాయి. అయితే వాటిలో కేవలం 10 రకాలు మాత్రమే తినడానికి ఉపయోగిస్తారు. మిగిలినవి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇదే కారణంతో చాలా మంది మష్రూమ్స్ తినడం మంచిది కాదు అనుకుంటారు. డాక్టర్లే పుట్టగొడుగులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఇవి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అంటున్నారు.
మష్రూమ్స్‌లో రకాలు..
* బటన్ పుట్టగొడుగు (Button Mushroom) ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న పుట్టగొడుగు రకం. అసలు పుట్టగొడుగు అంటేనే బటన్ మష్రూమ్ అన్న విధంగా గుర్తింపు ఏర్పడింది. ఇదొక్కటే తినదగిన పుట్టగొడుగు అని అందరూ అనుకుంటారు. అయితే మరో నాలుగు రకాల పుట్టగొడుగులు కూడా ఆహారం తీసుకోవచ్చు. వీటిని ఇతర దేశాల్లో ఇష్టంగా తింటుంటారు. ఇవి ఎక్కువగా చలి ప్రదేశాల్లో పెరుగుతాయి.
* ఓయిస్టర్ పుట్టగొడుగు(Oyster Mushroom). ఈ మష్రూమ్స్ వేగంగా పెరుగుతాయి. పెంపకానికి కూడా తక్కువ ఖర్చు అవుతుంది. వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓయిస్టర్ మష్రూమ్స్‌ను ఎక్కువగా పొడి చేసి వంటల్లోనూ, మెడిసన్‌లోనూ వినియోగిస్తారు.
* షిటాకీ పుట్టగొడుగు(Shiitake Mushroom). ఈ రకం పుట్టగొడుగులు ఎక్కువగా మెడిసన్‌లో ఉపయోగిస్తారు. ఆసియా దేశాల్లో విస్తృతంగా వాడుకలో ఉన్న పుట్టగొడుగులు ఇవి. వీటిని ఆ దేశాల్లో ఆహారంగా తీసుకుంటారు.
* రీషీ పుట్టగొడుగు(Reishi Mushroom). ఔషధ గుణాలు కలిగి ఉన్న పుట్టగొడుగు రకం ఇది. మెడిసన్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
* మిల్కీ పుట్టగొడుగు(Milky Mushroom). ఈ పుట్టగొడుగులు ఎక్కువగా వేడి ప్రాంతాల్లో పెరుగుతాయి. అంటే దక్షణ భారత దేశంలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. ఇవి సహజంగా పెరిగే పుట్టగొడులను పోలి ఉంటాయి. వాస్తవానికి ఇవి చాలా మంచి ఆహారం. అయితే పండించే వారు లేక ఈ పుట్టగొడుగుల పెంపకం మరుగున పడిపోతోంది.
ఇంటి వద్ద ఉంటూ పెంచేవి మిల్కీ మష్రూమ్స్
ఇండియాలో బటన్ పుట్టగొడుగులు చాలా ఫేమస్. అయితే ఇవి చల్లని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. ఇటీవల బటన్ మష్రూమ్స్‌ను ఏసీ గదుల్లో పెంచుతున్నారు. అయితే దీనికి రూ.కోట్లలో పెట్టుబడి పెట్టాలి. అయితే మిల్కీ మష్రూమ్స్ పెంచడానికి చాలా తక్కువ పెట్టుబడి పెడితే సరిపోతుంది. మిల్కీ మష్రూమ్స్‌ను ఇంట్లోనే గదుల్లో పెంచవచ్చు. దీనికి 30 నుంచి 35 డిగ్రీల టెంపరేచర్ అవసరం. అందుకే ఇవి ఇంట్లో గదుల్లో పెంచడానికి అనుకూలంగా ఉంటుంది.
మిల్కీ మష్రూమ్స్ పెంపకానికి ఇవి కావాలి..
వరిగడ్డి, పుట్టగొడుగుల విత్తనాలు లేదా మైసీలియం, ప్లాస్టిక్ బ్యాగులు, ట్రేలు ఉపయోగించి మిల్కీ మష్రూమ్స్ పెంచవచ్చు. వరిగడ్డిని ముక్కలుగా చేసి రసాయన నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటిని ఆరబెట్టి కొంచెం తడిగా ఉండగా ప్లాస్టిక్ బ్యాగుల్లో లేయర్లుగా వేసి మష్రూమ్ విత్తనాలు వేయాలి. ఇలా అయిదు పొరలు తయారు చేసి ప్లాస్టక్ బ్యాగ్‌కు గాలి వెళ్లకుండా రబ్బరు పెట్టాలి. వాటిని ఓ గాలి, వెలుతురు లేని చీకటి గదిలో 21 రోజులు ఉంచాలి. తర్వాత వాటిని తీసి కేవలం వెలుతురు(లైట్) ఉన్న గదిలో ఉంచాలి. ప్లాస్టిక్ బ్యాగ్‌ను కట్ చేసి రెండు భాగాలపైనా పాశ్చరైజేషన్ చేసిన మట్టిని వేయాలి. ఇలా చేసిన 4, 5 రోజుల తర్వాత మిల్కీ మష్రూమ్స్ రావడం ప్రారంభమవుతాయి.
* వ్యాపార విధానం ఇలా..
పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్‌ని బట్టి హోటల్స్, రెస్టారెంట్స్, సూపర్‌మార్కెట్లకు విక్రయించవచ్చు. పుట్టగొడుగుల ఆరోగ్య కారణాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేసి నేరుగా వారికి ఆన్‌లైన్ ద్వారా కూడా అమ్ముకోవచ్చు.
కేవలం రూ.10 వేల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మీ ప్రాంతంలో ఉన్న డిమాండ్‌ను బట్టి పెట్టుబడిని పెంచుకోవచ్చు. కిలో మష్రూమ్స్ మార్కెట్లో సుమారు రూ.200 వరకు ధర పలుకుతోంది. ఒక్కో మష్రూమ్ బ్యాగ్ తయారీకి సుమారు రూ.50 అవుతుంది. ఒక్కో బ్యాగ్ నుంచి కిలో నుంచి కిలోన్నర పుట్టగొడుగులు వస్తాయి. ఈ రకంగా చూస్తే మీరు ఎంత పెట్టుబడి పెడితే దానికి మూడింతలు లాభం పొందవచ్చు. ఇలా మీరు నెలకు రూ.30 వేలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.లక్ష ఆదాయంగా పొందవచ్చు. అంతకంటే ఎక్కువ ఎంత పెట్టినా దానికి మూడింతలు సంపాదించవచ్చు.
పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. కృషివిజ్ఞాన కేంద్రాలు లేదా పర్యావరణ సంస్థల ద్వారా శిక్షణ పొందితే మంచి ఫలితాలు పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందడానికి పుట్టగొడుగుల వ్యాపారం మంచి ఆప్షన్.