Google Mapsలో అద్భుతమైన ఫీచర్: మీ ఊరిలో ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడే చెక్ చేసుకోండి
గూగుల్ కంపెనీ ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ఒక అద్భుతమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్ లో ఎయిర్ వ్యూ+ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీరుంటున్న ప్రాంతంలో ఎయిర్ పొల్యూషన్ ఎంతుందో వెంటనే తెలుసుకోవచ్చు. కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అద్భుతమైన ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి.
గూగుల్ తన బిజినెస్ ను డెవలప్ చేసుకుంటూనే సమాజానికి ఉపయోగపడే ఎన్నో పనులు చేస్తోంది. మనం ఏ విషయం గురించైనా తెలుసుకోవడానికి ముందు ఓపెన్ చేసేది గూగుల్ సెర్చ్. ప్రపంచం గురించే కాకుండా ఈ విశ్వం గురించి ఏం తెలుసుకోవాలన్నా గూగుల్ సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఇంత భారీ ఇన్ఫర్మేషన్ ను కంప్యూటింగ్ ద్వారా నిరంతరం అనుసంధానం చేస్తూ ప్రజలకు నాలెజ్డ్ అందిస్తోంది. ఇదే కాకుండా గూగుల్ డాక్స్, గూగుల్ షీట్‌లు, గూగుల్ స్లయిడ్లు, జీమెయిల్, యూట్యూబ్, షెడ్యూలింగ్, గూగుల్ క్యాలెండర్, గూగుల్ డ్రైవ్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి.
గూగుల్ డ్యుయో, గూగుల్ చాట్, గూగుల్ మీట్, గూగుల్ ట్రాన్సలేషన్, మ్యాపింగ్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ ఫోటోలు అవసరమైన సేవలను అందిస్తాయి. 2019 మార్చిలో గూగుల్ స్టేడియా పేరుతో క్లౌడ్ గేమింగ్ సర్వీస్‌ను ఆవిష్కరించింది.
ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో ఎయిర్ వ్యూ+ ఫీచర్ ద్వారా ఇండియాలో 100 నగరాల్లో గాలి నాణ్యత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. డిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న కారణం వల్ల ఈ కొత్త ఫీచర్ వచ్చింది. ఇది ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు కూడా సహాయపడుతుంది.
గాలి కాలుష్యం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే గాలి నాణ్యత డేటా తెలుసుకోవడానికి సామాన్యులకు ఎలాంటి అవకాశమూ లేదు. అందువల్ల రోగాలు వస్తే వైద్యం చేయించుకోవడం తప్ప ఎలా నివారణ చర్యలు తీసుకోవాలో ప్రజలకు తెలియని పరిస్థితి.
సాధారణంగా కార్పొరేషన్లు, నగర పరిపాలన అధికారులు, పరిశోధకులు లాంటి వారికి ఎయిర్ పొల్యూషన్ పై అవగాహన ఉంటుంది. ఈ సమాచారాన్ని ఎప్పకప్పుడు వారు తెలుసుకుంటూ ప్రభుత్వాలకు నివేదికలు ఇస్తాయి. అయితే గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ వల్ల సాధారణ ప్రజలకు కూడా గాలి నాణ్యతను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీని వల్ల అధికారులతో కలిసి ప్రజలు కూడా పొల్యూషన్ తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుస్తుంది.
గూగుల్ కంపెనీ ఆరాసురే, రెస్పిరర్ లివింగ్ సైన్సెస్ వంటి వాతావరణ సాంకేతిక సంస్థలు తమకు చాలా సాయం చేశాయని వెల్లడించింది. గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేని నగరాల్లో గాలి నాణ్యత సెన్సార్ నెట్‌వర్క్‌ను ఇవి ఏర్పాటు చేశాయి. ఈ సెన్సార్లు ప్రతి నిమిషం గాలి నాణ్యత కొలతలను అందిస్తాయి. ఈ సెన్సార్లు 150 కంటే ఎక్కువ భారతీయ నగరాల్లో ఉపయోగిస్తున్నారు. అవి గాలి నాణ్యతను నిరంతరం చెక్ చేస్తుంటాయి.
ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు, CSTEP వంటి వాతావరణ చర్యా బృందాల పరిశోధకుల మద్దతుతో ఈ సెన్సార్‌లను ధృవీకరించినట్లు గూగుల్ తెలిపింది. గాలి నాణ్యత కొలతలను వేగంగా లెక్కించడానికి గూగుల్ AIని ఉపయోగించి డేటా విశ్లేషిస్తుంది.
గూగుల్ AI ద్వారా ఆధారితమైన ఎయిర్ వ్యూ+ ఫీచర్, భారతదేశం అంతటా ఉన్న వినియోగదారులకు గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఉపయోగించడం వల్ల మీ ప్రాంతంలో గాలి నాణ్యత సమాచారాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. పర్యావరణ పర్యవేక్షణ, టౌన్ ప్లానింగ్ ప్రభుత్వ సంస్థలకు కూడా ఈ గాలి నాణ్యత తెలుసుకోవడానికి గూగుల్ ఎయిర్ వ్యూ+ ఫీచర్ ఉపయోగపడుతోంది.