ఇకపై మీ ఫోన్‌ను ఎవరూ దొంగిలించలేరు: ఈ కొత్త ఫీచర్‌తో మీ డేటా కూడా సేఫ్
మీ స్మార్ట్‌ఫోన్లను దొంగిలిస్తారన్న భయం ఇకపై మీకు అవసరం లేదు. ఎందుకంటే గూగుల్ అద్భుతమైన స్మార్ట్ ఫీచర్ ని తీసుకొస్తోంది. ఆ ఫీచర్ విశేషాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

స్మార్ట్‌ఫోన్ దొంగతనం పోతుందనే భయం ఉంటే ఇక చింతించకండి. గూగుల్ ఐడెంటిటీ చెక్ అనే అధునాతన భద్రతా ఫీచర్‌ను విడుదల చేస్తోంది. ఇది ముందుగా పిక్సెల్, శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఈ ఫీచర్ ఇతర స్మార్ట్‌ఫోన్‌లలోకి కూడా వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
గూగుల్ ఐడెంటిటీ చెక్ మీ స్మార్ట్‌ఫోన్ ను దొంగిలించకుండా కాపాడటమే కాకుండా, దానిలో డేటాను కూడా రక్షిస్తుంది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ స్మార్ట్‌ఫోన్‌ల భద్రతను పెంచడానికి గూగుల్ ఐడెంటిటీ చెక్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ను ముఖ్యమైన అకౌంట్స్, సెట్టింగ్‌లను యాక్సెస్ చేయడానికి ఉపయోగించొచ్చు. అంటే మీ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడెంటిటీ వంటి బయోమెట్రిక్ డేటా ఉపయోగించి ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఇది గూగుల్, శామ్‌సంగ్ అకౌంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
ఎలా పనిచేస్తుంది..
మీ స్మార్ట్‌ఫోన్‌లను ఎవరైనా అన్‌లాక్ చేయడానికి ప్రయత్నిస్తే గూగుల్ ఐడెంటిటీ చెక్ ఫీచర్ అనధికారిక యాక్సెస్‌ను అడ్డుకుంటుంది. అంటే ఫోన్ ఓపెన్ కాకుండా రక్షణగా పనిచేస్తుంది. దీంతో వారు స్మార్ట్ ఫోన్ దొంగిలించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫోన్ లో ఉన్న మీ డేటా కూడా సేఫ్ గా ఉంటుంది.
గూగుల్ ఐడెంటిటీ చెక్ ప్రస్తుతానికి ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే పనిచేస్తుంది. ఇది తాజా Android 15 సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్న పిక్సెల్ ఫోన్లు, One UI 7ని సపోర్ట్ చేసే శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలో మాత్రమే పనిచేస్తుంది. ఈ ఫోన్లలో గూగుల్ ఐడెంటిటీ చెక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర ఫోన్లలో కూడా పనిచేసేలా గూగుల్ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను Galaxy S25, Galaxy S25+, Galaxy S25 Ultra సిరీస్ ఫోన్‌లలో పొందవచ్చు. అదేవిధంగా Pixel 6, Pixel 7, Pixel 8, Pixel 9 సిరీస్ ఫోన్లు, Pixel Fold మోడల్‌లో పొందవచ్చు.
థెఫ్ట్ డిటెక్షన్ లాక్
మీకు తెలుసా? ప్రస్తుతం అన్ని ఫోన్లలో థెఫ్ట్ డిటెక్షన్ లాక్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా Android 10, ఆ తర్వాతి వెర్షన్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంది. మీ ఫోన్ అన్‌లాక్ అయి ఉన్నప్పుడు ఎవరైనా దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే అనుమానాస్పద ప్రవర్తనను గుర్తించిన వెంటనే స్క్రీన్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. ఇది అనధికారిక యాక్సెస్‌ను నిరోధించడానికి, మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది.