Gold Prices: రూ.90 వేలకు చేరువలో బంగారం! కారణం ట్రంపేనా?
బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్లే ఉంది ప్రస్తుత పరిస్థితి. గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు పెళ్లిళ్లకో, ఫంక్షన్లకో సామాన్యులు అడపాదడపా బంగారం కొనేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనబడటం లేదు. అసలు సామాన్యులు భవిష్యత్తులో బంగారం కొనగలరా? ఈ పరిస్థితికి కారణం ఎవరు లాంటి విషయాలు ఇక్కడ చూద్దాం.

రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. భవిష్యత్తులో బంగారం కొనగలమా లేదా అనే సందేహాన్నిపుట్టిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.88,040, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 80,700 గా ఉంది.
మరి ఇంత ధర పెట్టి సామాన్యులు బంగారం కొనగలరా అంటే డౌటే అంటున్నారు ఆర్థిక నిపుణులు. బంగారం రేటు ఇంతలా పెరగడానికి కారణం ఏంటీ? ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది? ఇతర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లిళ్ల సీజన్
పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు పెరగడంతో సామాన్యులకి కష్టాలు ఎక్కువయ్యాయి. బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. మరోవైపు స్వర్ణకారులకి కూడా కష్టకాలం మొదలైంది. పెరిగిన ధరలతో ఆర్డర్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ట్రంప్ కారణమా?
అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని కొత్త రకాల పన్నుల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ పై పడింది. షేర్ మార్కెట్ కూడా అస్థిరంగా ఉండటం వల్ల చాలా షేర్ల ధరలు పడిపోతున్నాయి. దీంతో పెట్టుబడిదారుల్లో ఒకరకమైన భయం, ఆందోళన మొదలైంది.
బంగారంపై పెట్టుబడి
ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారంపైనే నమ్మకం పెట్టుకుంటున్నారు. పసిడిపై ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా కనబడుతోంది.
నిపుణుల మాట
బంగారంలో పెట్టుబడులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో దాని ధర పెరుగుతోంది. దీనివల్ల అన్ని దేశాల్లోనూ రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. త్వరలో బంగారం ధర రూ.90 వేలకు చేరే అవకాశం ఉందంటున్నారు.
సామాన్యులకు సమస్య
బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నా, సామాన్యులు, అమ్మేవారు మాత్రం ఆందోళన చెందుతున్నారు.