Gold Rate: రూ.90 వేలకు చేరిన బంగారం ధర.. వెండి ఏకంగా రూ.లక్ష, ఇంకా పెరుగుతాయా?
Gold Rate: బంగారం ధరకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. రికార్డు స్థాయిలో బంగారం ధర రూ.90 వేలకు చేరుకుంది. కేవలం బంగారమే కాకుండా వెండి సైతం రూ.లక్ష మార్కును దాటింది. బంగారం, వెండి ధరలు ఇంకా పెరుగుతాయా? తెలుసుకుందాం రండి.

ఈ కాలంలో బంగారంపై పెట్టుబడి పెట్టే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గుతున్న పరిస్థితులు కనిపించట్లేదు. మధ్య మధ్యలో కాస్త ధరలు తగ్గినా మళ్లీ ధరలు పెరగడం సాధారణంగా మారింది. కొన్ని దశాబ్దాల రికార్డులు తిరగేసినా ఇదే కనిపిస్తుంది. అందుకే చాలా మంది కాస్త డబ్బులుంటే బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు.
స్టాక్ మార్కెట్ లో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టే వారు పెరుగుతున్నారు. ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి బదులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. దీంతో బంగారు వ్యాపారులు మంచి లాభాలను పొందుతున్నారు.
ఇప్పుడు ఇండియాలో బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.88,100 గా ఉంది. ఇది ఒక్కసారిగా రూ.90,000లకు దగ్గరగా వచ్చేసింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇక వెండి విషయానికొస్తే రికార్డు స్థాయిలో కిలో వెండి రూ.లక్షకు చేరుకుంది. వెండి ధరలు రూ.లక్షకు చేరడం ఇది తొలిసారి కాదు.
ట్రంప్ ప్రకటనే కారణం..
అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై ఛార్జీలు విధిస్తున్న అన్ని దేశాలపై రెట్టింపు పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్ షేక్ అవుతోంది. ఇప్పటికే ఇలాంటి ప్రకటనలు ఎన్నో చేశారు. వరుసగా ట్రంప్ నుంచి వస్తున్న ఇలాంటి ప్రకటనల వల్లే బంగారం ధరలు పెరిగాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర అత్యధికంగా 2960 డాలర్లకు చేరింది. వెండి ఔన్స్ 34 డాలర్లకు చేరింది.