దీపావళి తర్వాత కారు కొనేందుకు సిద్ధమైపోండి, ఇలాంటి కార్లు రేట్లు తగ్గబోతున్నాయి
కార్ అంటేనే ధనవంతులకు చెందినదిగా అనుకుంటారు. మధ్యతరగతి వారు కారు కొనలేమని భావిస్తారు. ఈ దీపావళి తర్వాత ఎవరైనా కూడా కారు కొనవచ్చు. ఎందుకంటే వాటి ధరలు తగ్గబోతున్నాయి.

జీఎస్టీలో భారీ మార్పులు
దేశ జీఎస్టీ వ్యవస్థలో మార్పులు రాబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. నరేంద్ర మోడీ కూడా ఈ విషయాన్ని స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రకటించారు. భారత ఆటోమొబైల్స్ రంగం దీపావళి తర్వాత కొత్త ఉత్తేజాన్ని పొందుతుందని కూడా నివేదికలు చెబుతున్నాయి. అన్ని కార్ల రేట్లు తగ్గుతాయని ఇక్కడ మేము చెప్పడం లేదు... కానీ మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా కొన్ని చిన్న కార్ల రేట్లు మాత్రం తగ్గుతాయి. అంటే చిన్నకార్ల రేట్లు దీపావళి తర్వాత జిఎస్టి లో వచ్చే మార్పుల వల్ల చాలా వరకు తగ్గవచ్చు. దీనివల్ల ఎంతో మందికి కారు కల నిజమవుతుంది.
ఇవన్నీ ఇకపై కట్టక్కర్లేదు
మనదేశంలో వాహనాలపై జిఎస్టి ప్రస్తుతం 28 శాతంగా ఉంది. ఇదే మన దేశంలోనే అత్యధిక జీఎస్టీ రేటు కలిగిన రంగం. వాహన రకాన్ని బట్టి ఒక శాతం నుండి 22 శాతం వరకు అదనపు పన్నును కూడా విధిస్తారు. అంటే జిఎస్టితో పాటు ఈ అదనపు పన్నును కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల వాహనాలు కొనాలంటేనే ఆ అదనపు భారాన్ని మోయాల్సి వస్తుందన్న భయం ఎక్కువైపోతుంది. ఇంజన్ సామర్థ్యము, కారు పరిమాణము, కార్ మోడల్... ఇలా ఒక్కొక్క ఫీచర్ను బట్టి పన్నును అదనంగా విధిస్తూ ఉంటారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు అయితే ఐదు శాతం పన్ను అధికంగా ఉంటుంది. ఈ పన్నులన్నీ కలిపి మధ్య తరగతి వారికి కారును దూరం చేస్తున్నాయి. అయితే దీపావళి తర్వాత మాత్రం ఈ పన్నుల భారం తగ్గే అవకాశం ఉంది.
18శాతమే జీఎస్టీ?
ప్రస్తుతం జీఎస్టీ నాలుగు అంచెలుగా నడుస్తోంది. దాన్ని రెండు అంచెలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఐదు శాతం, 18 శాతం మాత్రమే పన్నులు విధించాలని అనుకుంటోంది. కొన్ని వస్తువులకు ఐదు శాతం జీఎస్టీ ఉంటే మరికొన్ని వస్తువులకు 18 శాతం జీఎస్టీ ఉంటుంది. దీపావళి తర్వాత ఈ రెండంచెత జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వస్తే కార్లపై జిఎస్టి 18 శాతం ఉండే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే పది శాతం జీఎస్టీ తగ్గుతుంది. దీనివల్ల కార్ల డిమాండ్లు కూడా పెరుగుతాయి. అమ్మకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగం నిపుణులు అంచనా వేస్తున్నారు.
చిన్న కార్లు కొనేయచ్చు
మధ్య తరగతి వారు ఎక్కువగా కొనేది చిన్నకారులనే కాబట్టి ఈ జిఎస్టి సంస్కరణ అనేది చిన్నకార్లు కొనేవారికి సహాయ పడుతుందని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల చిన్న కార్లపై పాతిక వేల రూపాయల కన్నా ఎక్కువ తగ్గే అవకాశం ఉంది. అయితే లగ్జరీ కార్లు, హై అండ్ వస్తువులపై మాత్రం భారీగా పన్నులు విధిస్తారు. వాటిపై 40 శాతం వరకు జీఎస్టీ పన్ను ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి మోడీ ప్రభుత్వం కొత్త తరహాలో జిఎస్టి సంస్కరణలు తీసుకువస్తోంది. సామాన్యులకు కార్లు, బైకులు వంటి సౌకర్యాలను దగ్గర చేసే విధంగా ఈ మార్పులు ఉండబోతున్నాయి. ఎందుకంటే భారతదేశంలో సంపన్నులతో పోలిస్తే సామాన్య జనమే అధికంగా ఉంటారు. కాబట్టి వారికి అందుబాటు ధరలోనే వస్తువులను ఉంచడం వల్ల డిమాండ్ పెరగడంతో పాటు మార్కెట్ బాగా నడుస్తుంది.