మహిళల కోసం మోదీ సర్కార్ సూపర్ స్కీమ్: ఎల్ఐసీ పాలసీలు చేయిస్తూ రూ.లక్షకు పైగా సంపాదన
మహిళలు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సాహం ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం చక్కటి పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా మహిళలు ఎల్ఐసీ పాలసీలు చేయించి ప్రతి నెలా కొంత అమౌంట్ జీతంగా పొందొచ్చు. ఈ రకంగా సంవత్సరానికి రూ.లక్షకు పైగా సంపాదించొచ్చు. ఇంత చక్కటి స్కీమ్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మోదీ సర్కార్ మహిళల కోసం కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. దీని పేరు ఎల్ఐసీ బీమా సఖి యోజన(LIC Bima Sakhi Yojana). ఈ పథకం చేరిన మహిళలు ఎల్ఐసీ పాలసీలు చేయించాలి. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలు పూర్తి చేసి ప్రతి నెలా రూ.7 వేలు జీతంగా పొందవచ్చు. అంతేకాకుండా ప్రతి LIC పాలసీపై కమిషన్ కూడా లభిస్తుంది.
మహిళలు స్వయం ఉపాధి పొందాలని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఇది ఒక ఉద్యోగం లాంటి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్. ఇందులో చేరిన మహిళలు ఫుల్ టైమ్ గా LIC పాలసీలు చేయించవచ్చు. లేదా తమ సొంత పనులు, ఇంటి పనులు చూసుకుంటూ పార్ట్ టైమ్ గానూ పనిచేయవచ్చు.
LIC Bima Sakhi Yojana ముఖ్య లక్ష్యం ఏంటంటే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్ట్రాంగ్ గా మారాలని, కుటుంబాలకు ఆసరాగా మారాలని, సొసైటీపై అవగాహన పెంచుకోవాలని ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ లో చేరడానికి మహిళలు కనీసం పదో తరగతి పాసై ఉండాలి. వయసు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. భారత దేశ పౌరులకే ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.
ఎల్ఐసీ బీమా సఖి యోజనలో చేరిన మహిళలకు మొదటి సంవత్సరం ఒక్కో నెలకు రూ.7,000 చొప్పున వారి అకౌంట్స్‌లో జమ చేస్తారు. రెండవ సంవత్సరం నెలకు రూ.6,000 చొప్పున డిపాజిట్ చేస్తారు. అదే మూడవ సంవత్సరం నెలకు రూ.5,000 చొప్పున వేస్తారు. ఈ జీతం కాకుండా ప్రతి నెల మీరు చేయించిన పాలసీలపై కమీషన్ కూడా పొందవచ్చు. మీరు గాని అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసినట్లయితే సంవత్సరానికి కనీసం రూ.48,000 వరకు పొందవచ్చు.
ఈ స్కీమ్ లో చేరిన మహిళలు ఎల్ఐసీ ఏజెంట్లుగా చేరి నెలకు కనీసం రెండు పాలసీలను చేయించాలి. ఈ పాలసీ అమ్మకాల ద్వారా పొందే రెన్యువల్ కమీషన్ భవిష్యత్‌లో మీకు స్థిర ఆదాయాన్ని ఇస్తుంది. మహిళలు తమ సొంత పనులు చేసుకుంటూ ఈ పాలసీలు చేయించవచ్చు. మహిళలకు బీమా విక్రయం ద్వారా ఆదాయం అందించడంతో పాటు వారికి ఆర్థిక స్వతంత్రాన్ని కల్పించడమే ప్రధానమైన లక్ష్యంగా మోదీ సర్కార్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది.