రోడ్డుపై మీ కారు ఆగిపోయిందా? టోల్ గేట్ సిబ్బంది ఉచితంగా పెట్రోల్ తెచ్చి ఇస్తారని తెలుసా?
పెట్రోల్ లేక మీ వెహికల్ ఆగిపోయిందా? రోడ్డుపై మీ కార్ బ్రేక్ డౌన్ అయ్యిందా? అయితే మీకు దగ్గర్లో ఉన్న టోల్ గేట్ యాజమాన్యం మీకు హెల్ప్ చేస్తుందని తెలుసా? టోల్ గేట్ నిర్వాహకులు ఉచితంగా అందించాల్సిన ఫెసిలిటీస్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాటి గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ బూత్‌లు ఏర్పాటు చేసి భారీగా పన్ను వసూలు చేస్తుంది. రోడ్లు వేసినందుకు, ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేసినందుకు ఈ పన్ను వసూలు చేస్తారు. అయితే వీటితో పాటు వినియోగదారులకు చాలా రకాల ఫెసిలిటీస్ ని టోల్ గేట్ నిర్వాహకులు అందిస్తారు. అవేంటో తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతి టోల్ గేట్ వద్ద వాష్ రూమ్స్, డ్రింకింగ్ వాటర్, అద్దెకు రెస్ట్ రూమ్స్ వంటి ఫెసిలిటీస్ ఉండాలి. కాని టోల్ గేట్స్ వద్ద ఇలాంటి మినిమం సౌకర్యాలు ఉన్నాయని చాలా మందికి తెలియక దారిలో ఉన్న హోటల్స్ కి వెళుతుంటారు. ఇక హోటల్ కి వెళ్తే డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టక తప్పదు. మంచి నీళ్లు తాగాలన్నా కొనుక్కోవాల్సిందే.
అయితే టోల్ గేట్ వాళ్లు ఇలాంటి సాధారణ సౌకర్యాలతో పాటు మీరు, మీ వాహనాలు ప్రాబ్లమ్ లో ఉంటే హెల్ప్ కూడా చేస్తారు. మీరు టోల్ పరిధిలో ఉన్న రోడ్డులో మీరు ప్రయాణం చేస్తుంటే మీ కారులో పెట్రోల్ అయిపోతే టోల్ సిబ్బంది వచ్చి మీకు పెట్రోల్ ఇస్తారు. మీరున్న ప్లేస్ కి దగర్లో ఉన్న టోల్ బూత్ నుంచి మీరు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. నేషనల్ హైవేపై వెళుతున్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్లు రాసి బోర్డులు కనిపిస్తాయి. ఆ నంబర్లు గుర్తు పెట్టుకొని వారికి ఫోన్ చేస్తే 5 లీటర్ల పెట్రోల్ ఉచితంగా తీసుకొచ్చి మీ వెహికల్ లో పోస్తారు.
అదేవిధంగా టోల్ పరిధిలో ఉన్న రోడ్డులో మీ కారు బ్రేక్ డౌన్ అయితే మీ సమీపంలో ఉన్న టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి చెబితే వారు మరో వెహికల్ పంపించి మీ వెహికల్ ని టోల్ గేట్ వరకు ఉచితంగా తీసుకెళతారు. దీని కోసం మీరు ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు చేసి వెహికల్ ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
అంతేకాకుండా మీరు టోల్ పరిధిలో ఉన్న రోడ్డులో ప్రయాణిస్తుంటే మీకు అకస్మాత్తుగా ఆరోగ్యం పాడైతే టోల్ బూత్ వాళ్లే మెడికల్ ఎమర్జెన్సీ వెహికల్ ని మీరున్న చోటికి పంపిస్తారు. ఈ ఫెసిలిటీస్ అన్నీ టోల్ గేట్ నిర్వాహకులు మీకు ఉచితంగానే అందిస్తారు. అయితే మీరు చేయాల్సింది ఆ టోల్ బూత్ సర్వీస్ నంబర్లు గుర్తు పెట్టుకొని కాల్ చేసి చెప్పాలి. మధ్యలో అక్కడక్కడ ఈ టోల్ ఫ్రీ నంబర్లు ఉన్న బోర్డులు కూడా కనిపిస్తాయి. వాటిని ఉపయోగించుకొని మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఉచిత సర్వీసులను సద్వినియోగం చేసుకోండి.