జియో, ఎయిర్‌టెల్‌కి పోటీగా BSNL కొత్త డేటా ప్లాన్: 3 నెలలకు 3600 GB
BSNL సరికొత్త ప్లాన్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. జియో, ఎయిర్‌టెల్, తదితర పోటీ కంపెనీలు ఇస్తున్న టారిఫ్ ప్లాన్ల కంటే తక్కువ ధరకు ఎక్కువ సౌకర్యాలతో ప్లాన్లు అందిస్తోంది. ఇటీవల 3 నెలల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ ప్రవేశ పెట్టింది. దీని ద్వారా మొత్తం 3600 GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వరుస ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే నెట్‌వర్క్ సిగ్నల్స్ ను మెరుగుపరచడంపై దృష్టి పెట్టంది. BSNL ఇటీవల సుమారు 51,000 కొత్త 4G మొబైల్ టవర్‌లను ఏర్పాటు చేసింది. దీంతో వినియోగదారులు మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగించుకుంటున్నారు. అంతే కాకుండా టాటా కంపెనీతో కలిసి వినియోగదారుల కోసం మరిన్ని సేవలు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది.
BSNL కేవలం రూ.999 ధరకే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ మూడు నెలలు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు మొత్తం 3600GB డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే నెలకు 1200 GB వాడుకోవచ్చు. ఈ ప్లాన్ 25 Mbps వేగంతో హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇవే కాకుండా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు భారతదేశంలోని ఏ నంబర్‌కైనా అన్ లిమిటెడ్ గా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.
ఈ ప్లాన్ ద్వారా నెలకు 1200 GB డేటా వాడుకోవచ్చు. ఆ లిమిట్ దాటి మీరు డాటా ఉపయోగిస్తే ఇంటర్నెట్ వేగం 4Mbpsకి తగ్గుతుంది. కానీ అన్ లిమిటెడ్ డేటాను మాత్రం మీరు వాడుకోవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ మాత్రమే తగ్గుతుంది. ఈ ప్లాన్‌ను BSNL సెల్ఫ్-కేర్ యాప్, కంపెనీ వెబ్‌సైట్ లేదా 1800-4444 హెల్ప్‌లైన్ ద్వారా యాక్టివేట్ చేయవచ్చు.
అంతేకాకుండా BSNL భారతదేశంలోనే మొట్టమొదటి ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ సేవను కూడా ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులను ఎంతగానో ఆకర్షస్తోంది. 500 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు ఇందులో చూడొచ్చు. 12 OTT ప్లాట్‌ఫారమ్‌లకు మీరు ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఇవన్నీ సెట్-టాప్ బాక్స్ అవసరం లేకుండానే పొందవచ్చు. మొదటగా మధ్యప్రదేశ్, తెలంగాణలో ఈ టీవీ సేవలను ప్రారంభించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు.