Tax Saving Strategies: ఇలా కూడా భారీగా టాక్స్ సేవ్ చేయొచ్చు. బెస్ట్ టిప్స్ మీకోసం..
Tax Saving Strategies: ఫైనాన్షియల్ ఇయర్ పూర్తవడానికి ఇంకెన్నో రోజులు లేవు. మీరు కూడా ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఇక్కడున్న టిప్స్ పాటిస్తే మీరు కచ్చితంగా చాలా డబ్బు ఆదా చేయొచ్చు. అవేంటో చూద్దాం రండి.

ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొన్ని రోజులే మిగిలాయి. సాధారణంగా ఈ టైమ్ లో అందరూ 80C మినహాయింపులను ఉపయోగిస్తారు. దీనితో పాటు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు మార్చి 31 లోపు చెల్లించాలని గుర్తుంచుకోండి. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే టాక్స్ లు తగ్గుతాయో ఇక్కడ తెలుసుకోండి.
సెక్షన్ 80C ప్రయోజనాలు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ఉపయోగించి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, జీవిత బీమా ప్రీమియంలు, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా టాక్స్ ఆదా చేసుకోవచ్చు.
ELSS ఫండ్స్‌లో పెట్టుబడి
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS) లో మీ పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద టాక్స్ ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టినా మినహాయింపు లభిస్తుంది.
మెడికల్ ఇన్సూరెన్స్
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై కూడా టాక్స్ ఆదా చేసుకోవచ్చు. మీకు, మీ భార్య, పిల్లలకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.25,000 వరకు ఆదా చేయవచ్చు.
60 ఏళ్లలోపు తల్లిదండ్రులకు అదనంగా రూ.25,000, వారు సీనియర్ సిటిజన్స్ అయితే రూ.50,000 వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. కానీ ప్రీమియంలను మార్చి 31 లోపు చెల్లించాలని గుర్తుపెట్టుకోండి.
NPS లో పెట్టుబడి
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా సెక్షన్ 80C కింద టాక్స్ ప్రయోజనాలు పొందవచ్చు. సెక్షన్ 80CCD(1B) కింద రూ.50,000 అదనపు మినహాయింపు లభిస్తుంది. మీ యజమాని NPS కి డబ్బు చెల్లిస్తే, సెక్షన్ 80CCD(2) కింద టాక్స్ ప్రయోజనాలు పొందవచ్చు.
హోమ్ లోన్ మినహాయింపులు
మీరు హోమ్ లోన్ తీసుకుంటే మీరు తీసుకున్న అసలు తిరిగి చెల్లించడంపై సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 24(b) కింద వడ్డీ చెల్లించడంపైనా కన్సెషన్ పొందవచ్చు. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు సెక్షన్ 80EE కింద అదనంగా రూ.50,000 టాక్స్ తగ్గింపు పొందవచ్చు.
HRA, అద్దె చెల్లింపులపై...
అద్దె ఇంట్లో ఉంటూ హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) తీసుకుంటే సెక్షన్ 10(13A) కింద మీకు టాక్స్ మినహాయింపు లభిస్తుంది. HRA లేకపోయినా అద్దె చెల్లిస్తే, సెక్షన్ 80GG కింద సంవత్సరానికి రూ.60,000 వరకు మినహాయింపు పొందవచ్చు.
డొనేషన్స్
ఇవి కాకుండా మీరు ఇచ్చే డొనేషన్స్ కి కూడా టాక్స్ మినహాయింపులు పొందవచ్చు. కానీ ఆ డబ్బు బ్యాంకు ద్వారా చెల్లించి ఉండాలి. రసీదు కూడా తీసుకోవాలి.