- Home
- Business
- Gold Loan: బ్యాంకులో బంగారం లోన్ తీసుకుంటున్నారా? ఈ ముందస్తు జాగ్రత్తలు, విషయాలు దృష్టిలో పెట్టుకోండి
Gold Loan: బ్యాంకులో బంగారం లోన్ తీసుకుంటున్నారా? ఈ ముందస్తు జాగ్రత్తలు, విషయాలు దృష్టిలో పెట్టుకోండి
బంగారం ధర పెరిగినప్పటి నుంచి బంగారం పెట్టి లోన్ (Gold Loan)తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. అలాగని ఎక్కడ పెడితే అక్కడ బంగారం లోను తీసుకోకూడదు. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందస్తు విషయాలు కొన్ని తెలుసుకోవాలి.

బంగారు రుణాలు పెరిగిపోయాయి
గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. రిజర్వ్ బ్యాంక్ డేటా చెబుతున్న ప్రకారం బంగారు రుణాలు కేవలం గత ఐదు నెలల్లోనే 97,079 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఐదు నెలల్లోనే 117.8 శాతం పెరుగుదల కనిపించింది. బంగారు లోన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆర్బీఐ నివేదిక చెప్పేదిదే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం గత ఏడాది ఆగస్టులో బంగారు రుణాలు మొత్తం 1,40,393 కోట్ల రూపాయలు కాగా... ఈ ఏడాది ఆగస్టులో 3,05,814 కోట్ల రూపాయలకు చేరింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే వంద శాతానికి పైగా పెరిగినట్టు. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, విద్య రుణాలతో పోలిస్తే బంగారు రుణాలే అత్యధికంగా పెరిగాయి. ప్రజలు బంగారు ఆభరణాలను తనఖా పెట్టి ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఈ నివేదిక చెబుతోంది.
బంగారు రుణంతో జాగ్రత్త
బంగారు రుణం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ బ్యాంకు పడితే ఆ బ్యాంకులో తీసుకోకూడదు. పేరు ఉన్న బ్యాంకు శాఖ నుండి మాత్రమే బంగారు ఆభరణాలపై రుణం తీసుకోవడం ఉత్తమం. రుణం తీసుకునేటప్పుడు మీరు ఏ బంగారు ఆభరణాలను తాకట్టు పెడుతున్నారో ఆ ఆభరణాలన్నింటినీ ఒకచోట పెట్టి ఫోటోను తీసి భద్రంగా ఉంచుకోండి. బ్యాంకు మీ బంగారానికి బీమా రక్షణను అందిస్తే దానిని తప్పకుండా తీసుకోండి. బ్యాంకులోదోపిడీలు జరిగినప్పుడు ఈ బీమా రక్షణ మీకు ఉపయోగపడుతుంది.
ఇతర రుణాలు
బంగారు రుణాలలో ఏకంగా 100 శాతానికి పైగా వృద్ధి కనబడింది. ఇక మిగతా రుణాల విషయానికి వస్తే వ్యక్తిగత రుణం తీసుకునే వారి సంఖ్య 12 శాతానికి పెరిగింది. ఇక గృహ రుణం తీసుకునే వారిది 9.7 శాతం పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక విద్య కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య 14.6 శాతం, కారు కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య 8.7 శాతం పెరిగినట్టు నివేదిక వివరిస్తోంది.