Petrol Price: ట్రంప్ వల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయా?
Petrol Price: రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్ భారత్ పై తీవ్ర కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని సుంకాల రూపంలో చూపిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేయాలని ఇప్పటికే ఎంతో ఒత్తిడి తెస్తున్నారు.

అమెరికా వార్నింగ్
అమెరికాకు, రష్యాకు మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేలా ఉంది. ట్రంప్ నేరుగా రష్యా పై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఆ సమయంలోనే మనం రష్యా నుంచి కొనుగోలు చేయడం ఆయనకు ఏమాత్రం నచ్చడం లేదు. ఆ చమరు కొనుగోలుతో వచ్చే డబ్బుతోనే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోందన్నది అమెరికా అధ్యక్షుడి అభిప్రాయం. అందుకే భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాడు. కానీ మోడీ మాత్రం ఆ ఒత్తిడికి తగ్గకుండా చమురు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అమెరికా చేసిన పని వల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వెనక్కి వెళ్లిపోయిన చమురు ట్యాంకర్లు
తాజాగా రష్యా నుండి వస్తున్న చమురు ట్యాంకర్లు గుజరాత్ తీరానికి రాకముందే అకస్మాత్తుగా తమ మార్గాన్ని మార్చుకొని వెనక్కి వెళ్ళిపోయాయి. దీంతో రష్యన్ చమరు కంపెనీలపై అమెరికా ఆంక్షలు తీవ్రంగా పెరిగిపోవడం వల్లే ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని బ్లూమ్ బర్గ్ నివేదిక చెబుతోంది. దీంతో భారత దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. అయితే భారతదేశ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రం అమెరికా ఆంక్షలకు కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
చమురు కొనడం ఆపేశామా?
ఇప్పటికే రిలయన్స్ రిఫైనరీ, HPCL వంటివి రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేసాయి. అమెరికా ఆంక్షలకు భయపడి అవి చమురు కొనుగోలు నిలిపివేసినట్టు చెప్పాయి. రష్యా నుండి కొనకపోతే మన దేశానికి సరిపడా చమురు సరఫరా చేసే దేశం మరొకటి లేదు. దీంతో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021 నుండి 2024 వరకు చూసుకుంటే భారతదేశం.. రష్యా నుండి చమురు కొనుగోళ్లు దాదాపు 19 రెట్లు పెరిగింది. ప్రతిరోజు రష్యా నుండి మనం 1.9 మిలియన్ బ్యారెల్లా చమురును కొనుగోలు చేస్తాము. ఇప్పుడు రష్యా నుంచి చమరును వదిలేస్తే ఆర్థిక నష్టాలను కూడా చూడాల్సి వస్తుంది.
ఇలా అయితే పెట్రోల్ ధర పెంపు?
ప్రస్తుతానికి మన దేశంలో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాపై ఆంక్షలు కొనసాగుతూ ఉండటం వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాత్రం అంచనా వేయలేము. సరఫరాలో కొరత ఏర్పడినా, ముడిచమురు ధరలు పెంచినా పెట్రోల్ డీజిల్ ధరలు మనదేశంలో పెరగవచ్చు. ఇదే ఆంక్షలు కొనసాగితే రాబోయే రోజుల్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఎప్పుడైతే రష్యా చమురును మనం వదులుకుంటామో.. అప్పుడు ఇతర దేశాల నుండి ఖరీదైన చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు సాధారణంగానే ధరలను పెంచాల్సి రావచ్చు.