- Home
- Andhra Pradesh
- తమ్ముడికి మద్దతు, ‘‘చిరు’’ వ్యాఖ్యల దుమారం.. రూట్ మార్చిన వైసీపీ, మూకుమ్మడి దాడి.. జనసైనికుల కౌంటర్స్..
తమ్ముడికి మద్దతు, ‘‘చిరు’’ వ్యాఖ్యల దుమారం.. రూట్ మార్చిన వైసీపీ, మూకుమ్మడి దాడి.. జనసైనికుల కౌంటర్స్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక అంశం హాట్ టాఫిక్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజా మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక అంశం హాట్ టాఫిక్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజా మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. చిరంజీవిపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఇన్నాళ్లూ చిరుపై సాఫ్ట్ కార్నర్‌తో ఉండి.. ఆయనను తెరమీదకు తీసుకొచ్చి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసిన నేతలు సైతం ఇప్పుడు రూట్ మార్చారు.
చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించే విధంగా ఉండటంతో.. వైసీపీ నేతలు ఆయనను టార్గెట్‌గా చేసుకుని మూకుమ్మడిగా విమర్శల దాడికి దిగుతున్నారు. ఇందులో చిరంజీవి సామాజిక వర్గానికే చెందిన కాపు నేతలు సైతం ఉన్నారు. సీఎం జగన్‌ను గానీ, వైసీపీపై విమర్శలు చేసేది ఎవరైనా సరే.. తమ వైఖరి ఇలానే ఉంటుందనే సంకేతాలు పంపుతున్నారు.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల సాయి తేజ్ హీరోగా, పవన్ కల్యాణ్ ముఖ్య పాత్రలో నటించిన బ్రో చిత్రంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్ర ద్వారా తనను అవమానించారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆ చిత్రం డిజాస్టర్ అంటూ కూడా సర్టిఫికేట్ ఇచ్చేశారు. అంతేకాకుండా ఆ చిత్రం నిర్మాత ద్వారా పవన్‌కు టీడీపీ ప్యాకేజ్ అందించిందని ఆరోపణలు చేయడమే కాకుండా.. సినిమా కలెక్షన్లు కూడా చెప్పేశారు. పవన్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.
అయితే అంబటి రాంబాబు వ్యాఖ్యలపై చిరంజీవి పరోక్షంగా స్పందించారు. వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఎంతసేపు చిత్ర పరిశ్రమ గురించి కాదని.. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు గురించి, పేదవారికి కడుపు నిండే పథకాలు, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?’’ అని వైసీపీ ప్రభుత్వానికి చిరంజీవి సుత్తిమెత్తగా చురకలు అంటించారు. దీంతో చిరంజీవి.. పవన్‌కు సపోర్టుగా నిలిచినట్టు అయింది.
ఈ క్రమంలోనే చిరంజీవిపై మూకుమ్మడిగా దాడి చేసేందుకు వైసీపీ నేతలు గళం విప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ..‘‘నేను వ్యక్తిగతంగా చిరంజీవికి అబిమానిని. కాలేజీ రోజుల్లో నేను సినిమా థియేటర్ల దగ్గర బిల్ బోర్డులు, పోస్టర్లు అతికించేవాడిని. కానీ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు. సినిమా, రాజకీయాలను కలపవద్దు. రెండూ వేర్వేరు రంగాలు. చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, మహేష్ బాబు, చిరంజీవి మేనల్లుళ్లతో సహా సినీ తారలపై రాజకీయ నాయకులు గానీ, రాజకీయ పార్టీలు గానీ ఎవరూ వ్యాఖ్యలు చేయలేదు’’ అని అన్నారు.
‘‘కానీ అంబటి రాంబాబుపై ప్రతీకారంతో ఓ పాత్రను రూపొందించారు. ఒక ఫెస్టివల్‌లో అతని డ్యాన్స్‌కి వెక్కిరించారు. అంబటి రాంబాబుపై కక్ష సాధింపు కోసం పాత్ర సృష్టించినప్పుడు ఇలాంటివి తప్పదు. మనం మరొకరిని గిల్లినప్పుడు, గిల్లించుకోవాలి కూడా’’ అని పేర్ని నాని అన్నారు.
మరో మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడిగాళ్లకి కూడా చెబితే బాగుంటుందని అన్నారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడిగాళ్లు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో పకోడిగాళ్ల సలహాలు తన వాళ్లకు ఇచ్చుకుంటే మంచిది అని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు బదులు.. డ్యాన్స్‌లు, ఫైట్స్, యాక్షన్ గురించి ఆలోచించండని తన పకోడిగాళ్లకు సలహాలు ఇస్తే బాగుంటుందని అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. సినీ పరిశ్రమను పిచ్చుక అని చిరంజీవి ఒప్పుకుంటున్నారా? అంటూ కౌంటరించ్చారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ ప్రభుత్వం తనపని తాను చేసుకుంటోందని పేర్కొన్నారు. ఇక, మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘సినిమాలను రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరో చిరంజీవి చెప్పాలని ప్రశ్నించారు. ముందు తమ్ముడికి చెబితే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి రాంబాబు క్యారెక్టర్ సృష్టించింది ఎవరు’’ అని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఆ పాత్ర రాంబాబుదేనని చెప్పే ధైర్యం కూడా లేదని అన్నారు.
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అన్నయ్యగారు అంటూ సెటైర్లు వేశారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారో లేదో చిరంజీవి చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు. చిరంజీవి ఏం మాట్లాడారో చూసిన తర్వాత మాట్లాడతానని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఇలా పలువురు వైసీపీ నేతలు.. చిరంజీవిపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు కూడా చిరంజీవికి మద్దతుగా నిలుస్తున్నారు. వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రోడ్లను బాగు చేయాలని, గతంలో చెప్పినట్టుగా ప్రత్యేక హోదా సాధించాలని వైసీపీపై కౌంటర్ అటాక్‌కు దిగుతున్నారు. పోలవరంపై పలు సందర్భాల్లో జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇక, టీడీపీలోని పలువురు కాపు నేతలు చిరంజీవికి మద్దతుగా నిలుస్తూ.. వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.