తెలుగు రాష్ట్రాల్లో పదేపదే భూకంపాలు ఎందుకు వస్తున్నాయి
ప్రకాాశం జిల్లాలో ఇవాళ భూకంపం సంభవించింది. ఈ నెల ఆరంభంలోనే తెెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో పదేపదే భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి.
Earthquake in Andhra Pradesh
Earthquake in Andhra Pradesh :తెలుగు ప్రజలను భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆంధ్ర ప్రదేశ్ లో భూమి కంపించింది. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం చోటుచేసుకుంది... కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు ప్రాణభయంతో పరుగు తీసారు.
ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తాళ్లూరు,గంగవరం, రామభద్రపురం, శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు,వేంపాడు,మారెళ్ల, తూర్పు కంభంపాడు గ్రామాల్లో భూమి కంపించింది. అయితే భూకంప తీవ్రత తక్కువగా వుండటంతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించలేదు.
అయితే ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గతంలో ఎప్పుడూ ఎదురుకాని విపత్తు ఇప్పుడు సంభవించడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల(డిసెంబర్ 2024)లో ఇలా భూమి కంపించడం రెండోసారి. ఇటీవల తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో భూకంపం చోటుచేసుకుంది... ఇది మరిచిపోకముందే మళ్ళీ ఇప్పుడు మరోసారి భూమి కంపించింది. ఇలా వరుస భూకంపాలు తెలుగు ప్రజలను ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులతో సతమతం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు భూకంప భయం పట్టుకుంది. ఈ క్రమంలో అసలు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించే ప్రమాదం ఏమేరకు వుంది? ఇప్పుడు ఒక్కసారిగా ఇలా భూమి ఎందుకు కంపిస్తోంది? భూకంప సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తదితర విషయాలు తెలుసుకుందాం.
Earthquake in Andhra Pradesh
తెలుగు రాష్ట్రాలకు భూకంపాల ముప్పు వుందా?
భారతదేశంలో భూకంప ప్రమాదం పొంచివున్న ప్రాంతాల ఢాటాను కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. భూకంప తీవ్రతను బట్టి నాలుగు జోన్లను విభజించారు. భూకంపాలు ఎక్కువ తీవ్రతతో సంభవించే ప్రాంతాలను జోన్ 5 లో, తక్కువ తీవ్రత గల భూకంపాలు సంభవించే ప్రాంతాలను జోన్ 2 లో చేర్చారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈమేరకు జోన్ల విభజన చేపట్టింది.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7 కంటే ఎక్కువుంటే అది విధ్వంసం సృష్టిస్తుంది. ఇలా భారీ ప్రాణ, ఆస్తినష్టం సృష్టించే భూకంపాలు భారత్ లో అతి తక్కువగా సంభవిస్తాయి. దేశంలోని కేవలం 11 శాతం భూభాగంలోనే ఇలాంటి భూకంపాలు సంభవించే ప్రమాదం వుంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోనే ఇలాంటి భూకంపాల ప్రమాదం ఎక్కువగా పొంచివుందని చెబుతున్నారు.
ఇక జోన్ 4 లోని ప్రాంతాల్లో 6-7 తీవ్రతతో, జోన్ 3 లోని ప్రాంతాల్లో 5-6 తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి. ఇక జోన్ 2 లో అతి తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించే ప్రాంతాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు ఈ జోన్ 3, 2 లోనే వున్నాయి. విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు వంటి పట్టణాలు జోన్ 3 లో వుండగా తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీలోని కర్నూల్ జోన్ 2 లో వుంది.
ఈ డేటా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించిన తీవ్రత అంత ఎక్కువగా వుండదని అర్థమవుతోంది. కాబట్టి తాజాగా సంభవిస్తున్న భూకంపాలను చూసి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ భూకంపాలు సంభవించిన సమయంలో జాగ్రత్తగా వుండటం చాలా ముఖ్యం.
Earthquake in Andhra Pradesh
ఏపీలో భూకంప ప్రమాదం పొంచివున్న జిల్లాలు ఈ రెండేనట :
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించిన నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ ఆసక్తికర విషయాలు బైటపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ కు భూకంప ప్రమాదం చాలా తక్కువని అన్నారు. అప్పుడప్పుడు భూమి కంపించినా తీవ్రత చాలా తక్కువగా వుంటుందన్నారు. ఇలా ఏపీ సేఫ్ జోన్ లో వుందంటూనే రెండు జిల్లాలకు మాత్రం భూకంపాల ప్రభావం ఎక్కువగా వుంటుందని హెచ్చరించారు.
ఇలా విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ఏ జిల్లాలకు అయితే భూకంప ప్రమాదం వుందని చెప్పారో ఇప్పుడు అదే జిల్లాలో భూకంపం సంభవించింది. ప్రకాశం తో పాటు పల్నాడు జిల్లాల్లో భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా వుంటాయని కూర్మనాథ్ చెప్పారు... ఇప్పుడు ప్రకాశం జిల్లాలో భూకంపం సంభవించింది.
భూకంపాలకు కారణం :
కేవలం ఈ నెల (డిసెంబర్) లోనే తెలుగు రాష్ట్రాల్లో రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. ఇలా పదేపదే భూమి కంపించడంతో తెలుగు ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే ఈ భూకంపాలకు ప్రకృతి పరమైన కారణాలు ఎంతుంటాయో మానవ తప్పిదాలు కూడా అదేస్థాయిలో వుంటున్నాయి.
భూమిలోని పొరలు సర్దుబాటు కారణంగా సాధారణంగా భూకంపాలు సంభవిస్తాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ప్రకృతి వినాశనం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇది మానవ తప్పిదం. మైనింగ్ పేరిట భూమిని ఇష్టారితీగా తవ్వడం, బోర్లను విచ్చలవిడిగా వేసి భూగర్భ జలాలను తోడేయడం, చెట్లు నరకడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం... ఇలా అనేక విషయాలు భూకంపాలకు కారణం అవుతున్నాయి.
ఇప్పటికే అనేక ప్రకృతి విపత్తులు మానవాళిని భయపెడుతున్నాయి. ఇప్పుడు మానవ తప్పిదాలు మరో ప్రకృతి విపత్తుకు కారణం అవుతోంది. కాబట్టి భూకంప ప్రమాదం నుండి బయటపడాలంటే ప్రకృతి నాశనాన్ని ఆపాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భూకంప సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు :
ఒక్కసారిగా కాళ్లకింది భూమి కంపించగానే ఏం చేయాలో చాలామందికి అర్థంకాదు. ప్రాణభయంతో పరుగు తీస్తుంటారు. ఇలా కంగారుపడిపోయి ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకోవడం కంటే తెలివిగా ఆలోచించి సురక్షితంగా వుండవచ్చు. ఇలా భూకంప సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
1. భూకంప సమయంలో ఇంట్లో వుండటమే మంచింది. ఎందుకంటే బయటకు వెళితే విద్యుత్ స్తంభాలు కూలి కరెంట్ షాక్, వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు, పెద్దపెద్ద హోర్డింగ్ వంటి భారీ వస్తువులు మీదపడటం జరుగుతుంది. అలాకాకుండా ఇంట్లోనే వుండి గట్టి మచం లేదా టేబుల్ కిందకు దూరిపోవాలి. ఇలా చేయడంవల్ల ఒకవేళ ఇల్లు కూలినా శిథిలాలు మీద పడకుండా వుంటాయి. సహాయం అందేవరకు అక్కడే వుండవచ్చు.
2. భూకంపం సంభవించిన సమయంలో బయట వున్నవారు దగ్గర్లో ఏదయినా మైదాన ప్రాంతం వుంటే అక్కడికి వెళ్లాలి. పెద్దపెద్ద భవనాలు, చెట్లకు దూరంగా వుండాలి.
3. భూకంప సమయంలో డ్రైవింగ్ లో వుంటే తమ వాహనాన్ని రోడ్డుపక్కన సురక్షిత ప్రాంతంలో ఆపుకోవాలి. కరెంట్ స్తంభాలు, హోర్డింగ్ లు, తాత్కాలిక నిర్మాణాలకు దూరంగా వుండాలి.
4.అపార్ట్ మెంట్స్, పెద్దపెద్ద భవంతుల్లో వున్నవారు భూకంప సమయంలో కంగారుపడి బయటకు పరుగు తీయవద్దు. ముఖ్యంగా లిప్ట్ ఎక్కడం అస్సలు చేయకూడదు. తమ ప్లాట్ లోనే సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలి.
5. భూకంపాల సమయంలో పొలాల వద్ద వుండే రైతులు చైట్లకు దూరంగా వుండాలి. మైదాన ప్రాంతంలో వుండటమే సురక్షితం. భూకంపం ఆగిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు అక్కడే వుండాలి. ఎందుకంటే భూమి కంపించడం వల్ల బలహీనపడ్డ చెట్లు ఆ తర్వాత విరిగిపడే ప్రమాదం వుంటుంది.