పవన్ కల్యాణ్... 2024 లో గూగుల్ టాప్ లేపిన పేరిది, మరో నలుగురు కూడా...
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ టాప్ లోనే వున్నారు. 2024 సంవత్సరం ఆయనను గూగుల్ లోనూ టాప్ లో నిలిపింది. అత్యధిక మంది గూగుల్ లో సెర్చ్ చేసిన పేర్లలో పవన్ కల్యాణ్ ది ఐదోస్థానం... మరి మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నదెవరో తెలుసా?
Pawan Kalyan
Pawan Kalyan : ఎవరీ పవన్ కల్యాణ్? లోక్ సభ ఎన్నికల తర్వాత యావత్ దేశం గూగుల్ ని అడిగిన ప్రశ్న ఇదే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేత శభాష్ అనిపించుకున్నారు పవన్... అందుకేనేమో ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నారు. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులకు సాధ్యంకాని 100% స్ట్రైక్ రేట్ సాధించారు పవన్... అందుకేనా ఆయనగురించి వెతికారు. తన సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు కదిలారు పవన్... మరి అందుకోసమేమో. నటుడిగా అందనంత ఎత్తుకు ఎదిగిన ఆయన డిప్యూటీ సీఎంగా, మంత్రిగానూ ప్రజలకు దగ్గరయ్యారు... మరి అందుకోసమా?
కారణం ఏదయినా ఈ ఏడాది గూగుల్ లో అత్యధికంగా వెతికింది పవన్ కల్యాణ్ గురించే. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా గూగుల్ చెబుతోంది. 2024 లో భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన విషయాలు, వ్యక్తుల టాప్ 5 లిస్టులు గూగుల్ బైటపెట్టింది. ఇలా అత్యధికంగా సెర్చ్ చేసిన పేర్లలో పవన్ కల్యాణ్ టాప్ 5 లో వుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి హేమాహేమీలను కాదని పవన్ కల్యాణ్ గురించి తెలుసుకునేందుకు యావత్ దేశం ప్రయత్నించింది.
దేశంలోని రాజకీయ రాజకీయ నాయకుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే గూగుల్ సెర్చ్ టాప్ 5 లో చోటుదక్కింది. అందులో ఒకరు పవన్ కల్యాణ్. ఇక హీరోల విషయానికి వస్తే కేవలం పవన్ ఒక్కరే టాప్ 5 సెర్చ్ లో నిలిచారు. మొత్తంగా పవన్ క్రేజ్ తెలుగు రాష్ట్రాలను దాటి పాన్ ఇండియా స్థాయికి చేరుకుందని ఈ 2024 గూగుల్ సెర్చ్ జాబితాను బట్టి అర్థమవుతుంది.
vinesh phogat
గూగుల్ సెర్చ్ లో భారతీయులు వెతికిన టాప్ 5 వ్యక్తులు వీరే :
1. వినేష్ పోగట్ : భారత రెజ్లింగ్ క్రీడాకారిణి వినేష్ ఫోగట్ పేరు ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా మారుమోగింది. భారత్ తరపున బరిలోకి దిగిన ఆమె తృటిలో స్వర్ణాన్ని మిస్ అయ్యింది. 50 కిలోల విభాగంలో ఫైనల్ వరకు చేరిన ఆమె కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురయ్యారు.దీంతో స్వర్ణ పతకం అందుకోవాల్సిన ఆమె ఒట్టి చేతులతో ఇండియాకు తిరిగిరావాల్సి వచ్చింది. ఇలా విచిత్రమైన పరిస్థితిలో ఒలింపిక్స్ పతకాన్ని కోల్పోయిన ఆమెగురించి గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసారు.
ఇక ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఇలా ఒకేఏడాది అటు ఒలింపిక్స్, ఇటు హర్యానా అసెంబ్లీ ఎన్నికలు వినేష్ ను బాగా పాపులర్ చేసాయి. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు దేశ ప్రజలు ఆసక్తి చూపించారు.
Nitish Kumar
2. నితీష్ కుమార్ :
బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) పార్టీ అధినేత నితీష్ కుమార్ ఈ ఏడాది దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆయన లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిని వీడి బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమిలో చేరారు. ఈ ఎన్నికల్లో బిజెపికి అధికారాన్ని చేపట్టేందుకు సరిపడా మెజారిటీ రాకపోడంతో బిహార్ కు చెందిన నితీష్ కుమార్, ఏపీకి చెందిన చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు. ఇలా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారిన నితీష్ కుమార్ గురించి గూగుల్ లో అత్యధికంగా వెతికారు.
chirag paswan
3. చిరాగ్ పాశ్వాన్ :
గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసినవారిలో చిరాగ్ పాశ్వాన్ మూడో స్థానంలో వున్నారు. ఆయన లోక్ జన శక్తి పార్టీ వ్యవస్థాపకులు దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు. ప్రస్తుతం ఈ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమికి మద్దతుగా నిలిచాడు. దీంతో ఈయనకు మోదీ కేబినెట్ లో చోటు దక్కింది. అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా ఎదిగినవారిలో చిరాగ్ ఒకరు.
Hardik Pandya
4. హార్దిక్ పాండ్యా :
ఈ ఏడాది హార్దిక్ పాండ్యా ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఐపిఎల్ 2024 లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ ను రోహిత్ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకున్నారు. అత్యధికంగా ట్రోలింగ్ గురయిన ఆటగాడు ఇతడు. అయితే ఇదే హార్దిక్ టీ20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో హీరోగా మారాడు. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే హార్దిక్ భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు.
Pawan Kalyan
5. పవన్ కల్యాణ్ :
ఇక గూగుల్ సెర్చ్ నే ఒక్క విజయంతో షేక్ చేసారు పవన్ కల్యాణ్. పోటీచేసిన అన్ని స్థానాల్లో తన పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే కాదు స్వయంగా తాను పోటీచేసిన పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచారు. ఇటు ఏపీలో కూటమి ప్రభుత్వం, అటు కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు పవన్. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా, వివిధ శాఖల మంత్రిగా ఆయన పనితీరు అద్భుతం. ఇలా ఈ ఏడాదంతా పవన్ వార్తల్లో నిలిచారు. అందుకే యావత్ దేశం ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించివుంటుంది... కాబట్టి గూగుల్ సెర్చ్ లో టాప్ 5 లో చేరారు.