టిడిపితో కలిసిపోయాం... మరి బిజెపితో ఎలా..?... జనసైనికులతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే 2014 లో మాదిరిగా టిడిపితో కలిసి 2024 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి సిద్దమైన పవన్ భవిష్యత్ కార్యాచరణపై జనసేన ముఖ్య నాయకులతో నేడు సమావేశం కానున్నారు.
Chandrababu, pawan kalyan
అమరావతి : ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీల పొత్తుతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో మాదిరిగా టిడిపి ఓట్లను జనసేన చీల్చడం ద్వారా తమకు లాభం చేకూరుతుందని వైసిపి భావిచింది. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాలతో జనసేన చీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా కాకుండా టిడిపితో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసి టిడిపి-జనసేన పొత్తు ప్రకటన కూడా చేసారు.
Pawan Kalyan
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు చాలా తక్కువ సమయం వుండటంతో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. ఎన్నికలే టార్గెట్ గా వారాహి యాత్ర పేరిట ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పుడు పొత్తులో భాగంగా టిడిపి శ్రేణులను కూడా కలుపుకుపోయేలా కార్యక్రమాల రూపకల్పనకు సిద్దమయ్యారు. ఇందుకోసం ఇవాళ(శుక్రవారం) జనసేన ముఖ్య నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతున్నారు.
Pawan Kalyan
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో పవన్ కల్యాణ్ భేటీ అవుతున్నారు. ఇందులో ముఖ్యంగా టిడిపి, జనసేన పార్టీల సమన్వయ కమిటీలపై పవన్ చర్చించనున్నారు. జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ టిడిపి, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్ళేందుకు చూడనుంది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కమిటీకి సహకరించాలని... సంయమనంతో టిడిపిని కలుపుకుపోవాలని పవన్ సూచించారు. ఈ ఇవాళ జరిగే సమావేశంలోనూ ముఖ్య నాయకులకు పవన్ మరోసారి సమన్వయ కమిటీపై చర్చించనున్నారు.
Varahi campaign
ఇక దసరా పండగ తర్వాత వారాహి యాత్రను తిరిగి ప్రారంభించాలని పవన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో రూట్ మ్యాప్, షెడ్యూల్ ఖరారుపై కూడా జనసేన సీనియర్లతో పవన్ చర్చించనున్నారు. వారాహి యాత్రలో టిడిపిని భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్లే అంశంపైనా నాయకులతో పవన్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
Janasena BJP
ఇక జనసేన బిజెపితో కలిసి వెళుతుందా... తెగతెంపులు చేసుకుంటుందా అన్న సందిగ్దత కొనసాగుతోంది. ఇప్పటికయితే ఎన్డిఏలోనే కొనసాగుతున్నట్లు పవన్ ప్రకటించినా ప్రచారం మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిజెపితో కలిసివెళ్లాలో లేదో ముఖ్యనాయకులతో పవన్ చర్చించనున్నారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పవన్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
pawan
మొత్తంగా ఎన్నికల సమయానికి క్లారిటీగా వుండాలని పవన్ భావిస్తున్నారు. అందవల్లే టిడిపి, బిజెపి లతో కలిసుంటే లాభనష్టాలపై జనసేన ముఖ్యనాయకులతో సంప్రదింపులు జరపనున్నారు. అలాగే వైసిపిని ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనా పవన్ కల్యాణ్ ఈ భేటీలో చర్చించనున్నారు.