ఇక టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ... మేనిఫెస్టో, సీట్ల సర్దుపాటుపై కీలక చర్చలు
టిడిపి, జనసేన కలిసే రాబోయే ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఇరుపార్టీల పొత్తుపై క్లారిటీ రావడంతో ఇకపై కలిసే ముందుకు వెళ్లేలా ఉమ్మడి కార్యాచరణ రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది.
Pawan Kalyan
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. చాలాకాలంగా టిడిపి, జనసేన పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్ కు ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ తెరదించారు. రాజమండ్రి సెంట్రలో జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-టిడిపి కలిసి పోటీచేస్తాయని పవన్ ప్రకటించారు.
TDP Janasena
ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్న టిడిపి, జనసేన పార్టీలో త్వరలోనే ఉమ్మడి కార్యాచరణ ప్రకటనకు కసరత్తు చేస్తున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుండి పవన్ వారాహి యాత్ర మళ్ళీ ప్రారంభంకానుంది... ఈ యాత్ర తర్వాత ఇరుపార్టీల జేఏసి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ఇక రెండు పార్టీలు కలిసే ప్రజల్లోకి వెళ్లాలని... ఇందుకోసం ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల ను సమన్వయం చేసుకునే చర్యలు జరుగుతున్నాయి.
TDP Janasena
ఇక ఉమ్మడి మ్యానిఫెస్టో విషయంలోనూ ఇరుపార్టీలు కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. పొత్తులో కీలకమైన సీట్ల సర్దుపాటుపై కూడా చర్చించేందుకు త్వరలోనే జనసేన, టిడిపి సమావేశం కానున్నాయి. ఇలా ఇకపై కలిసే ముందుకు వెళ్లేందుకు ఇరుపార్టీలు సిద్దమవుతున్నాయి.
nara lokesh yuvagalam
ఇప్పటికయితే టిడిపి, జనసేన పార్టీలు వేరువేరుగానే ప్రజల్లోకి వెళుతున్నాయి. తండ్రి చంద్రబాబు అరెస్ట్ తో వాయిదాపడ్డ యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ నెల 29(శుక్రవారం) రాత్రి యువగళం పాదయాత్రను రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి లోకేష్ ప్రారంభించనున్నట్లు టిడిపి ప్రకటించింది.
pawan kalyan
ఇక పవన్ కల్యాణ్ కూడా మళ్లీ వారాహి యాత్రకు సిద్దమయ్యారు. అక్టోబర్ 1 నుండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ యాత్ర సాగనుంది. అవనిగడ్డలో నాలుగో విడత వారాహి విజయ యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. అవనిగడ్డలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Pawan Kalyan
అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయి ప్రస్తుత రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్నారు. ఇలాంటి సమయంలో లోకేష్ యువగళం పాదయాత్ర, పవన్ వారాహి యాత్రకు అనుమతులు దక్కడం అనుమానమే. శాంతి భద్రతల సాకుతో పోలీసులు ఈ యాత్రలను అడ్డుకునే అవకాశాలున్నాయని ఆయా పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏదైమైనా లోకేష్ పాదయాత్ర, పవన్ వారాహి యాత్ర కొనసాగుతుందని టిడిపి, జనసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు.