వరద సాయం అందలేదా? పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ నంబర్లకు కాల్ చేయండి
ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తాను వస్తే ఇబ్బందులు కలుగుతాయనే రాలేదన్నారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. వరద సాయం అందని ప్రజల కోసం టోల్ ఫ్రీ నంబర్లు ప్రకటించారు.
విపత్తు సమయంలో నిందలు వేయడం కంటే ప్రజల ప్రాణాలు కాపాడడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఇలాంటి విపత్తు సంభవించడం దురదృష్టకరమన్నారు. భారీ వర్షాలు, ఎగువన ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితోనే ఏపీలో విపరీతమైన నష్టం వాటిల్లిందన్నారు.
ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందనీ... ఎప్పుడూ రానంత వరద ఇదీ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. వరదలు తగ్గుముఖం పట్టిన తరవాత రాష్ట్రంలోని ప్రతి నగరానికీ పకడ్బందీగా ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బుడమేరు నిర్వహణ పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే విజయవాడకు ఇంతటి ముప్పు సంభవించిందన్నారు.
Deputy CM Pawan Kalyan Review on Rains in AP
తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్న స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈ సమీక్షలో పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ, విపత్తుల నిర్వహణ విభాగం డైరెక్టర్ కూర్మనాథ్ పరిస్థితిని వివరించారు.
Deputy CM Pawan Kalyan
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... “ప్రకాశం బ్యారేజ్ కు వస్తున్న వరద చూసి వర్షం కాలంలో వచ్చే సహజ వరదే అనుకున్నాం. కానీ ఎవరూ ఊహించని విధంగా రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. గత 50 ఏళ్లలో ఎప్పుడు ఇంత వరద వచ్చిన దాఖలాలు లేవు. విజయవాడ ప్రాంతానికి ఇంత నష్టం జరగడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు మరమత్తులు కూడా చేపట్టలేదు. బుడమేరు నిర్వహణ సక్రమంగా చేసి ఉంటే విజయవాడ ప్రాంతానికి ఇంత నష్టం వాటిల్లేది కాదు. వరద ప్రభావం తగ్గగానే భవిష్యత్తులో ఇలాంటి విపత్తు సంభవించకుండా ఫ్లడ్ కెనాల్స్ ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు.
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు...
‘‘వరద బాధితుల సహాయ చర్యల్లో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అధికారులు నిద్రాహారాలు మానుకొని పనిచేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి అయినా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నేను పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షిస్తూనే ఉన్నాను. వరద బాధితులకు సహాయం అందించడానికి పంచాయతీ రాజ్ శాఖ నుంచి 262 బృందాలను వరద ప్రభావం లేని ప్రాంతాలనుంచి బాధిత ప్రాంతాలకు తరలించాము. 193 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 42,707 మందిని తరలించాం. ముందస్తు చర్యలు, నిరంతర పర్యవేక్షణ చేసినా 20 మంది చనిపోవడం బాధాకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరో ఇద్దరు వరద నీటిలో కొట్టుకుపోయారని అధికారులు చెబుతున్నారు’’ అని పవన్ కళ్యాణ్ వివరించారు.
Pawan Kalyan announced 1 crore flood aid to AP
ఆరున్నర లక్షల మందిపై ప్రభావం
కాగా, ఏపీలో వరదల కారణంగా 1.72 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దాదాపు 6.44 లక్షల మందిపై వరదలు ప్రభావం చూపించాయి. ఐదు హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ప్రాణనష్టం జరగకుండా 180 బోట్లు, 282 గజ ఈతగాళ్లు పనిచేస్తున్నారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారానికి 5 లక్షల క్యూసెక్కులకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
రూ.కోటి విరాళం..
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం హితవు కోరుకునే ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తమవంతు సాయం అందించాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం మరింత పెరగకుండా అందరం కలిసి పని చేద్దామన్నారు. ‘‘కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మీవంతు సహాయం అవసరం... ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతుగా రూ.కోటి విరాళం అందిస్తున్నాను. ముఖ్యమంత్రికి విరాళం అందజేస్తాను. నేను వరద ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నాను. కానీ, వరద సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఉండకూడదు. అక్కడకు వెళ్ళి అధికారులకు, సహాయక బృందాలకు అదనపు భారం కాకూడదు. ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ ఉన్నాను. ప్రజలు సహాయం కోసం 112, 1070, 18004250101 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.