పార్టీపై పట్టుజారకుండా చంద్రబాబు వ్యూహాలు... ఇక ఫుల్ టైమ్ ప్రజల్లోనే నారా భువనేశ్వరి
భర్త చంద్రబాబు జైలుకు వెళ్లడం... కొడుకు లోకేష్ ను కూడా ఏ క్షణమైన అరెస్ట్ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో నారా భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాలకు సిద్దమయ్యారు.
TDP
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో స్పీడ్ పెంచాలని టిడిపి భావిస్తోంది. ఓవైపు అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై పోరాడుతూనే మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు టిడిపి సిద్దమమవుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు అనేక కేసుల్లో చంద్రబాబును కావాలని ఇరికించారని... ఆయన రాష్ట్రాన్ని అభివృద్ది చేసాడే తప్ప అవినీతి చేయలేదని ప్రజలకు వివరించాలని టిడిపి చూస్తోంది. వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేయించాడని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రజల్లోకి ఎలా వెళ్లాలనేదానిపై పార్టీ నాయకులతో చర్చించేందుకు ఈ నెల 21న టిడిపి సమావేశం కానుంది.
Nara Lokesh
నారా లోకేష్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరగనుందని టిడిపి ప్రకటించింది. చంద్రబాబు అరెస్ట్, అనంతరం జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే జనసేన పార్టీతో పొత్తు, ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా చర్చించనున్నారు. ఇలా రానున్న 6నెలల్లో ప్రజల్లోనే ఉండాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని టిడిపి భావిస్తోంది. దీనిపైనా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
Nara Bhuvaneshwari
ఇక ఇప్పటికే భర్త చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తరచూ కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మనితో పాటు టిడిపి సీనియర్లతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లోని చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నారు భువనేశ్వరి. ఇలా తన భార్యను రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు చంద్రబాబు. దీంతో భువనేశ్వరి రాజమండ్రిలోనే వుంటూ టిడిపి సీనియర్లతో చంద్రబాబు కేసుల విషయమే కాదు రాజకీయ వ్యవహారాలపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇలా ఇప్పటికే పార్టీపై కొంత పట్టు సాధించిన భువనేశ్వరి ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.
Nara Bhuvaneshwari
చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాల కారణంగా మనస్తాపంతో చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్దమయ్యారు. ప్రతి వారం రెండుమూడు రోజులు మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. 'నిజం గెలవాలి' పేరిట ఈనెల 24 నుండి ఆమె పరామర్శ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇలా భువనేశ్వరి పర్యటనకు సంబంధించిన అంశాలపైనా లోకేష్ నేతృత్వంలో జరుగుతున్న విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు.
Nara Lokesh
ఇదిలావుంటే ఇదే 24వ తేదీన అంటే దసరా పండగ రోజు నారా లోకేష్ కూడా ప్రజల్లోకి వెళ్లడానికి సిద్దమవుతున్నాడు. తండ్రి అరెస్ట్ తో ఆగిపోయిన 'భవిష్యత్ పై బాబు భరోసా' కార్యక్రమాన్ని లోకేష్ కొనసాగించాలని చూస్తున్నాడు. వైసిపి ప్రభుత్వ పాలన, ప్రతిపక్ష నాయకులపై సీఎం జగన్ కక్షసాధింపు గురించి ప్రజలకు వివరించేందుకు లోకేష్ సిద్దమయ్యాడు. దీంతో లోకేష్ పర్యటనపైనా టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో చర్చ జరగనుంది.
bhuvaneshwari
ఇలా టిడిపి భవిష్యత్ కార్యాచరణపై విస్తృతస్థాయి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు జైలునుండి విడుదలయ్యే వరకు భువనేశ్వరి, లోకేష్ తో పాటు పార్టీ శ్రేణులంతా ప్రజల్లోనే వుండేలా కార్యాచరణ రూపొందించనున్నారు.