అమరావతి రైల్వేలైన్ అభివృద్ధి పనులకు నిధులివ్వాలి: ఎంపీ బాలశౌరి
అమరావతి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన ₹9,151 కోట్ల నిధులపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి రైల్వే లైనుకు, మచిలీపట్నం-రేపల్లె లైనుకు అదనపు నిధులు అవసరమని తెలిపారు.
MP Balashowry
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చి రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ధన్యవాదాలు తెలిపారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఇస్తున్న నిధులపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.
9,151 crores for railway projects
ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి చెందిన రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.9,151 కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి చొరవను ఎంపీ బాలశౌరి అభినందించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి శాశ్వత రాజధాని లేకుండా పోయిందని, అమరావతిని రాజధానిగా నిర్మించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి రైల్వే పనుల నిమిత్తం అధిక నిధులు కావాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఇటీవల ప్రతిపాదించిన మచిలీపట్నం – నర్సాపురం రైల్వే లైను మంజూరు చేయడం అభినందనీయమని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.
Machilipatnam- Repalle railway line should be established
మచిలీపట్నం – రేపల్లె లైను ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని, ఈ లైను ఏర్పాటు చేస్తే దివిసీమ ప్రజల కష్టాలు తొలుగుతాయని ఎంపీ బాలశౌరి తెలిపారు. అదేవిధంగా ఇప్పుడున్న రైల్వే లైను ప్రకారం మచిలీపట్నం నుంచి వయా గుడివాడ, విజయవాడ, తెనాలి చేరుకోవాలంటే సుమారు 145 కిలో మీటర్లు ప్రయాణించాలన్నారు. అదే మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైను ఏర్పాటు చేస్తే కేవలం 45 కిలో మీటర్ల దూరంలో తెనాలి చేరుకుని.. అక్కడి నుంచి చెన్నై, తిరుపతి, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులువుగా ఉంటుందని ఎంపీ తెలిపారు. సుమారు 100 కిలో మీటర్లు దూరం తగ్గటంతో పాటు విజయవాడ జంక్షన్ మీద ట్రాఫిక్ భారం పడకుండా ఉంటుందని వివరించారు. దీంతో పాటు గత ఏడాది సెప్టెంబర్‌లో నిలిపివేసిన మచిలీపట్నం - ధర్మవరం వయా తిరుపతి రైలును పునరుద్ధరించాలని ఎంపీ బాలశౌరి కోరారు. ఈ రైలును ఏర్పాటు చేస్తే మచిలీపట్నం ప్రాంత భక్తులు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనుకునే కోరిక తీరుతుందన్నారు.
Those trains should be stopped
మచిలీపట్నం ప్రాంతంలోని వడ్లమన్నాడు గ్రామం దాదాపు 20 గ్రామాలకు మధ్యగా ఉంటుందని ఎంపీ బాలశౌరి పార్లమెంటు తెలిపారు. ఈ రైల్వే స్టేస్షన్‌లో గతంలో ఆగే రైళ్లను ఇటీవల కాలంలో ఇక్కడ హాల్ట్ ఎత్తివేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని రైల్వే మంత్రికి వివరించారు. అలాగే, 12749/12750 - మచిలీపట్నం - బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 17219/17220 - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, 07866 - మచిలీపట్నం – విజయవాడ ప్యాసెంజర్, 07822 - మచిలీపట్నం – గుడివాడ పాసెంజర్ రైళ్లను వడ్లమన్నాడు స్టేషన్‌లో ఆపాలని కోరారు.