అక్టోబర్ 1 నుండి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర: ఆ నేతలకు పవన్ కౌంటరిస్తారా?
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నాలుగో విడత అక్టోబర్ 1వ తేదీ నుండి ప్రారంభం కానుంది.
Varahi campaign
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అక్టోబర్ 1వ తేదీ నుండి నాలుగో విడత వారాహి యాత్రను ఆవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రారంభం కానుంది.టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత సాగనున్న ఈ యాత్రపై అందరి దృష్టి నెలకొంది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర సాగనుంది. చంద్రబాబు అరెస్టైన తర్వాత వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ఈ వారాహి యాత్ర ప్రారంభం కానుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయగానే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎక్కువగా స్పందిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు, ఏపీ మంత్రి జోగి రమేష్ తదితరులు సీరియస్ విమర్శలు చేస్తున్నారు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్టోబర్ 1 నుండి జరిగే వారాహి యాత్రలో తనను నిత్యం విమర్శించే వైఎస్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది.ఈ నియోజకవర్గాల్లో యాత్ర సాగే సమయంలో తనపై విమర్శలు చేసే నేతలకు పవన్ కళ్యాణ్ ఏ రకమైన కౌంటర్ ఇస్తారోననే చర్చ సర్వత్రా సాగుతుంది.
అక్టోబర్ 1న ఆవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆవనిగడ్డ, మచిలీపట్టణం, పెడన ,కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. జగన్ పై , వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తే... ఆ విమర్శలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మచిలీపట్టణం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూడ సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేయడం లేదు. ఆయన తనయుడు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు.
పవన్ కళ్యాణ్ పై ఒంటికాలిపై విమర్శలు చేసే పేర్ని నాని అసెంబ్లీ నియోజకవర్గం గుండా వారాహి యాత్ర సాగనుంది.ఈ యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్ని నానికి కౌంటర్ ఇస్తారో చూడాలి.
perni nani
మరో వైపు మంత్రి జోగి రమేష్ కూడ అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గం నుండి కూడ వారాహి యాత్ర సాగుతుంది. పెడనలో పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులతో పాటు ప్రజలకు ఏం పిలుపు ఇస్తారో చూడాలి.
Jogi Ramesh (Pedana)
వారాహి యాత్ర నాలుగో విడత విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జనసేన నేతలతో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ నాలుగు రోజుల క్రితం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారాహి యాత్ర కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు ఏపీ రాజకీయాలకు కేంద్రమైన కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర ఏ రకంగా సాగుతుందో రాజకీయ పరిశీలకులు ఆసక్తి చూపుతున్నారు.