హైదరాబాద్, అమరావతి మధ్య బుల్లెట్ ట్రైన్ ... ఎంత వేగంతో దూసుకుపోతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల రాజధానులు మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టును చేపట్టింది. హైదరాబాద్, అమరావతితో పాటు చెన్నై, బెంగళూరు లను అనసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును సిద్దం చేస్తోంది.
Bullet Train
Amaravathi : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిల్లీ పర్యటన ముగిసింది. గత రెండ్రోజులుగా డిల్లీలోనే మకాం వేసి రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ పథకాల కోసం నిధులు రాబట్టే ప్రయత్నం చేసారు చంద్రబాబు. ఈ క్రమంలోనే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, కుమారస్వామి, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ ను కలిసారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏపీకి భారీ ప్రాజెక్టులను తీసుకువచ్చారు చంద్రబాబు. ఇందులో ముఖ్యమైనది బుల్లెట్ ట్రైన్. రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో భేటీ తర్వాత ఏపీకి బుల్లెట్ ట్రైన్ పై క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. కూటమి ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతికి బుల్లెట్ ట్రైన్ రానుందనే గుడ్ న్యూస్ తెలిపారు.
బుల్లెట్ ట్రైన్ ద్వారా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పట్టణాలతో అమరావతిని అనుసంధానం చేసేందుకు కేంద్రం సిద్దంగా వున్నట్లు చంద్రబాబు తెలిపారు. దేశంలోని కీలకమైన ఎకనమిక్ హబ్ ల గుండా బులెట్ ట్రైన్ ప్రయాణం జరుగుతుందని... దీనివల్ల ఎకానమీ ఆక్టివిటీస్ పెరుగుతాయన్నారు. 2026 నుండి బులెట్ ట్రైన్ పనులు ప్రారంభం అవుతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
Bullet Train
అసలు ఏమిటీ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ :
భారత ప్రభుత్వం రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే వందే భారత్ పేరిట అత్యంత వేగవంతమైన రైళ్లను ప్రారంభించారు. అయితే ఇంతకంటే అత్యాధునికతతో కూడిన రైళ్లను దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడిపేందుకు మోదీ సర్కార్ సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే బుల్లెట్ ట్రైన్ ను తెరపైకి తీసుకువచ్చింది.
టెక్నాలజీ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది జపాన్. ఇక్కడ అత్యధిక స్పీడ్ తో నడిచే బుల్లెట్ ట్రైన్స్ ఇప్పటికే అందుబాటులో వున్నాయి. ఇలాంటి హై స్పీడ్ రైల్వే సేవలను భారత ప్రజలకు అందించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. దీంతో జపాన్ సహకారంతో ముంబై, అహ్మదాబాద్ నగరాల బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మిస్తోంది.
2017 సెప్టెంబర్ 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ రెండు నగరాల మధ్య 508 కిలోమీటర్ల దూరం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం లక్షా పదివేల కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
ఈ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే దేశంలో ప్రయాణవేగం భారీగా తగ్గనుంది. ఈ ట్రైన్ గంటకు 320 నుండి 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అంటే ప్రస్తుతం ముంబై నుండి అహ్మదాబాద్ కు 508 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 6.30 గంటల సమయం పడుతుంది... ఇదే దూరాన్ని బుల్లెట్ ట్రైన్ లో కేవలం 2 గంటల 58 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ఇలా హైస్పీడ్ రైళ్ళ ప్రయాణానికి ప్రస్తుతం రైల్వే ట్రాక్స్ పనిచేయవు... అందువల్లే ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు.
Chandrababu Ashwini Vaishnav
హైదరాబాద్, అమరావతి బుల్లెట్ ట్రైన్ :
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని, తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఏపీ సీఎం ప్రతిపాదనను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓకే చెప్పింది. ముందుగా కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ను అనుసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును సిద్దం చేసారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో అమరావతిని కూడా చేర్చింది రైల్వే శాఖ.
డిల్లీ పర్యటనలో వున్న ఏపీ సీఎం చంద్రబాబు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అంశం చర్చకు వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్ లో అమరావతిని కూడా చేర్చేందుకు అంగీకరించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం చంద్రబాబుకు తెలపగా ఇదే విషయాన్ని ఆయన కూటమి ఎంపీలకు తెలిపారు.
ఈ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే అమరావతికి హైదరాబాద్ తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల రాజధానులు బెంగళూరు, చెన్నైలతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. కాబట్టి చాలా ఈజీగా ఈ నగరాల నుండి ఏపీ ప్రజలు తమ ప్రాంతాలను చేరుకునే వీలు వుంటుంది. అంతేకాదు ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుండి ఏపీకి తొందరగా చేరుకోవాలంటే విమాన సర్వీసులను ఆశ్రయించాల్సిందే. భవిష్యత్ లో బుల్లెట్ ట్రైన్ ఈ ప్రయాణ సమయాన్ని తగ్గించనుంది.
Chandrababu Modi
ఆంధ్ర ప్రదేశ్ కు ఇతర రైల్వే ప్రాజెక్టులు :
విశాఖ రైల్వే జోన్ కోసం కూడా ఆంధ్ర ప్రదేశ్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. రైల్వే శాఖ ఇందుకు అంగీకారం తెలిపినా అనేక కారణాలతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. కానీ ఇటీవల అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చాక విశాఖ రైల్వే జోన్ విషయంలో ముందడుగు పడింది. రైల్వే జోన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించింది. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. దీంతో
ఈ డిసెంబర్ లో విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు కేంద్రం సిద్దమయ్యింది.
ఇక విశాఖ రైల్వే జోన్ లోనే వాల్తేరు రైల్వే డివిజన్ ను వుంచాలని రైల్వే మంత్రిని ఏపీ సీఎం కోరారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు... అధికారుతో చర్చించి వెంటనే నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో జఠిలమైన సమస్యను పరిష్కారమయ్యింది.
ఇక హౌరా నుండి చెన్నై నేషనల్ హైవే రెండు లేన్లను 4 లేన్లుగా మార్చుతున్నారు... దీంతో గూడ్స్, రైళ్ల రాకపోకలు పెరుగుతాయి. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ప్రతి పట్టణం అనుసంధానం అవుతుంది. తద్వారా ఏకకాలంలో ఎకనమిక్, పోర్టు డెవలప్ మెంట్ తో పాటు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇక విజయవాడ నుంచి అమరావతి లైన్ కు కేంద్రం అంగీకరించింది.మచిలీపట్నం నుంచి రేపల్లె రైల్వే లైనుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
రాష్ట్రంలోని ప్రతీ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు రైల్వే మంత్రిని కోరారు. నడికుడి నుండి శ్రీకాళహస్తి, కోటపల్లి నుండి నర్సాపూర్, కడప నుండి బెంగళూరు లైన్ల కోసం మ్యాచింగ్ గ్రాంట్ కోరారు. ఇలా రూ.75 వేల కోట్ల రైల్వే పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయి.