భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణకు అపార నష్టం.. అన్నివిధాలా కేంద్రం సహకరిస్తుందని మోదీ భరోసా
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వరద నీరు పోటెత్తడంతో వాగులు, వంకలు ఏకం కాగా.. అంతా జలమయంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో మాట్లాడారు. కేంద్రం అన్ని విధాలా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమై పోయాయి. భారీ వర్షాలకు తోడు వరద నీరు పోటెత్తడంతో విజయవాడ, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలతో పాటు అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అలాగే, వరద నీట మునిగి లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
Heavy Rains in Telugu States
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు నగరాల్లో కుండపోత వర్షం కురిసింది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాన ఒక్కసారిగా కురవడంతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యారు. వాగులు, వంకలు ఏకమై.. పొంగి పొర్లాయి. సాధారణ రోడ్లతో పాటు జాతీయ రహదారులు సైతం నీట మునిగిపోవడంతో జనజీవనం స్తంభించింది.
Heavy Rains in Andhra Pradesh
భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
CM ChandraBabu Review on Heavy Rains
ఈ నేపథ్యంలో ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలన్నీ రద్దు చేసుకున్నారు. రెండు రోజులుగా వర్షాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. మరోవైపు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులను క్షేత్ర స్థాయిలో పరుగులు పెట్టించారు. జోరు వాన కురుస్తున్నా.. ఇబ్బందుల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లాలని యంత్రాంగాన్ని ఆదేశించడంతో అంతా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఎక్కడికక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి.. వారికి అవసరమైన కనీస సదుపాయాలు అందించారు.
Chandrababu's visit to flood affected areas
మరోవైపు, భారీ వర్షం, వరదతో ప్రభావితమైన విజయవాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం ముమ్మరంగా పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని.. ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. వరద ప్రభావం తగ్గేవరకు తాను విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉంటానని చెప్పారు. విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలోనే తాత్కాలిక క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకొని ఆదివారం రాత్రి అక్కడే బస చేసి.. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
Modi assurance for Telugu states
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదలు విసిరిన ఈ సవాలును అధిగమించేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి తెలుగు రాష్ట్రాలకు అవసరమైన సామాగ్రి పంపేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు రాష్ట్రానికి తెప్పించే అంశంపై చర్చించారు. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర హోం సెక్రటరీ చంద్రబాబు వివరించారు. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో 25 మంది సిబ్బంది, ఒక్కో టీమ్‌కు నాలుగు పవర్ బోట్లు ఉంటాయని తెలిపారు. ఇవన్నీ సోమవారం ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని స్పష్టం చేశారు. మొత్తం 40 పవర్ బోట్లు ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ చెప్పారు. వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లను, సహాయక చర్యల కోసం 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు ఏపీకి పంపుతున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొంటాయి.