GBS Death in AP : ఏపీలో తొలి జిబిఎస్ మరణం ... ఏమిటీ వ్యాధి? లక్షణాలేంటి?
ఆంధ్ర ప్రదేశ్ లో గులియన్ బారే సిండ్రోమ్ విజృంభిస్తోంది. ఇప్పటికే కొందరికి ఈ వ్యాధి సోకగా తాజాగా మరణాలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భయాందోళన పెరిగింది.

First GBS Death in Andhra Pradesh
Guillain Barre syndrome : మానవజాతిపై కంటికి కనిపించని సూక్ష్మజీవుల దాడి పెరిగిపోయింది... ఒకటి తర్వాత ఒకటి అటాక్ చేస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ తో ప్రారంభమైన ఈ దాడి ఇప్పుడు మరింత పెరిగింది. ప్రస్తుతం కరోనా భయం పోయినా బర్డ్ ప్లూ, గులియన్ బారే విజృంభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ వ్యాధులు వ్యాపించాయి... దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే గులియన్ బారే కేసులు చాలా నమోదయ్యాయి. చాలామంది ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతూ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఈ గులియన్ బారే సిండ్రోమ్ కారణంగా ఓ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో జిబిఎస్ భయం మరింత పెరిగింది.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ జిబిఎస్ బారినపడ్డారు. దీంతో కుంటుబసభ్యులు ఆమెను వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ (జిజిహెచ్) కు తరలించారు. ఆమెకు వైద్యులు మెరుగైన చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి వెంటిలేట్ పై చికిత్స పొందుతూ కమలమ్మ ప్రాణాలు వదిలారు.
గులియన్ బారేతో బాధపడుతున్న కమలమ్మ గుండె సమస్యతో ప్రాణాలు వదిలినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. మరో జిబిఎస్ బాధితురాలి పరిస్థితి కూడా విషమంగా ఉంది... ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆమెను కాపాడేందుకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ జిబిఎస్ వ్యాధి వచ్చిన వారిలో మరణాలు కేవలం 5 శాతంలోపే ... కాబట్టి ప్రజలు భయాందోళనకు గురికావద్దని జిజిహెచ్ సూపరింటెండెంట్ సూచించారు.
Guillain Barre syndrome
ఏమిటీ గులియన్ బారే సిండ్రోమ్ :
గులియన్ బారే అనేది ఓ బ్యాక్టిరియా ద్వారా సంక్రమించే వ్యాధి అని వైద్యులు అనుమానిస్తున్నారు... కానీ దీనిపై ఇంకా స్పష్టత లేదు. కేవలం Campylobacter jejuni అనే బ్యాక్టీరియా ఈ వ్యాధికి కారణమనే అనుమానాలు ఉన్నాయి.
ఈ జిబిఎస్ శరీరంలోకి ప్రవేశించి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. దీంతో ఈ బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన రోగనిరోధక శక్తి మన శరీరంపైనే దాడికి దిగుతుందట. నరాలపై దాడి చేయడంతో తిమ్మిర్లు,కండరాల బలహీనత, పక్షవాతం వచ్చే అవకాశాలుంటాయని చెబుతున్నారు. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
కాబట్టి జిబిఎస్ లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్య సాయం తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఇది ప్రమాదకరంగా మారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఏపీలో అయితే ఈ వైరస్ బారినపడ్డవారిని గుంటూరు జిజిహెచ్ లో చికిత్స అందిస్తున్నారు.
GBS
జిబిఎస్ లక్షణాలు :
గులియన్ బారే సిండ్రోమ్ బారినపడినవారిలో ముందుగా కనిపించే ప్రధానలక్షణం తిమ్మిర్లు. అరచేతులు, పాదాల్లో తిమ్మిర్లు వచ్చి మొద్దుబారినట్లు అయిపోతాయి. ఇది క్రమక్రమంగా పెరుగుతూ శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ తిమ్మిర్ల కారణంగా శరీరం జలదరింపులకు గురవుతుంది.
ఈ వ్యాధి సోకినవారిలో జ్వరం, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు కూడా జిబిఎస్ లక్షణాలే. కండరాల బలహీనత కారణంగా కాళ్లు, చేతుల నొప్పులు వుంటాయి.
ఈ జిబిఎస్ శ్వాస వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. శ్వాస కండరాలపైనా ఇది ప్రభావం చూపిస్తుంది... కాబట్టి ఇది సోకినవారు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సిండ్రోమ్ రక్తపోటుపై ప్రభావం చూపి గుండె పనితీరును దెబ్బతీస్తుంది. కొందరిలో ఇది హార్ట్ ఎటాక్ కు దారితీయవచ్చు. ఏపీ మహిళ మృతి ఇలాగే జరిగి ఉండొచ్చు.
కొన్నిసార్లు గొంతులోని కండరాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. దీంతో అహారం నమలడం, మింగడం, మాట్లాడటం ఇబ్బందిగా వుండవచ్చు. కొందరిలో కంటి కండరాలు కూడా బలహీనపడి నొప్పి, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మూత్రాశయంపైనా దీని ప్రభావం వుంటుంది. మూత్రంపై నియంత్రణ కోల్పోవడం కూడా ఈ లక్షణాల్లో ఒకటి.