AP Secretariat Fire Accident : పవన్ కల్యాణ్ కార్యాలయ భవనంలో అగ్నిప్రమాదం
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ పేషీ ఉన్న భవనంలోనే మంటలు చెలరేగాయి.

AP Secretariat Fire Accident
AP Secretariat Fire Accident : ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సచివాలయంలోని రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు.
వెంటనే సచివాలయానికి ఫైర్ ఇంజన్లతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసారు. దీంతో ఈ మంటలు సచివాలయంలోని ఇతర కార్యాలయాలకు వ్యాపించలేదు. అయితే ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఏదయినా కుట్ర కోణం దాగివుందా అన్నది తెలియాల్సి ఉంది.
ఈ అగ్నిప్రమాదం జరిగిన రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం ఉంది. అలాగే హోంమంత్రి అనిత, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, మున్సిపల్ మంత్రి నారాయణ పేషీలు కూడా బ్లాక్ లోనే ఉన్నాయి.
ఇలా వివిధ శాఖల కార్యాలయాలు ఉండటంతో నిత్యం అధికారులు, సామాన్య ప్రజలతో సచివాలయం రెండో బ్లాక్ కిటకిటలాడుతుంది. అయితే తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంలో కొంత ఆస్తి నష్టం జరిగినా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు సచివాలయ భద్రతా సిబ్బంది విచారణ చేపట్టారు.