Andhra Pradesh Jobs : ఏకంగా 26,263 పోస్టులు ఖాళీ ... 10 వేల ఉద్యోగాల భర్తీకి అంతా సిద్దం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమైంది. రాష్ట్రంలో కేవలం ఒక్క శాఖలోనే 26, 263 ఉద్యోగాలు ఖాళీగా వున్నట్లు గుర్తించిన ప్రభుత్వం అత్యవసరమైన 10 వేల పోస్టుల భర్తీకి సిద్దమైంది. ఇలా భర్తీచేయనున్న ఉద్యోగాలేవో తెలుసా?
Andhra Pradesh Jobs
Andhra Pradesh Jobs : ఆంధ్ర ప్రదేశ్ యువతకు గుడ్ న్యూస్... కూటమి సర్కార్ త్వరలోనే భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమవుతోంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేపడుతున్న చంద్రబాబు సర్కార్ వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన 26,263 ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని ప్రభుత్వం గుర్తించింది. వీటిని దశలవారిగా భర్తీచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra Pradesh Jobs
వైద్యారోగ్య శాఖలో ఖాళీలివే :
ఆంధ్ర ప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో మొత్తం 1,01,125 ఉద్యోగాలు వున్నాయి. వీటిలో డాక్టర్లు, పారా మెడికల్, ఇతర సిబ్బంది వున్నారు. అయితే ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో 75 శాతం మాత్రమే ఉద్యోగాలు భర్తీచేసి వున్నాయని... 25 శాతం ఖాళీగా వున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఉద్యోగుల కొరత కారణంగానే పేద, మధ్యతరగతి ప్రజలకు సరైన వైద్యం అందడంలేదని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయడానికి చంద్రబాబు సర్కార్ సిద్దమయ్యింది. అందుకోసమే ఈ శాఖలో ఖాళీల సమాచారాన్ని సేకరించింది. ఈ క్రమంలో ఏకంగా 3,114 డాక్టర్, 23,149 పారా మెడికల్ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని... ఇది ప్రజారోగ్యంపై చాలా ప్రభావితం చూపిస్తోందని తేలింది.
వైద్య ఆరోగ్య శాఖలోని విభాగాలు DME (Directorate of medical education), DSH (Directorate of secondary Health), DH (Directorate of public health), ఆయుష్, జాతీయ ఆరోగ్య మిషన్ లో చాలా ఖాళీలు వున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఈ వివరాలను సేకరించింది వైద్య ఆరోగ్య శాఖ. ఈ ఖాళీలను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది... ఈ క్రమంలోనే మొదట పదివేల వరకు భర్తీ చేసే యోచనలో వున్నట్లు సమాచారం.
విభాగాల వారిగా చూసుకుంటే డిఎంఈ లో మొత్తం 32,635 పోస్టులుంటే అందులో ఏకంగా 12,089 ఖాళీగా వున్నాయి. అంటే ఈ విభాగంలో ఏకంగా 37 శాతానికి పైగా ఉద్యోగాలు ఖాళీగా వున్నాయన్నమాట. ఇక డిఎస్‌హెచ్ లో 13,058 ఉద్యోగాల్లో 1,895 ఖాళీగా వున్నాయి. డిపిహెచ్ లో 30,356 ఉద్యోగాలకు గాను 8,791 ఖాళీలు వున్నాయి.
ఆయుష్ విభాగం పరిస్థితి మరీ దారుణం... ఇందులో మొత్తం వున్నదే 2,426 పోస్టులు, అందులో 1,538 అంటే 63 శాతం ఖాళీలు వున్నాయి. ఎన్‌హెచ్‌ఎం లో 22,650 పోస్టులకు గాను 1,950 పోస్టులు ఖాళీగా వున్నాయి.
మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 14,544 డాక్టర్ పోస్టులుంటే అందులో 3,114 పోస్టులు ఖాళీగా వున్నాయి. అంటే చాలా హాస్పిటల్లో కీలకమైన డాక్టర్ పోస్టులే ఖాళీగా వున్నాయన్నమాట. ఇక పారామెడికల్ ఉద్యోగాలు 86,581 వుంటే అందులో 23,149 ఖాళీలున్నాయి.
Andhra Pradesh Jobs
ఈ హాస్పిటల్స్ లో ఇదీ పరిస్థితి :
బోధనా హాస్పిటల్స్ లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటి వైద్యుల కొరత ఎక్కువగా వున్నాయి. విజయవాడ జిజిహెచ్ లో 314 పోస్టులకు గాను 46 ఖాళీలు వున్నాయి. ఇక గుంటూరు జిజిహెచ్ లో 65 డాక్టర్ పోస్టులు ఖాళీగా వున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వున్న పిహెచ్‌సిలలో 708 డాక్టర్ పోస్టులు, 9,978 పోస్టులు ఖాళీగా వున్నాయి. అలాగే బోధనా హాస్పిటల్స్ లో 10,065 పారామెడికల్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇందులో అత్యధికంగా నర్సింగ్ పోస్టులు ఖాళీగా వున్నాయి.
ఇక జిల్లా, నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరత వుంది. దీంతో ప్రభుత్వాసుపత్రులకు వైద్యం కోసం వెళ్లే పేద, మద్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల వివరాలను సేకరించారు... వీటిలో అవసరం అయినవి భర్తీ చేయడానికి సిద్దమయ్యారు.